రాజకీయాలకు ‘గల్లా’ తాత్కాలిక విరామం

తెలుగుదేశం పార్టీ కీలక నేత, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలకు తాత్కాలికంగా విరామం ఇస్తున్నట్లు ప్రకటించారు

రాజకీయాలకు ‘గల్లా’ తాత్కాలిక విరామం

– కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లక్ష్యంగా చేసుకున్నాయ్..

– నా వ్యాపారాలన్నీ నిఘా పరిధిలోనే..

– సీబీఐ, ఈడీ నా ఫోన్లు ట్యాప్ చేస్తున్నాయి

– గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ సంచలన వ్యాఖ్యలు

విధాత: తెలుగుదేశం పార్టీ కీలక నేత, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలకు తాత్కాలికంగా విరామం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆదివారం గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదని.. ఈ నిర్ణయం తాత్కాలికమే అని గల్లా జయదేవ్ తన భవిష్యత్ రాజకీయాలపై స్పష్టత ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తనను లక్ష్యంగా చేసుకున్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రభుత్వాలతో ఎదురవుతున్న ఇబ్బందుల్ని చూస్తూ పార్లమెంట్ లో మౌనంగా కూర్చోలేనని అన్నారు. తన పని పూర్తిగా నిర్వర్తించలేకపోతున్నాననే భావనతోనే రాజకీయాల్లో ఉండకూడదని నిర్ణయించుకున్నట్లు వివరించారు. తన తండ్రి వ్యాపారాల నుంచి రిటైర్డ్ కాగా.. ఆ బాధ్యతలనూ తనే భుజాన వేసుకోవాల్సి వచ్చిందన్నారు. రాజకీయం-వ్యాపారాన్ని సమన్వయం చేసుకోవడం కష్టమవుతోందని చెప్పారు. తన వ్యాపారాలన్నీ నిఘా పరిధిలోనే ఉన్నాయని అన్నారు. సీబీఐ, ఈడీ తన ఫోన్లు ట్యాప్ చేస్తున్నట్లు జయదేవ్ ఆరోపించారు. ఇప్పటికే పలు కేసుల్లో ఈడీ తనను రెండు సార్లు విచారించిందనీ చెప్పారు.


ముఠా రాజకీయాల నుంచి దూరంగా ఉన్నట్లు చెప్పిన గల్లా జయదేవ్.. స్థానిక నాయకులు, ప్రజలను నమ్ముకుని ముందుకు వెళ్తానని స్పష్టం చేశారు. వనవాసం తర్వాత శ్రీరాముడు, పాండవులు వచ్చినంత బలంగా తిరిగి రాజకీయాల్లోకి వస్తానని వెల్లడించారు. కాగా గుంటూరు ఎంపీగా తెలుగుదేశం పార్టీ తరపున గల్లా జయదేశ్ రెండు సార్లు విజయం సాధించారు. 2024 ఎన్నికల్లో తను పోటీ చేయనని కొద్దిరోజుల క్రితం వెల్లడించిన ఆయన… తాజా నిర్ణయంతో ఊహాగానాలకు తెరపడినట్లయ్యింది. మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి కుమారుడిగా.. తల్లి త్వరాత రాజకీయాల్లోకి వచ్చిన గల్లా జయదేవ్ తనదైన రాజకీయ ముద్ర వేసుకున్నారు. అమరరాజా బ్యాటరీల కంపెనీతో పాటు పలు వ్యాపారాలు గల్లా కుటుంబం నిర్వహిస్తోంది.