Prostitution | ఆ గ్రామమంతా వ్యభిచారమే..
Prostitution తండ్రులు, భర్తలు బ్రోకర్లు.. ఇది అక్కడి తెగల ఆచారమట..! విధాత: వ్యభిచారం.. ఈ పదం వినడానికే ఏదో రకంగా ఉంటుంది. అయినప్పటికీ కొందరికి ఆ వ్యభిచారమే జీవనధారం. పడుపు వృత్తి కొనసాగిస్తేనే బతికే పరిస్థితి. ఈ వృత్తితో వచ్చే డబ్బులతోనే కుటుంబాలను పోషిస్తున్న వైనం నెలకొంది. ఇది దేశమంతటా ఉందా? అంటే లేదనే చెప్పొచ్చు. కానీ ఓ గ్రామంలో మాత్రం తరతరాలుగా పడుపు వృత్తి కొనసాగుతోంది. అదేదో రహస్యంగా కాదు.. ఆ గ్రామంలోని ప్రతి ఒక్కరికి […]

Prostitution
- తండ్రులు, భర్తలు బ్రోకర్లు..
- ఇది అక్కడి తెగల ఆచారమట..!
విధాత: వ్యభిచారం.. ఈ పదం వినడానికే ఏదో రకంగా ఉంటుంది. అయినప్పటికీ కొందరికి ఆ వ్యభిచారమే జీవనధారం. పడుపు వృత్తి కొనసాగిస్తేనే బతికే పరిస్థితి. ఈ వృత్తితో వచ్చే డబ్బులతోనే కుటుంబాలను పోషిస్తున్న వైనం నెలకొంది. ఇది దేశమంతటా ఉందా? అంటే లేదనే చెప్పొచ్చు. కానీ ఓ గ్రామంలో మాత్రం తరతరాలుగా పడుపు వృత్తి కొనసాగుతోంది.
అదేదో రహస్యంగా కాదు.. ఆ గ్రామంలోని ప్రతి ఒక్కరికి తెలిసేలా వ్యభిచారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ పడుపు వృత్తి గత 4 దశాబ్దాలుగా ఆ గ్రామంలో కొనసాగుతూనే ఉంది. ఆ గ్రామంలోని మహిళలను పలుకరిస్తే ఇది మాకు ఒక ఆచారమని భావోద్వేగంతో తమ బాధాకర అనుభావాలను పంచుకుంటున్న కథ ఇది. ఆ గ్రామం గురించి తెలుసుకోవాలంటే రాజస్థాన్ వెళ్లాల్సిందే.
ఆచారమని చెప్పారు..
పడుపు వృత్తి తమ ఆచారమని కుటుంబ పెద్దలు తనకు చెప్పారని రచన అనే యువతి తన గోడు వెళ్లబోసుకున్నది. ‘నాకు 15 సంవత్సరాలు ఉన్నప్పుడు.. నా చుట్టూ ఏం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితి. మాది చాలా పేద కుటుంబం. అప్పటికే వ్యభిచార వృత్తిని కొనసాగిస్తున్న మా కుటుంబంలో.. నేను కూడా ఆ వృత్తిలో భాగస్వామిని అయ్యాను. నేను ఒక్కదాన్నే కాదు.. చాలా మంది నాలా పడుపు వృత్తిలో దిగాల్సి వచ్చింది. మా తెగలో ఇది ఆచారమని మా పెద్దలు చెప్పారు’ అని ఆమె చెప్పారు.
తమకు తినడానికి తిండి కూడా దొరికేది కాదని, తమ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్లు పిడికెడు ముద్ద కోసం భిక్షాటన చేసేవారని రచన తెలిపారు. ‘భూమి, ఇల్లు లేవు. ఆస్తులు కూడా లేవు. డబ్బు సంపాదించడానికి వేరే మార్గాలు లేనే లేవు. తరతరాలుగా మా గ్రామంలో కొనసాగుతున్న వ్యభిచార వృత్తినే డబ్బు సంపాదించేందుకు మార్గమని తెలిసింది. ఇక మా అమ్మను ఆ వృత్తి మాన్పించి, నేను కుటుంబాన్ని చూసుకుంటానని చెప్పాను’ అని ఆమె తెలిపారు.
ఈ వృత్తిలో దిగే సమయంలో తనకు ఎదురైన భయానక అనుభవాలను ఆమె పంచుకున్నారు. ‘వృత్తిలో భాగంగా ముంబైకి చెందిన ఓ వ్యక్తి వద్దకు వెళ్లాను. యుక్త వయసులో ఉన్న నన్ను ఘోరంగా హింసించాడు. శారీరకంగా అనుభవించి డబ్బులు ఇవ్వలేదు. అసభ్య పదజాలంతో దూషించాడు. ఒంటి మీదున్న దుస్తులను చింపేసి వెళ్లపోయాడు. డబ్బుల కోసం నేను అతడి వెంట పడ్డాను. కానీ డబ్బులు ఇవ్వలేదు’ అని రచన ఆవేనద వ్యక్తం చేశారు.
డబ్బు సంపాదించడం సామాజిక హోదా..
తమ గ్రామాల్లో, తెగల్లో డబ్బు సంపాదించడం సామాజిక హోదా అని స్థానిక పురుషులు పేర్కొంటున్నారు. ‘డబ్బు ఉన్నవారే శక్తిమంతులు. కాబట్టి మా మహిళలు కూడా స్ట్రాంగ్. వారు కుటుంబ అవసరాలను తీర్చుతున్నారు. అందుకే వ్యభిచారాన్ని స్వాగతిస్తున్నాం. స్థానిక మహిళల భర్తలు, తండ్రులు, అన్నదమ్ముళ్లు వ్యభిచార బ్రోకర్లుగా వ్యవహరిస్తున్నారు’ అని వికాస్ అనే వ్యక్తి చెప్పాడు.
ఇప్పుడిప్పుడే ఉద్యోగాల బాటలో..
వ్యభిచార వృత్తి కొనసాగించే సంప్రదాయానికి ఇప్పుడిప్పుడే స్వస్తి పలుకుతున్నామని కుట్టు అనే వ్యక్తి తెలిపారు. ‘నేను ఎంతో కష్టపడి టీచర్ ఉద్యోగం సంపాదించాను. నాకు ఉద్యోగం రావడంతో చాలా కుటుంబాల్లో మార్పు వచ్చింది. మా గ్రామానికి చెందిన ఒకమ్మాయి పోలీసు ఉద్యోగంలో చేరింది. జైపూర్‌లో ఆమె పని చేస్తున్నది.
చాలా మంది పిల్లలు మెడికల్ ఫీల్డ్‌లో ఉన్నారు. నా కూతురు కూడా మెడిసిన్ చదువుతోంది. ఇలాంటి కుటుంబాలకు చెందిన మహిళలు పడుపు వృత్తిని మానేశారు. కొన్ని కుటుంబాలు మాత్రమే వ్యభిచార వృత్తిని కొనసాగిస్తున్నాయి’ అని ఆయన వివరించారు. ఆ కుటుంబాలు కూడా త్వరలోనే మారుతాయని కుట్టు ఆశిస్తున్నాడు.