ఆ స్కూల్‌లో.. అందరూ టీనేజీ తల్లులే..! పుస్తకాల బ్యాగు, చంకలో బిడ్డతో పాఠశాలకు
విధాత: అమెరికా-మెక్సికో సరిహద్దు పట్టణం టెక్సాస్ బ్రౌన్స్‌నిల్ లో ఓ స్కూల్ ఉన్నది. విద్యార్థులందరూ వీపుపై పుస్తకాల బ్యాగులతో పాటు చంకల్లో బిడ్డలనెత్తుకొని స్కూల్ బస్ దిగుతున్నారు. పాఠశాల తరగతి గదులన్నీ విద్యార్థుల హడావుడితో పాటు చిన్న పిల్లల ఏడుపులతో దద్దరిల్లుతున్నవి. అది లింకన్ పార్క్ హై స్కూల్. లింకన్ పార్క్ హైస్కూల్‌ను సింథియా కార్డినాస్ 2005లో ప్రారంభించారు. టీనేజీ వయస్సులో తల్లులవుతున్న వారి కోసం ప్రత్యేకంగా కార్డినాస్ ఈ పాఠశాలను నడుపుతున్నారు. దాంట్లో ఇప్పుడు 70 […]

విధాత: అమెరికా-మెక్సికో సరిహద్దు పట్టణం టెక్సాస్ బ్రౌన్స్‌నిల్ లో ఓ స్కూల్ ఉన్నది. విద్యార్థులందరూ వీపుపై పుస్తకాల బ్యాగులతో పాటు చంకల్లో బిడ్డలనెత్తుకొని స్కూల్ బస్ దిగుతున్నారు. పాఠశాల తరగతి గదులన్నీ విద్యార్థుల హడావుడితో పాటు చిన్న పిల్లల ఏడుపులతో దద్దరిల్లుతున్నవి.
అది లింకన్ పార్క్ హై స్కూల్. లింకన్ పార్క్ హైస్కూల్‌ను సింథియా కార్డినాస్ 2005లో ప్రారంభించారు. టీనేజీ వయస్సులో తల్లులవుతున్న వారి కోసం ప్రత్యేకంగా కార్డినాస్ ఈ పాఠశాలను నడుపుతున్నారు. దాంట్లో ఇప్పుడు 70 మంది దాకా పేర్లు నమోదు చేసుకొన్నట్లు చెప్తున్నారు.
టీనేజీలోనే తల్లులవుతున్న వారి జీవితానుభవాలు గంభీరమైనవి. ఎంతో ఉదారంగా, మానవీయంగా అర్థం చేసుకుంటే తప్పా వారికి స్వాంతన చేకూర్చలేము. హెలెన్ అమ్మాయి తన హైస్కూల్ రోజుల్లోనే తల్లి అయ్యింది. మొదట్లో తనలో, శరీరంలో వస్తున్న మార్పుల పట్ల ఆమెకు ఏమీ అర్థం కాలేదు. ఆ తర్వాత ఆందోళన మొదలైంది.
అందరికన్నా ఎక్కువ ఆహారం తినాలనిపించటం, ఎక్కువ సార్లు తినాలనిపించటం ఆమెకు వింతగానూ తోచింది. ఒకానొక రోజున తన పుట్టిన రోజునాడే తాను తల్లి కాబోతున్నట్లు తెలిసింది. ఆ తర్వాత విషయం తెలిసి స్నేహితులంతా హెలెన్‌తో మాట్లాడటం మానేశారు. చివరికి బిడ్డకు కారణమైన తన క్లాస్‌మేట్ కూడా మాట్లాడటం మానేశాడు. అప్పుడు గానీ గర్భం దాల్చటం ఎంతటి తీవ్ర విషయమో హెలెన్‌కు అనుభవం లోకి రాలేదు.
ఊహించని విధంగా తాను గర్భవతినని తెలిసినప్పుడు హెలెన్ తీవ్ర ఆందోళనకు గురైంది. ఏం చేయాలో అర్థం కాలేదు. వచ్చిన గర్భాన్ని ఉంచుకోవాలా? అబార్షన్‌తో తీసి వేయించుకోవాలా అన్న మీమాంసలో పడిపోయింది. చివరికి తన గర్భాన్ని ఉంచుకోవాలనే నిర్ణయించుకొన్నది. తన నిర్ణయాన్ని తన తల్లి ఆమోదించింది. ఆ క్రమంలో తన లాంటి వారికి విద్య కొనసాగించే అవకాశం కల్పిస్తున్న ప్రత్యేక స్కూల్ ఉన్నదని తెలుసుకొని లింకన్ పార్క్ స్కూల్‌లో చేరింది.
తానిప్పుడు తన హై స్కూల్ చదువును కొనసాగిస్తూనే.. పక్కనే ఉన్న డే కేర్‌లో తన బిడ్డను సురక్షితంగా పోషించుకొంటున్నది. ఆ స్కూల్‌లో హెల్‌న్ లాంటి టీనేజీ తల్లులెందరో ఉన్నారు. ఒక్కొక్కరి జీవితం ఓ గాథ. ఈ మధ్యనే 2022లో అమెరికా ప్రభుత్వం అబార్షన్లకు ఉన్న రక్షణను తీసివేసింది. దీంతో మరింతగా టీనేజీ గర్భాలు పెరగవచ్చని సింథియా కార్డినాస్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాబట్టి మిడిల్, హైస్కూల్ స్థాయిల్లో సెక్స్ ఎడ్యుకేషన్ తప్పనిసరిగా అందించాలని అంటున్నారు. సెక్స్‌పై అవగాహనా రాహిత్యం మూలంగానే ఎంతో మంది టీనేజీ అమ్మాయిలు గర్భవతులవుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వారికి అన్నివిధాలా సమాజం అండగా నిలవాల్సిన అవసరం ఉన్నదని సింథియా కార్డినాస్ అంటున్నారు.