మొత్తానికి గరికపాటి తగ్గారు!!
విధాత: ఎవరు గొప్ప.. ఎవరు ఘనాపాటి.. ఎవరు లెజండ్.. ఎవరు సెలబ్రిటీ.. ఇది పలు సందర్భాల్లో చర్చకు రావడం.. ఆయా అభిమానుల మధ్య వాదోపవాదాలు.. గొడవలకు దారి తీసిన విషయం అందరికి తెలిసిందే… దసరా సందర్భంగా హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ హైదరాబాద్లో నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమం కూడా ఇలాంటి చర్చకు.. ఓ మోస్తరు వివాదానికి వేదికగా మారింది. దత్తన్న ఏటా నిర్వహించే ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నేతలతోపాటు సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి […]

విధాత: ఎవరు గొప్ప.. ఎవరు ఘనాపాటి.. ఎవరు లెజండ్.. ఎవరు సెలబ్రిటీ.. ఇది పలు సందర్భాల్లో చర్చకు రావడం.. ఆయా అభిమానుల మధ్య వాదోపవాదాలు.. గొడవలకు దారి తీసిన విషయం అందరికి తెలిసిందే… దసరా సందర్భంగా హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ హైదరాబాద్లో నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమం కూడా ఇలాంటి చర్చకు.. ఓ మోస్తరు వివాదానికి వేదికగా మారింది.
దత్తన్న ఏటా నిర్వహించే ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నేతలతోపాటు సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి ఇంకా ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు హాజరయ్యారు. ఈ క్రమంలో గరికపాటి ఓ వైపు మాట్లాడుతుండగా చిరంజీవి అక్కడే ఉన్న చిన్నారులు మహిళలతో ఫొటోలు దిగుతుండటం.. దీనిమీద గరికపాటి నరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. చిరంజీవిని ఉద్దేశించి.. ఫొటోలు ఆపి వచ్చి తన పక్కన కూర్చోకపోతే తాను ఇక్కడి నుంచి వెళ్లిపోతానంటూ గరికపాటి నరసింహారావు వ్యాఖ్యానించడం తేలిసిందే.
అయితే గరికపాటి ప్రముఖ ప్రవచనకర్త అవధాని అయినా అవతల వ్యక్తి చిరంజీవి స్థాయి తెలుసుకోకుండా దబాయించడం సరికాదని మెగాభిమానుల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. మరోవైపు చిరంజీవి సోదరుడు నాగబాబు.. ట్విట్టర్లో ఏపాటి వారికైనా చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడటం పరిపాటే అంటూ వెక్కిరించారు.
మరోవైపు ఈ వ్యవహారంపై చిరంజీవి అభిమాన సంఘాలు సైతం ఆగ్రహం వ్యక్తం చేశాయి. కేంద్ర మంత్రిగా పనిచేసి కొన్ని కోట్ల మంది ఆరాధిస్తున్న హీరోను కించపరిచేలా గరికపాటి వ్యాఖ్యలు ఉన్నాయని నిప్పులు చెరిగారు. ఈ క్రమంలో చిరంజీవి యువత అధ్యక్షుడు భవానీ రవికుమార్.. గరికపాటి నరసింహారావుకు ఫోన్ చేసి ఈ విషయంపై మాట్లాడారని తెలుస్తోంది. అభిమానులు మీపై సీరియస్ గా ఉన్నారని ఆయనకు తెలిపారు. చిరంజీవితో మాట్లాడాలని రవికుమార్ కోరారు.
దీంతో చిరంజీవితో ఈ రోజే తాను మాట్లాడతానని గరికపాటి నరసింహారావు ఆయనకు చెప్పినట్టు సమాచారం. ఇదిలా ఉండగా అవధానిని అటు చిరంజీవి కూడా తన ఇంటికి విందుకు ఆహ్వానించడం జరిగింది..అంతే కాకుండా తన వ్యవహారశైలి మీద గరికిపాటి కూడా పశ్చాత్తాప ధోరణి వెలిబుచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఈ వివాదానికి ముగింపు పలికినట్లు స్పష్టమయింది.