317 జీవోపై గుడ్‌న్యూస్‌? ఉద్యోగులకు డీఏపైనా నిర్ణయం!

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉద్యోగ, ఉపాధ్యా సంఘాలతో భేటీ కానున్నారని సమాచారం. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ ఈ నెల 13న రావొచ్చు అనే వార్తలు

317 జీవోపై గుడ్‌న్యూస్‌? ఉద్యోగులకు డీఏపైనా నిర్ణయం!

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉద్యోగ, ఉపాధ్యా సంఘాలతో భేటీ కానున్నారని సమాచారం. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ ఈ నెల 13న రావొచ్చు అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ నెల 12వ తేదీన మంగళవారం మధ్యాహ్నం రాష్ట్ర మంత్రి మండలి సమావేశం జరగనున్న సంగతి తెలిసిందే. మహిళలకు వడ్డీ లేని రుణ పథకాన్ని ప్రారంభించడానికి 12న భారీ సదస్సు నిర్వహిస్తున్నది. కేబినెట్‌ సమావేశంలో ఈ పథకానికి నిధుల కేటాయింపుతో పాటు మేడిగడ్డ కుంగుబాటుపై విజిలెన్స్‌ సిఫార్సుల ఆధారంగా రిటైర్డ్‌ జడ్జితో విచారణ, కొడంగల్‌-నారాయణపేట సహా మరికొన్ని అంశాలకు కేబినెట్‌ ఆమోదం తెలుపనున్నట్టు సమాచారం. అలాగే ఆర్టీసీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం 21 శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించింది. దీంతో ఎన్నికల షెడ్యూల్‌కు ముందే ప్రభుత్వం డీఏపై ప్రకటన చేస్తే తమకు కూడా లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వ ఉద్యోగుల యోచిస్తున్నారు.


దానికి అనుగుణంగా ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డి ఉద్యోగ, ఉపాధ్యా సంఘాలతో భేటీ కానున్నారని తెలుస్తోంది. ఈ సమావేశంలో డీఏతో జీవో 317పైనా శుభవార్త చెబుతారని సమాచారం. సీనియారిటీ ఆధారంగా శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగులను, సర్దుబాటు చేసే విధంగా విడుదల చేసిన జీవో 317ని ఉపసంహరించుకోవాలని ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు. జీవో 317 వల్ల తాము చాలా ఇబ్బందులు పడుతున్నామని ఉద్యోగ, ఉపాధ్యాయులు రెండేళ్లుగా ఆవేదన చెందుతున్నారు. దీన్ని ఉపసంహరించుకోవాలని వాళ్లు గత ప్రభుత్వ హయాంలోనే ధర్నాలు, నిరసనలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రి దామోదర రాజనర్సింహ నేతృత్వంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు, పొన్నం ప్రభాకర్‌ సభ్యులుగా ఉప సంఘం నియమించిన సంగతి తెలిసిందే. దీనిపై కమిటీ ఉద్యోగుల, ఉపాధ్యాయుల అభిప్రాయాలతో పాటు సంబంధిత డిపార్ట్‌మెంట్‌ల సెక్రటరీలు, హెచ్‌వోడీలతో చర్చించనున్నది. ఈ జీవో వల్ల రెండేళ్లుగా ఉద్యోగులు తాము పడుతున్న ఇబ్బందులను గతంలోనే కాంగ్రెస్‌ పార్టీ దృష్టికి తీసుకెళ్లారు. కేబినెట్‌ నివేదిక వచ్చాక తుది నిర్ణయం తీసుకుంటారు. ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాల భేటీలో 317 జీవోపై వారికి ఊరట కలిగే విషయాన్నిసీఎం వెల్లడించే అవకాశాలున్నట్టు సమాచారం. ఎన్నికల సమయం కాబట్టి ఉద్యోగులకు గుడ్‌ చెప్పాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.