హామీలు అమలు చేసేదాకా కాంగ్రెస్‌ను విడిచిపెట్టం

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేసేదాకా విడిచిపెట్టే ప్రసక్తే లేదని బీఆరెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించారు

  • By: Somu    latest    Feb 27, 2024 12:04 PM IST
హామీలు అమలు చేసేదాకా కాంగ్రెస్‌ను విడిచిపెట్టం
  • అప్పుడు అందరికని చెప్పి..ఇప్పుడు కొందరికే అమలు
  • తప్పుదారి కాంగ్రెస్‌కు ఓటేశామనకుంటున్న జనం
  • అంబర్‌పేట్‌ నియోజకవర్గం సమావేశంలో కేటీఆర్‌


విధాత, హైదరాబాద్‌ : అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేసేదాకా విడిచిపెట్టే ప్రసక్తే లేదని బీఆరెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంగళవారం అంబర్‌పేట నియోజకవర్గం బీఆరెస్‌ సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా జనం నుంచి ఒక్కటే మాట వినిపిస్తోందని, తప్పుదారి కాంగ్రెస్‌కు ఎన్నికల్లో ఓటేశామని జనం అనుకుంటున్నారని చెప్పారు.


కాంగ్రెస్ ఇచ్చిన హామీలను చూసి మోస పోయామని జనం చెబుతున్నారన్నారు. ఎన్నికలలో అందరికి సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పి, ఇప్పుడు అనేక ఆంక్షలతో కొందరికే పరిమితం చేస్తూ కాంగ్రెస్‌ మరో మోసానికి పాల్పడుతుందన్నారు. రాష్ట్రంలో కోటి 37 లక్షల 50 వేల కరెంట్ మీటర్లు ఉన్నాయని.. వాళ్లలో కొంత మందికి మాత్రమే గృహజ్యోతి ఇస్తామని చెబుతున్నారన్నారు.


ఇదే విషయం ఎన్నికల ముందు చెబితే జనం కాంగ్రెస్‌ నేతలను తన్ని పంపేవారన్నారు. తెలంగాణలో18 ఏళ్లు నిండిన కోటి 67 లక్షల మంది మహిళలు ఉన్నారని వారందరికి రూ. 2500 పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మార్చి 17వ తేదీకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 100 రోజులు నిండుతాయని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేకపోతే జనం బొంద పెడతారని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి కల్లబొల్లి కబుర్లు కట్టిపెట్టి జనం సమస్యలు పరిష్కరించాలని కోరారు.


కాంగ్రెస్ ఇచ్చిన దొంగ హామీలను బీఆరెస్‌ కేడర్‌ జనంలోకి తీసుకెళ్లాలన్నారు. మార్పు అని ఓటేస్తే రేవంత్ ప్రభుత్వం తమ కడుపు కొట్టిందని ఆటో డ్రైవర్లు బాధ పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో గోషామహల్ మినహా అన్ని ఎమ్మెల్యే స్థానాల్లో తామే గెలిచామన్నారు. లోక్‌ సభ ఎన్నికల్లో గ్రేటర్‌ పరిధిలోని మల్కాజిగిరి, సికింద్రాబాద్ స్థానాల్లో గులాబీ జెండా ఎగరాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.