Telangana BJP | మా దారి మేం చూసుకుంటాం.. BJP పెద్దలను కలిసిన ఈటల, రాజగోపాల్‌రెడ్డి

అదే బాటలో డీకే, కొండా విధాత‌: రాష్ట్ర బీజేపీ (Telangana BJP)లో ఏం జరుగుతున్నది? ఈ ఏడాదిలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున నేతలంతా కొత్త, పాత తేడా లేకుండా కలిసికట్టుగా పనిచేయాలని పార్టీ అధిష్టానం సూచిస్తే.. దాన్ని నేతలు ఆచరిస్తున్నారా? నేతల మధ్య విభేదాలు సమసిపోయి సఖ్యత నెలకొన్నదా? అంటే అదేమీ లేదు అనే సమాధానాలే వస్తున్నాయి. రాష్ట్ర బీజేపీకి సారథ్యం వహిస్తున్న సంజయ్‌ వైఖరితో విసిగిపోతున్న కొంతమంది నేతలను ఆయనను తప్పించాలని కోరుతున్నారు. దీంతో […]

Telangana BJP | మా దారి మేం చూసుకుంటాం.. BJP పెద్దలను కలిసిన ఈటల, రాజగోపాల్‌రెడ్డి
  • అదే బాటలో డీకే, కొండా

విధాత‌: రాష్ట్ర బీజేపీ (Telangana BJP)లో ఏం జరుగుతున్నది? ఈ ఏడాదిలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున నేతలంతా కొత్త, పాత తేడా లేకుండా కలిసికట్టుగా పనిచేయాలని పార్టీ అధిష్టానం సూచిస్తే.. దాన్ని నేతలు ఆచరిస్తున్నారా? నేతల మధ్య విభేదాలు సమసిపోయి సఖ్యత నెలకొన్నదా? అంటే అదేమీ లేదు అనే సమాధానాలే వస్తున్నాయి. రాష్ట్ర బీజేపీకి సారథ్యం వహిస్తున్న సంజయ్‌ వైఖరితో విసిగిపోతున్న కొంతమంది నేతలను ఆయనను తప్పించాలని కోరుతున్నారు.

దీంతో సంజయ్‌ను పక్కనపెట్టి ఈటల రాజేందర్ (Etala Rajender) లాంటి నేతలకు పార్టీ పగ్గాలు అప్పగిస్తారనే చర్చ జరుగుతున్నది. ముఖ్యంగా బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలను వీడి బీజేపీలో చేరిన నేతలు ఇదే అంశంపై స్పష్టత కోసం ఈ మధ్య హస్తినబాట పట్టారట.

వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) పదవీ కాలం ముగిసినా మరో ఏడాది పొడిగించారు. అలాగే ఏపీ సహా మరికొన్ని రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను ప్రకటించారు. ఒక్క తరుణ్‌చుగ్ (Tarunchug) మినహా ఎవరూ ఇప్పటివరకు ఆయన నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్తామని ప్రకటించలేదు.

బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటేనా?

లిక్కర్‌ స్కాం ఉదంతమే తీసుకుంటే.. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న, నిందితులుగా ఉన్న ఆప్‌ నేతలు దీన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) అయితే ఈ కేసు ఏమిటో తనకు ఇప్పటికీ అర్థం కావడం లేదని అంటున్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ.. అరెస్టైన మనీశ్‌ సిసోడియా(Manish Sisodia), మనీలాండరింగ్‌ కేసులో మరో మంత్రి సత్యేంద్రజైన్‌ (Satyendra Jain) తమ పదవులకు రాజీనామా చేశారు.

కానీ ఈ కేసులో అనుమానితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నె ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) విచారణ సందర్భంగా దేశవ్యాప్తంగా దానికి ప్రచారం కల్పించేలా చేయడం వల్ల ఎవరికి లాభం జరుగుతున్నదనే అభిప్రాయం నేతల్లో నెలకొన్నది.

మరికొన్ని నెలల్లో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ జేడీఎస్‌తో కలిసి బీఆర్‌ఎస్‌ పోటీ చేస్తుందని ఇప్పటికే కేసీఆర్‌ ప్రకటించారు. ఈ నేపథ్యంలో కవిత విచారణ సమయంలో కొంతమంది నేతలు ఆమెను అరెస్టు చేస్తారని ముందే చెప్పడం, టీవీల్లో దానికి విశేష ప్రచారం కల్పించడం, సంజయ్‌ లాంటి నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వంటివి అధికార పార్టీకి లాభించేలా ఉన్నాయి.

రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా బీజేపీ గట్టిగా పోరాడుతున్నా.. జాతీయ స్థాయిలో దీన్ని భిన్నంగా పరిస్థితులు ఉన్నాయని.. దీంతో తమకు క్లారిటీ కావాలని ఈటల రాజేందర్‌, రాజగోపాల్‌రెడ్డి (Rajagopal Reddy) లాంటి నేతలు బీఎల్‌ సంతోష్‌(BL Santosh), అమిత్ షా(Amit Shah)లను కోరారని సమాచారం.

బీజేపీ, బీఆర్‌ఎస్‌ నేతలతు గల్లీలో కొట్లాట.. ఢిల్లీలో దోస్తానా? అని కాంగ్రెస్‌ నేతలు వ్యాఖ్యలు వాస్తవమే అనేలా పరిణామాలు ఉన్నాయని.. ఇలాగైతే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి కష్టమేనని ఈ ఇద్దరు నేతలు ఆపార్టీ అగ్రనేతల దగ్గర ప్రస్తావించారట. మీరు దీనిపై ఏదో ఒకటి తేలిస్తే మా దారి మేము చూసుకుంటామంటే.. అందరూ కలిసి బస్సు యాత్ర చేయాలని సూచించారు మినహా వీళ్ల ప్రశ్నలకు సరైన సమాధానాలు గానీ, వీరికి తగిన ప్రాధాన్యం లాంటి హామీలు ఏమీ ఇవ్వలేదని తెలుస్తోంది.