గడ్చిరోలిలో భారీ ఎన్‌కౌంటర్‌.. నలుగురు మావోయిస్టు తెలంగాణ అగ్రనేతల హతం

మహారాష్ట్ర-ఛత్తీస్​గఢ్‌ సరిహద్దుల్లోని గడ్చిరోలిలో జిల్లాలో కోలా మరక అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పుల్లో తెలంగాణ రాష్ట్ర కమిటీకి చెందిన నలుగురు మావోయిస్టు అగ్రనేతలు మృతిచెందారు

గడ్చిరోలిలో భారీ ఎన్‌కౌంటర్‌.. నలుగురు మావోయిస్టు తెలంగాణ అగ్రనేతల హతం

విధాత : మహారాష్ట్ర-ఛత్తీస్​గఢ్‌ సరిహద్దుల్లోని గడ్చిరోలిలో జిల్లాలో రేపన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఉన్న కోలా మరక అటవీ ప్రాంతంలో మంగళవారం ఉదయం భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పుల్లో తెలంగాణ రాష్ట్ర కమిటీకి చెందిన నలుగురు మావోయిస్టు అగ్రనేతలు మృతిచెందారు. వారిని మంచిర్యాల డివిజన్‌ కమిటీ సెక్రటరీ వర్గీస్‌‌, సిర్పూర్‌, చెన్నూరు ఏరియా కమిటీ కార్యదర్శి మగ్తూ, ప్లాటూన్‌ సభ్యులు కుర్సంగ్‌ రాజు, కుడిమెట్ట వెంకటేశ్‌గా గుర్తించారు.


కొంతమంది తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు తెలంగాణ నుంచి గడ్చిరోలికి ప్రాణహిత నదిని దాటుకుని వచ్చారని తమకు సోమవారం మధ్యాహ్నం విశ్వసనీయ సమాచారం అందిందని గడ్చిరోలి జిల్లా ఎస్పీ తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు ఉన్న సమయంలో విద్రోహ కార్యకలాపాలకు పాల్పడేందుకు సిద్ధమై వచ్చారని తెలిసిందని పేర్కొన్నారు.


ఘటనా స్థలంలో ఒక ఏకే 47, ఒక కార్బైన్, రెండు పిస్టల్స్‌తో సహా పెద్ద భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో ఇద్దరిపై పోలీసులు శాఖ గతంలో భారీ రివార్డు ప్రకటించింది. వారిపై రూ.36 లక్షల చొప్పున రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆ ప్రాంతంలో ఇంకా గాలింపు కొనసాగుతున్నదని వెల్లడించారు. ఈ ఎన్‌కౌంటర్‌తో మావోయిస్టులకు ఊహించిన రీతిలో భారీ ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది.


ఈ సమాచారంతో అహేరి సబ్‌ పోలీస్‌ కేంద్ర కార్యాలయం నుంచి అదనపు ఎస్పీ (ఆపరేషన్స్‌) యతిశ్‌ దేశ్‌ముఖ్‌ నేతృత్వంలో సీ60, సీఆర్పీఎఫ్‌ క్యూఏటీ బృందాలను గాలింపునకు పంపామని ఎస్పీ చెప్పారు. ఈ సమయంలో మంగళవారం తెల్లవారుజామున పోలీసులకు, నక్సల్స్‌కు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయని తెలిపారు. కాల్పులు ఆగిన తర్వాత అక్కడికి వెళ్లి చూడగా.. మావోయిస్టుల మృతదేహాలు నాలుగు అక్కడ పడి ఉన్నాయని చెప్పారు. ఈ నలుగురిపైనా మహారాష్ట్ర ప్రభుత్వం 36 లక్షల రివార్డు ప్రకటించి ఉన్నదని ఎస్పీ తెలిపారు. ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.