హెచ్ఎండీఏ ఓవరాక్షన్.. గద్దర్ విగ్రహ ఏర్పాటుకు అడ్డంకులు
కార్పోరేట్ల అడుగులకు మడుగులొత్తే అధికారులు కావాలని తెల్లాపూర్‌లో ఏర్పాటు చేస్తున్న ప్రజా యుద్ధ నౌక గద్దర్ విగ్రహాన్ని అడ్డుకుంటున్నారు

మున్సిపాలిటీ తీర్మాణం చేసినా ససేమిరా అంటున్న వైనం
విధాత: కార్పోరేట్ల అడుగులకు మడుగులొత్తే అధికారులు కావాలని తెల్లాపూర్‌లో ఏర్పాటు చేస్తున్న ప్రజా యుద్ధ నౌక గద్దర్ విగ్రహాన్ని అడ్డుకుంటున్నారు. తెల్లాపూర్ పార్క్‌లో గద్దర్ విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని మున్సిపాలిటీ ఏకగ్రీవంగా తీర్మానం చేసినా హెచ్ఎండీఏ అధికారులు మాత్రం కావాలని అడ్డకోవడం తీవ్ర దుమారం రేపుతోంది. హెచ్ఎండీఏలో డిప్యూటేషన్‌పై స్థానికంగా పని చేస్తున్న ఎస్ ఐ కావాలని స్థానికంగా గద్దర్ విగ్రహ ఏర్పాట్లకు పని చేస్తున్న వారిపై తమ విధులకు బంగం కలిగించారని కేసు నమోదు చేసినట్లు తెలిసింది. ఈ విషయం చిలికి చిలికి గాలివానలా తయారైంది. వాస్తవంగా గద్దర్‌కు తెల్లాపూర్ ప్రజలతో విడదీయలేని అనుబంధం ఉన్నది. గతంలో తెల్లాపూర్‌లో జరిగిన సభలో పాల్గొన్న గద్దర్ నేను చనిపోతే నన్ను ఇక్కడే సమాధి చేయండి అని కూడా కోరుకున్నాడు. అధికారంలోకి రాక ముందు కాంగ్రెస్ నాయకులు కూడా తెల్లాపూర్‌లో గద్దర్ విగ్రహ ఏర్పాటు చేస్తామని చెప్పారు.

దీంతో తెల్లాపూర్ ప్రజలు గద్దర్ విగ్రహ ఏర్పాటుకు రావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కోరగా ఆయన కూడా వస్తానని హామీ ఇచ్చారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన మంత్రి దామోదర రాజనర్సింహ సైతం ఒక వైపు గద్దర్ విగ్రహ ఏర్పాటుకు మద్దతుగా నిలిచారు. తెల్లాపూర్‌లో పార్క్‌గా అభివృద్ధి చేయాలని తలపెట్టిన స్థంలో విగ్రహం ఏర్పాటు చేస్తున్న భూమిపై కన్నేసిన కర్పోరేట్ మాఫియా హెచ్ ఎండీఏ కు చెందిన స్థానిక అధికారిని ప్రభావితం చేసి స్థానికులపై కేసు పెట్టించారన్న ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. అయితే ఈవిషయం తన దృష్టికి రాలేదని పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి దాన కిషోర్ స్థానికులతో అన్నట్లు తెలిసింది. విగ్రహ ఏర్పాటును అడ్డకోవడానికి నిరసనగా అక్కడి నేత భరత్ ఆమరణ నిరహార దీక్షకు పూనుకున్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన సమాధానం వచ్చే వరకు ఆమరణ నిరహార దీక్షను కొనసాగిస్తామని ప్రకటించారు. గద్దర్ విగ్రహ ఆవిష్కరణ ఎలాగైనా ఈ నెల 31వ తేదీన చేయాలన్న లక్ష్యంగా స్థానికులు పని చేస్తున్నారు. స్థానిక మున్సిపాలిటీ ఇచ్చిన తీర్మానానం కూడా అధికారులు బేకాతరు చేయడం పట్ల స్థానికులు భగ్గుమంటున్నారు. విగ్రహ ఏర్పాటులో అక్కడి రాజకీయ నేతలు, ప్రజలు పెద్ద ఎత్తున పార్టీలకు అతీతంగా భాగస్వామ్యం అవుతున్నా అధికారులు కావాలని అడ్డంకులు సృష్టిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా యుద్ద నౌక గద్దర్ చనిపోయిన తరువాత కూడా ఆయనను అవమానిస్తున్నారని తీవ్రంగా మండి పడుతున్నారు.