అతని ముక్కులో 150 పురుగులు.. షాకైన డాక్టర్లు..
ఓ వ్యక్తి ముక్కులో 150 పురుగులు కాపురం పెట్టాయి. కానీ ఆ విషయం అతనికి తెలియదు. ముక్కు నుంచి తీవ్రంగా రక్తం కారుతుండడంతో ఆస్పత్రికి వెళ్లగా అసలు విషయం వెలుగు చూసింది

విధాత: ఓ వ్యక్తి ముక్కులో 150 పురుగులు కాపురం పెట్టాయి. కానీ ఆ విషయం అతనికి తెలియదు. ముక్కు నుంచి తీవ్రంగా రక్తం కారుతుండడంతో ఆస్పత్రికి వెళ్లగా అసలు విషయం వెలుగు చూసింది. వైద్యులు అతని ముక్కులోకి కెమెరా పంపించి, పరీక్షించగా.. 150 పురుగులు ఉన్నట్లు తేలింది. దీంతో ఆ ముక్కులో ఉన్న నివాసం ఏర్పరచుకున్న పురుగులను చూసి డాక్టర్లు షాకయ్యారు. ఇదంతా నిజమే.
వివరాల్లోకి వెళ్తే.. ఫ్లోరిడాకు చెందిన ఓ వ్యక్తికి గత కొద్ది రోజుల నుంచి ముక్కులో తీవ్ర రక్తస్రావం జరుగుతుంది. దీంతో హెచ్‌సీఏ ఫ్లోరిడా మెమోరియల్ ఆస్పత్రికి వెళ్లాడు. ముక్కు నుంచి రక్తం కారుతుందని, పెదవులు కూడా వాచిపోయాయని వైద్యులకు బాధిత వ్యక్తి తెలిపాడు. దీంతో ఈఎన్టీ వైద్యుడు డేవిడ్ కార్ల్‌సన్ అతనికి వైద్య పరీక్షలు నిర్వహించారు. కెమెరా ద్వారా అతని ముక్కును పరిశీలించగా, డాక్టర్ షాక్ అయ్యాడు. ఒకట్రెండు పురుగులు కాదు.. ఏకంగా వందకు పైగా పురుగులు అతని ముక్కులో నివాసం ఏర్పరచుకున్నట్లు కనుగొన్నాడు.
ఆ పురుగులు ముక్కు లోపల చర్మాన్ని భక్షిస్తున్నట్లు డాక్టర్ కనుగొన్నారు. అవి ముక్కు నుంచి ఇటు కంటి వైపునకు, అటు మెదడు వైపునకు వెళ్లేందుకు మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు నిర్ధారించారు. దీంతో క్షణం ఆలస్యం చేయకుండా బాధితుడి ముక్కులో నుంచి బతికి ఉన్న 150 పురుగులను వెలికితీశారు. ఒక వేళ ఈ పురుగులను బయటకు తీయకపోతే మెదడుకు చేరుకుని ప్రాణాంతకం అయ్యే అవకాశం ఉందన్నారు.
రోగికి సుమారు 30 ఏళ్ల క్రితం ముక్కులో క్యాన్సర్ వచ్చింది. అప్పట్లో వైద్యులు నాశికారంధ్రంలోంచి కొంత భాగాన్ని తొలగించడంతో అక్కడ ఖాళీ ఏర్పడింది. అది చివరకు ఇన్ఫెక్షన్‌కు అనుకూల పరిస్థితులను కల్పించింది. ఇదిలా ఉంటే అక్టోబర్‌లో రోగి.. చేపల వేట సందర్భంగా నదిలోనే చేతులు కడుక్కున్నాడు. అతడి నిర్లక్ష్యం కారణంగా చేతులపై ఉన్న క్రిములు ముక్కులోకి ప్రవేశించాయి. అప్పటికే అక్కడ ఇన్ఫెక్షన్‌కు అనుకూల వాతావరణం ఉండటంతో పురుగులు పెరగడం ప్రారంభించి రక్తస్రావానికి దారి తీశాయి. ప్రస్తుతం ఆ రోగికి యాంటీపారసైటిక్ ట్రీట్‌మెంట్ ఇస్తున్నట్టు వైద్యులు తెలిపారు. క్రమంగా కోలుకుంటున్నాడని అన్నారు.