కేటీఆర్ పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత.. ఈటల దూరం

NSUI కార్యకర్తల నిరసన విద్యార్థులపై గులాబీ నాయకుల దాడి పోలీసుల సాక్షిగా పిడిగుద్దులు కాంగ్రెస్, బీజేపీ నాయకుల అరెస్టు మంత్రి కేటీఆర్ పర్యటనకు ఎమ్మెల్యే ఈటల దూరం విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్ర మునిసిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హుజరాబాద్ నియోజకవర్గ పర్యటన సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంత్రి రాక సందర్భంగా ఎన్ ఎస్ యు ఐ కార్యకర్తలు నిరసన తెలియజేస్తూ నల్లజెండాలను ప్రదర్శించారు. కేటీఆర్ పర్యటనలో బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు విద్యార్థులను […]

  • By: Somu    latest    Jan 31, 2023 10:31 AM IST
కేటీఆర్ పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత.. ఈటల దూరం
  • NSUI కార్యకర్తల నిరసన
  • విద్యార్థులపై గులాబీ నాయకుల దాడి
  • పోలీసుల సాక్షిగా పిడిగుద్దులు
  • కాంగ్రెస్, బీజేపీ నాయకుల అరెస్టు
  • మంత్రి కేటీఆర్ పర్యటనకు ఎమ్మెల్యే ఈటల దూరం

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్ర మునిసిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హుజరాబాద్ నియోజకవర్గ పర్యటన సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంత్రి రాక సందర్భంగా ఎన్ ఎస్ యు ఐ కార్యకర్తలు నిరసన తెలియజేస్తూ నల్లజెండాలను ప్రదర్శించారు. కేటీఆర్ పర్యటనలో బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు విద్యార్థులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు.

ఈ సందర్భంగా విద్యార్థులు, పోలీసుల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. విద్యార్థుల నిరసన నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగింది. ఇక కొద్దిసేపులో కేటీఆర్ కమలాపురం వస్తున్నారని, ఎన్ఎస్‌యూఐ విద్యార్థులు ఆకస్మికంగా ఈ నిరసన చేపట్టడంతో పోలీసులు కంగుతిన్నారు. కేటీఆర్ కాన్వాయ్ కు అడ్డుపడతారని భావించి వారిని నిరోధించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో తీవ్రత తోపులాట జరిగింది.

– గులాబీ పార్టీ నాయకుల పిడిగుద్దులు

ఇదిలా ఉండగా తమ నాయకుడి పర్యటన సందర్భంగా కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘమైన ఎన్ ఎస్ యు ఐ విద్యార్థులు నిరసన తెలియజేయడం పట్ల ఆగ్రహానికి లోనైన కొందరు గులాబీ పార్టీ నాయకులు పోలీసుల సమక్షంలోనే విద్యార్థి నాయకులపై పిడుగులు కురిపించారు. టీషర్టులను చింపి తీవ్రంగా దాడి చేసే ప్రయత్నం చేశారు. దీంతో పరిస్థితి మరింత తీవ్ర రూపం దాల్చింది. అప్రమత్తమైన పోలీసులు ఇరువర్గాలను వేరు చేసి నిరసన తెలియజేసిన విద్యార్థి నాయకులను అదుపులోకి తీసుకున్నారు.

– నిరసన చేపట్టడం అన్యాయమా?

కాగా, తాము విద్యార్థుల సమస్యలపై రాష్ట్ర మంత్రి దృష్టికి తెచ్చేందుకు శాంతియుతంగా నిరసన తెలియజేసే ప్రయత్నం చేశామని కానీ పోలీసులు అతిగా వ్యవహరించడంతో ఇదే అదనుగా గులాబీ పార్టీ నాయకులు కొందరు కక్షగట్టి తమపై దాడి చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై దాడి చేసిన నాయకులను తాము గుర్తిస్తామంటూ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు మౌన ప్రేక్షక పాత్ర వహించడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.

– కాంగ్రెస్ నాయకుల ముందస్తు అరెస్టు

మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా ముందస్తు అరెస్ట్ చేసిన కమలాపూర్ కాంగ్రెస్ నేతలను ముందస్తు అరెస్ట్ చేసి మడికొండ పోలీస్ ట్రైనింగ్ క్యాంపు కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్నాయిని రాజేందర్ రెడ్డి మడికొండ పోలీస్ ట్రైనింగ్ క్యాంపు వెళ్లి వారిని పరామర్శించడం జరిగింది. మంత్రుల పర్యటనలు ఉంటే ఈ ముందస్తు అరెస్టులు చేయడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.

– కేటీఆర్ పర్యటనకు ఎమ్మెల్యే ఈటల దూరం

రాష్ట్ర మంత్రి గులాబీ పార్టీ నేత కేటీఆర్ హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని కమలాపురం, గూడూరులో చేపట్టిన పర్యటనకు మాజీమంత్రి తాజా హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ దూరంగా ఉన్నారు. తన నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించేందుకు మంత్రి హోదాలో కేటీఆర్ రాగా ఈ కార్యక్రమానికి ఈటల దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది.

ముందస్తు ప్రణాళికలో భాగంగానే కేటీఆర్ పర్యటనకు ఈటెల దూరంగా ఉన్నారని భావిస్తున్నారు. పూలు అమ్మిన చోటనే కట్టెలు అమ్మడం కరెక్ట్ కాదని భావించారేమోనని తన సన్నిహితులు చెబుతున్నారు. ఒకప్పుడు మంత్రిగా కరీంనగర్ జిల్లాలో తన నియోజకవర్గంలో ఒక వెలుగు వెలిగిన ఈటల ఎందుకైనా మంచిదని కేటీఆర్ పర్యటనకు దూరంగా ఉన్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు.