Assembly Elections | త్వరలోనే ఎన్నికల జాతర.. ఏ ఏ రాష్ట్రాల్లో అంటే
విధాత: కర్ణాటక ఎన్నికల ప్రహసనం ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టీ లోక్‌సభ ఎన్నికల ముందు జరగనున్న అయిదు రాష్ట్రాల ఎలక్షన్స్ (Assembly Elections) పై పడింది. కన్నడ నాట అద్భుతమైన విజయం సాధించిన కాంగ్రెస్ రెట్టించిన ఉత్సాహంతో పని చేయనుండగా.. బీజేపీ ఈ ఓటమి నుంచి బయటపడేలా విజయం సాధించాలని ప్రణాళికలు రచిస్తోంది. 2014 తర్వాత కాంగ్రెస్‌కు విజయాల కంటే ఓటమిలే ఎక్కువని, తమ విజయ పరంపరను అలానే కొనసాగిస్తామని కమలనాథులు చెబుతుండగా.. బీజేపీ విముక్త దక్షిణ […]

విధాత: కర్ణాటక ఎన్నికల ప్రహసనం ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టీ లోక్‌సభ ఎన్నికల ముందు జరగనున్న అయిదు రాష్ట్రాల ఎలక్షన్స్ (Assembly Elections) పై పడింది. కన్నడ నాట అద్భుతమైన విజయం సాధించిన కాంగ్రెస్ రెట్టించిన ఉత్సాహంతో పని చేయనుండగా.. బీజేపీ ఈ ఓటమి నుంచి బయటపడేలా విజయం సాధించాలని ప్రణాళికలు రచిస్తోంది.
2014 తర్వాత కాంగ్రెస్‌కు విజయాల కంటే ఓటమిలే ఎక్కువని, తమ విజయ పరంపరను అలానే కొనసాగిస్తామని కమలనాథులు చెబుతుండగా.. బీజేపీ విముక్త దక్షిణ భారత్‌తో కమలం పార్టీ పతనం ప్రారంభమయిందని, వచ్చే ప్రతి ఎన్నికల్లో వారిని మట్టి కరిపిస్తామని, హస్తం, దాని మిత్రపక్షాలు కారాలు మిరియాలు నూరుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఈ ఏడాది చివరలో జరగనున్న మిజోరం, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాలు ఎన్నికల బరిలోకి వెళ్లనున్నాయి. వేర్వేరు తేదీల్లో వీటి అసెంబ్లీ గడువు ముగుస్తుండగా.. అన్నింటికీ కలిపి ఒకే తేదీల్లో పోలింగ్ నిర్వహించే అవకాశమూ లేకపోలేదని నిపుణులు చెబుతున్నారు.
ఇవే కాకుండా కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కశ్మీర్‌లోనూ ఈ వేసవిలో ఎన్నికలు జరగనున్నాయని ప్రచారం జరుగుతోంది. ఏతావతా ఈ ఏడాది చివరి నుంచి వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల వరకు ఎన్నికల జాతరను చూడటానికి దేశం సిద్ధమవుతోంది.
ఈ ఏడాది చివరిలో ఎన్నికలకు వెళ్లనున్న రాష్ట్రాలు
రాష్ట్రం | అసెంబ్లీ సీట్లు | అధికారంలో ఉన్నది | అసెంబ్లీ గడువు |
ఛత్తీస్‌గఢ్ | 90 | కాంగ్రెస్ | 2024 జనవరి 3 వరకు |
మధ్యప్రదేశ్ | 230 | బీజేపీ | 2024 జనవరి 6 వరకు |
మిజోరం | 40 | ఎంఎన్ఎఫ్ | 2023 డిసెంబరు 17 |
రాజస్థాన్ | 200 | కాంగ్రెస్ | 2024 జనవరి 14 |
తెలంగాణ | 119 | బీఆర్ఎస్ | 2024 జనవరి 16 |
వీటిలో విజయఢంకా మోగించిన పార్టీనే పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటుతుందని చెప్పలేనప్పటికీ కచ్చితంగా ప్రభావం అయితే ఉంటుంది.