Gutta Sukhender Reddy | అది కాంగ్రెస్ నిరుద్యోగుల సభ.. కాంగ్రెస్ నేతలపై గుత్తా ఫైర్

చరిత్ర మరచి మాపై విమర్శలా. విధాత: కాంగ్రెస్ పార్టీ నల్గొండలో నిర్వహించిన నిరుద్యోగ నిరసన సభ ఆ పార్టీ రాజకీయ నిరుద్యోగుల సభగా సాగిందని ఎలాగైనా రాష్ట్రంలో అధికారంలోకి రావాలన్న దురుద్దేశంతో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, సీనియర్లు కే. జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు సీఎం కేసీఆర్ ప్రభుత్వం పై అసత్య విమర్శలు చేశారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutta Sukhender Reddy) అన్నారు. శనివారం ఆయన విలేకరుల సమావేశంలో […]

Gutta Sukhender Reddy | అది కాంగ్రెస్ నిరుద్యోగుల సభ.. కాంగ్రెస్ నేతలపై గుత్తా ఫైర్
  • చరిత్ర మరచి మాపై విమర్శలా.

విధాత: కాంగ్రెస్ పార్టీ నల్గొండలో నిర్వహించిన నిరుద్యోగ నిరసన సభ ఆ పార్టీ రాజకీయ నిరుద్యోగుల సభగా సాగిందని ఎలాగైనా రాష్ట్రంలో అధికారంలోకి రావాలన్న దురుద్దేశంతో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, సీనియర్లు కే. జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు సీఎం కేసీఆర్ ప్రభుత్వం పై అసత్య విమర్శలు చేశారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutta Sukhender Reddy) అన్నారు. శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నిరుద్యోగ నిరసనసభను కాంగ్రెస్ నాయకులు తమ మధ్య ఐక్యతను చాటుకునే వేదికగా మార్చుకున్నారని గుత్తా ఎద్దేవా చేశారు.

మూతులు ముద్దులు పెట్టుకుంటే.. కాళ్లు తన్నుకున్నట్లుగా కాంగ్రెస్ నాయకులు వ్యవహరించారన్నారు. సీఎం కేసీఆర్ ఇప్పటికే రాష్ట్రంలో 1,32,000 ఉద్యోగాలు భర్తీ చేశారని 10,000 ఉద్యోగాలను క్రమబద్ధీకరించగా, మరో 90 వేల ఉద్యోగాలకు వరుసగా నోటిఫికేషన్ల విడుదల, భర్తీ ప్రక్రియ సాగుతుందన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ ఒకటి మినహా మిగతా ఉద్యోగ భర్తీ సాఫీగా సాగుతున్న సంగతి వాస్తవం కాదా అన్నారు. గ్రూప్స్ పరీక్షలు కూడా మళ్లీ కొనసాగుతాయని, ఉద్యోగ భర్తీ ప్రక్రియ ఆగబోదన్నారు.

ఉమ్మడి జిల్లాల్లో అభివృద్ధి సీఎం కేసీఆర్ ప్రభుత్వ హాయాంలో ముందు ఎన్నడూ లేని రీతిలో సాగిందన్నారు. రెండు మెడికల్ కళాశాలల ఏర్పాటు, 4000 మెగావాట్ల యాదాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణం, ఐటీ హబ్ నిర్మాణం, సాగర్ ఆయకట్టులో కొత్త లిఫ్ట్ ల నిర్మాణంతో సాగుతున్న అభివృద్ధి కాంగ్రెస్ నాయకుల కళ్లకు కనిపించడం లేదా అంటూ గుత్తా ప్రశ్నించారు.

కాంగ్రెస్ హయాంలో ఆ పార్టీ నాయకులు కమిషన్లు దండుకొని వదిలేసిన శ్రీశైలం సొరంగం పనులు జరిపిస్తున్నామని, ఉదయ సముద్రం లిఫ్టు ఇరిగేషన్ పూర్తి చేసి త్వరలో ప్రారంభించనున్నామన్నారు. ఎస్సారెస్పీ కింద రెండు పంటలకు సాగునీరు అందిస్తున్నామన్నారు. రైతుల ధాన్యం ప్రతి గింజ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. పంట నష్టపోయిన రైతులకు పదివేల రూపాయల పరిహారం అందిస్తుందన్నారు.

