బీజేపీ నేత‌ల్లో గుబులు.. ముందుకు వెళ్దామా…? వ‌ద్దా?

కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ నేత‌ల వైపు చూస్తున్న అగ్ర నేత‌లు.. ఇప్పుడు ఖర్చు పెట్టుకొని కార్య‌క్ర‌మాలు చేస్తే… ఎన్నిక‌ల స‌మ‌యానికి టికెట్లు ఎవ‌రికిస్తారో..? విధాత‌: తెలంగాణ బీజేపీ నేత‌ల్లో క‌ల‌వ‌రం మొద‌లైంది. మొద‌టి నుంచి పార్టీ కోసం క‌ష్ట‌ప‌డి ప‌ని చేస్తున్నామ‌ని, ఎన్నిక‌ల స‌మ‌యానికి త‌మకు ఎస‌రు పెట్టేలా క‌నిపిస్తోంద‌ని కొంత మంది బీజేపీ నాయ‌కులు తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. తాము మొద‌టి నుంచి పార్టీ అభివృద్ధి కోసం ఎంతో క‌ష్ట‌ప‌డ్డామ‌ని, కోట్లాది రూపాయ‌లు పార్టీ కార్య‌క్ర‌మాల […]

బీజేపీ నేత‌ల్లో గుబులు.. ముందుకు వెళ్దామా…? వ‌ద్దా?
  • కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ నేత‌ల వైపు చూస్తున్న అగ్ర నేత‌లు..
  • ఇప్పుడు ఖర్చు పెట్టుకొని కార్య‌క్ర‌మాలు చేస్తే…
  • ఎన్నిక‌ల స‌మ‌యానికి టికెట్లు ఎవ‌రికిస్తారో..?

విధాత‌: తెలంగాణ బీజేపీ నేత‌ల్లో క‌ల‌వ‌రం మొద‌లైంది. మొద‌టి నుంచి పార్టీ కోసం క‌ష్ట‌ప‌డి ప‌ని చేస్తున్నామ‌ని, ఎన్నిక‌ల స‌మ‌యానికి త‌మకు ఎస‌రు పెట్టేలా క‌నిపిస్తోంద‌ని కొంత మంది బీజేపీ నాయ‌కులు తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. తాము మొద‌టి నుంచి పార్టీ అభివృద్ధి కోసం ఎంతో క‌ష్ట‌ప‌డ్డామ‌ని, కోట్లాది రూపాయ‌లు పార్టీ కార్య‌క్ర‌మాల అమ‌లు కోసం ఖ‌ర్చు చేశామంటున్నారు.

ఇప్పుడేమో ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన‌ నాయ‌కుల‌ను తీసుకు రావాల‌ని తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని వాపోతున్నారు. ఇత‌ర పార్టీల నుంచి నేత‌ల‌ను తీసుకువ‌చ్చి టికెట్లు ఇచ్చే ప‌రిస్థితి క‌నిపిస్తోంద‌ని, అలాంట‌ప్పుడు పార్టీ కార్య‌క్ర‌మాల అమ‌లు కోసం ఖ‌ర్చులు పెట్టుకొని తిర‌గాల్సిన అవ‌స‌రం త‌మ‌కేమిట‌ని త‌మ బాధ‌ను అత్యంత ఆప్తుల వ‌ద్ద వ్య‌క్తం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

పార్టీ బ‌లోపేతానికి అనేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించిన త‌మ‌ను కాద‌ని, ఇత‌ర పార్టీల నుంచి నేత‌ల‌ను తీసుకురావ‌డానికి ప్ర‌య‌త్నాలు ఏమిటో త‌మ‌కు అర్థం కావ‌డం లేద‌ని బీజేపీ సీనియ‌ర్ నేత ఒక‌రు వాపోయారు. పార్టీ కార్య‌క్ర‌మాల‌ను భుజానికెత్తుకొని ప‌ని చేయాల‌న్న ఉత్సాహం రావ‌డం లేదంటున్నారు.

పార్టీ ప‌రిస్థితి చూస్తుంటే రాను రాను వ‌ల‌స వాదుల‌తో నిండిపోయేలా కనిపిస్తోందని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. మొద‌టి నుంచి పార్టీ కోసం సిద్దాంతం ప్రాతిప‌దిక ప‌ని చేసిన త‌మ‌లాంటి నేత‌లు క‌నుమ‌రుగ‌య్యే ప‌రిస్థితి తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీలో ఏర్ప‌డింద‌ని త‌మ బాధ‌ను వ్య‌క్తం చేస్తున్నారు.

పార్టీ కార్య‌క్ర‌మాలు ఏవైనా అమ‌లు చేయాలంటే ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఖ‌ర్చుతో కూడుకున్న ప‌ని అని ఒక సీనియ‌ర్ నేత తెలిపారు. తాము ఖ‌ర్చు పెట్టుకొని ప‌ని చేస్తే తీరా ఎన్నిక‌ల స‌మ‌యానికి త‌మ‌కు టికెట్ ఇస్తార‌న్న న‌మ్మ‌కం పార్టీలో లేద‌ని వాపోయారు.

ఇప్ప‌టికే ప‌లు జిల్లాల‌కు చెందిన కాంగ్రెస్‌, టీఆర్ ఎస్‌ల‌లో ప‌ని చేస్తున్న కొంత మంది నేత‌లతో మాట్లాడుతున్న‌ట్లు తెలుస్తోంద‌ని, వారిని త‌మ పార్టీలోకి తీసుకుంటే త‌మ ఉనికి కూడా పార్టీలో క‌ష్ట‌మ‌వుతుంద‌ని మ‌రో నాయ‌కుడు ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

తాము ఎబీవీపీ, ఆర్ ఎస్ ఎస్‌ల నుంచి ప‌ని చేస్తూ వ‌స్తున్న వాళ్ల‌మ‌ని ఇంకో నేత త‌న బాధ‌ను తెలియ‌జేశారు. ఇలా తానొక్క‌డినే కాద‌ని, అనేక మంది పార్టీ కోసం మొద‌టి నుంచి ప‌ని చేసిన నేత‌లు తీవ్ర అసంతృప్తితో ఉన్నార‌ని, మ‌న‌స్పూర్తిగా ప‌ని చేయ‌డానికి మ‌న‌సు రావ‌డం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

త‌మ పార్టీ అగ్ర నేత‌లు సొంత కార్య‌క‌ర్త‌ల‌ను కాద‌ని, ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చే వారికి పెద్ద పీట వేస్తుంద‌ని వాపోతున్నారు. రాను రాను బీజేపీలో సొంత పార్టీ నేత‌ల కంటే వ‌ల‌స వ‌చ్చిన వారికే ఎక్కువ ప్రాధాన్య‌త ఇచ్చేలా క‌నిపిస్తోంద‌ని త‌న బాధ‌ను వ్య‌క్తం చేస్తున్నారు.