తెలంగాణలో 12 సీట్లు గెలుస్తాం

కేంద్రంలో మళ్లీ ప్రధాని మోదీ ప్రభుత్వం రాబోతుందని, దేశంలోని అన్ని సర్వేలు అదే విషయాన్ని ఇప్పటికే స్పష్టం చేశాయని మాజీ మంత్రి, బీజేపీ మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తెలిపారు.

  • By: Somu    latest    Mar 14, 2024 11:31 AM IST
తెలంగాణలో 12 సీట్లు గెలుస్తాం
  • మల్కాజిగిరిలో విజయం నాదే
  • ఎంపీగా సీఎం రేవంత్‌రెడ్డి చేసేందేమిలేదు
  • రేప‌టి ప్రధాని రోడ్ షోకు భారీగా జనం


విధాత, హైదరాబాద్: కేంద్రంలో మళ్లీ ప్రధాని మోదీ ప్రభుత్వం రాబోతుందని, దేశంలోని అన్ని సర్వేలు అదే విషయాన్ని ఇప్పటికే స్పష్టం చేశాయని మాజీ మంత్రి, బీజేపీ మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో 12సీట్లు బీజేపీ గెలవబోతుందని, మల్కాజిగిరిలో బీజేపీ అభ్యర్థిగా తాను గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం మిర్జాలగూడ చౌరస్తా నుంచి మల్కాజిగిరి చౌరస్తా వరకు 1.3కిలోమీటర్లు ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో కొనసాగుతుందని, ఈ రోడ్‌షోకు ప్రజలు భారీగా హాజరుకాబోతున్నారని తెలిపారు.


పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ గెలుపును ఎవరు ఆపలేరని, డబ్బు, మద్యం, ప్రలోభాలకు ఈసారి తావులేదన్నారు. డబ్బున్న వారికోసం బీఆరెస్‌, కాంగ్రెస్ పార్టీలు వెలుతుకున్నాయని, ఆ రెండు పార్టీలకు ఇప్పటివరకు అభ్యర్థులు లేరని ఎద్దేవా చేశారు. దేశం సురక్షితంగా ఉండటానికి, ఆర్థికవ్యవస్థలో ప్రపంచంలో మూడో శక్తిగా ఎదగాలంటే, బాంబుల మోతలు లేకుండా ఉండాలంటే మళ్ళీ మోదీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని, 500ఏండ్ల రామమందిరం కలను మోదీ పూర్తి చేశారని, కాంగ్రెస్ నాయకుల ఇళ్లల్లో ఉన్న కుటుంబ సభ్యులు కూడా ఈదఫా మోదీకే ఓటు వేస్తామని అంటున్నారని ఈటల చెప్పారు.


మోదీ పాలనలో 370రద్దయి కాశ్మీర్ లాల్ చౌక్‌లో మువ్వన్నెల జెండా స్వేచ్చగా ఎగురవేస్తున్నామని, దేశంలో పదేళ్లలో ఎలాంటి స్కామ్‌లు లేకుండా అవినీతి రహిత పాలన సాగిందని, అభివృద్ధితో పాటు ఆత్మగౌరవ బావుటాను మోదీ ఎగురవేశారని ఈటల చెప్పారు. టాయిలెట్స్ కట్టించి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడిన బిడ్డ నరేంద్ర మోదీ అని, మోదీ కంటే ముందు.. రోజుకు 11 కిలోమీటర్ల నేషనల్ హైవే లు వేస్తే ఇప్పుడు 28 కిలోమీటర్ల వేస్తున్నారని, 2014 కంటే ముందు 75 విమానాశ్రయాలు ఉంటే ఇప్పుడు 150 అయ్యాయని, నేషనల్ హైవేలు, సంస్కృతి సంప్రదాయాలు, అభివృద్ది, ఆత్మగౌరవం అప్పటికే ఇప్పటికి నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉందని ఈటల వ్యాఖ్యానించారు.


సీఎం రేవంత్‌రెడ్డి కళ్లు నెత్తికెక్కాయి


అధికారంలోకి రాగానే సీఎ రేవంత్ రెడ్డి కళ్లు నెత్తికెక్కాయని, రాష్ట్ర మంత్రిగా తెలంగాణ అంతా బాగుచేస్తం కానీ మల్కాజిగిరికి ఎం చేశారు అని ఆయన సోయి లేకుండా అడుగుతున్నారని ఈటల విమర్శించారు. మంత్రిగా సన్నబియ్యం తెచ్చింది నేను..కులసంఘాల హాస్టల్స్ తెచ్చింది నేను అని చెప్పారు. తాను చదువుకుంది ఇక్కడేనని, 32 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నానని, 5 ఏళ్లుగా ఎంపీ ఉన్న రేవంత్ రెడ్డి ఒక్కనాడైనా వచ్చారా? ఏమన్నా చేశారా ? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఉద్యమ సమయంలో చంద్రబాబు దగ్గర ఉన్నాడని, తెలంగాణ ఉద్యమ కారుల మీద తుపాకీ ఎక్కుపెట్టిన వాడని గుర్తు చేశారు. కాంగ్రెస్‌, బీఆరెస్‌లకు ఓటు వేస్తే ఏం చేయలేరని, దరఖాస్తు ఇచ్చి దండం పెట్టడం తప్ప అని, ప్రధాని మోదీ ఇటీవల పఠాన్ చెరులో తెలంగాణను బీజేపీని గెలిపిస్తే రెండింతల అభివృద్ది నిధులు ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు.


రాజకీయ పార్టీకి లెఫ్టిస్ట్ రైటిస్ట్ ఉండవని, ప్రజలకు సేవచేయడమే లక్ష్యమన్నారు. ఫిలాసఫీ ప్రజల కోసం ఉండాలని స్పష్టం చేశారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజిగిరి లోక్‌సభ స్థానం పరిధిలో వివిధ అసెంబ్లీ సెగ్మెంట్‌లలో కలిపి 9,38,000 ఓట్లు బీఆరెస్‌కు, 5,83,000 కాంగ్రెస్‌కు, 4,25,000 బీజేపీకి ఓట్లు వచ్చాయని, గతంలో 2018 శాసన సభ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 4 లక్షల మెజారిటీ వస్తే.. మూడు నెలల్లోనే బీజేపీ లక్ష ఓట్ల మెజార్టీతో విజయం సాధించిన సంగతి మరువరాదన్నారు. 2018లో ఎమ్మెల్యే ఎన్నికల్లో 107 స్థానాల్లో బీజేపీకి డిపాజిట్ రాలేదని, కానీ మూడు నెలల్లోనే మోదీ కోసం నాలుగు పార్లమెంట్ స్థానాలను ప్రజలు గెలిపించిన సంగతి గుర్తు పెట్టుకోవాలన్నారు. 9 లక్షల ఓట్లు వచ్చినా బీఆరెస్ నుంచి పోటీకి ఎందుకు ముందుకు రావడం లేదని, అందుకే ఎవరికి ఎన్నిసీట్లు వచ్చినా గెలిచేది బీజేపీనే అని ధీమా వ్యక్తం చేశారు.