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు పెట్టిన దేశంలో అనేక విభాగాల్లో రాష్ట్ర సుపరిపాలన విజయాలకు సూచికలుగా అవార్డులు లభిస్తున్నాయన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రెండు లక్షల రుణమాఫీ చేస్తామంటున్నారని, సీఎం కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధు కింద 65 వేల కోట్లను పంపిణీ చేసిందన్నారు.

తెలంగాణ ప్రజలకు ఎవరి పాలన ఏమిటో అర్థం చేసుకునే చైతన్యం ఉందని, కాంగ్రెస్ కు అధికారం ఇస్తే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి అవుతుందన్నారు. అధికార దాహంతో ప్రతిపక్షాలు సీఎం కేసీఆర్ ప్రభుత్వం పై, కుటుంబం పైన అసత్య ఆరోపణలు దాడి చేస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ పాలనే రాష్ట్ర ప్రగతికి శ్రీ రామ రక్ష అని గ్రహించి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్, బిజెపిలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలన్నారు.

నలగొండ నిరుద్యోగ నిరసన సభలో జిల్లా మంత్రి జి. జగదీష్ రెడ్డి పైన, నా పైన కాంగ్రెస్ నాయకులు చేసిన విమర్శలు గురువింద గింజ సామెతలా ఉన్నాయన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నన్ను 2004 ఎన్నికల్లో ఓడించానని గొప్పలు చెప్పుకున్నారని, ఆనాడు టిడిపి ప్రభుత్వం పై వ్యతిరేకత, కాంగ్రెస్ తో కమ్యూనిస్టుల కూటమి వంటి అంశాల నేపథ్యంలో తాను ఓడిపోయానన్నారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమన్నారు.

వెంకటరెడ్డి గత ఎన్నికల్లో నా శిష్యుడు, సోదరుడైన కంచర్ల భూపాల్ రెడ్డి చేతిలో ఓడిన విషయం మర్చిపోయి నా నాపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. వెంకటరెడ్డి సోదరుడిని ఎంపీ,ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓడించారని, అన్నను జడ్పిటిసి ఎన్నికల్లో, మరదలను ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన చరిత్ర మరచి ఈర్ష, ద్వేషంతో నాపై విమర్శలు చేశారన్నారు.

జానా, ఉత్తమ్, వెంకట్ రెడ్డిలకు ఐదు ఎకరాలు కూడా లేవని, సొంతిండ్లు లేవని చెప్పుకున్నారని, అలాగైతే హైదరాబాదులో విల్లాలు, హైటెక్ సిటీ లో భూములు వారికి ఎక్కడివని, ఎన్నికల్లో వందల కోట్ల ఖర్చు ఎలా చేస్తున్నారని గుత్తా ప్రశ్నించారు. వారి ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ నాయకులు సాగించిన బ్లాక్మెయిల్ రాజకీయాలు, కమిషన్ల దందాల చరిత్రను మరచి మాపై నిందలు వేయడం ఏమిటని నిలదీశారు.

మతిస్థిమితం, స్థిరత్వం లేని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఆ పార్టీ వారికే తెలియదని, పొద్దున బిఆర్ఎస్‌తో, మధ్యాహ్నం కాంగ్రెస్ తో, రాత్రి బీజేపీతో సంప్రదింపులు చేయడం ప్రధాని మోడిని, అమీత్ షాను కలవడం ఆయన అస్థిర, మతిభ్రమణ రాజకీయాలకు నిదర్శనమని గుత్తా విమర్శించారు. అధికారం కోసం పగటి కలలు కంటున్న వెంకట్ రెడ్డి సహా పార్టీ నేతలకు వచ్చే ఎన్నికల్లో మరోసారి నిరాశ తప్పదన్నారు.