కొత్తగా గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల.. మళ్లీ దరఖాస్తు చేయాల్సిందే..
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త వినిపించింది. కొత్తగా గ్రూప్-1 నోటిఫికేషన్‌ను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. 563 పోస్టుల భర్తీకి గ్రూప్-1 నోటిఫికేషన్ వెలువడింది.

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త వినిపించింది. కొత్తగా గ్రూప్-1 నోటిఫికేషన్‌ను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. 563 పోస్టుల భర్తీకి గ్రూప్-1 నోటిఫికేషన్ వెలువడింది. గత ప్రభుత్వం 503 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా, ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన 60 పోస్టులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఇక దరఖాస్తులను ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో స్వీకరించనున్నారు. మే లేదా జూన్ నెలలో ప్రిలిమ్స్ నిర్వహించనున్నారు. మెయిన్స్ సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్‌లో టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది.
గతంలో దరఖాస్తు చేసినా మళ్లీ కూడా చేయాల్సిందే..
గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసిన అభ్యర్థులు మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిందే. గతంలో దరఖాస్తు చేశామనే భావనలో ఉండి, ఒక వేళ ఇప్పుడు కొత్తగా దరఖాస్తు చేసుకోకపోతే వారి అభ్యర్థిత్వాన్ని కొత్త నోటిఫికేషన్‌కు పరిగణించరు. అయితే గతంలో దరఖాస్తు చేసిన వారికి ఎలాంటి ఫీజు వసూలు చేయబోమని టీఎస్‌పీఎస్సీ స్పష్టం చేసింది. గతంలో దరఖాస్తు చేసిన వారు ఇప్పుడు ఎలాంటి రుసుం చెల్లించకుండానే దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి ఫీజు వసూలు చేయనున్నారు.