Congress | కాంగ్రెస్ టికెట్లకు దరఖాస్తుల వెల్లువ.. తప్పదు తలనొప్పి!

Congress | పోటీలు పడుతున్న ఆశావహులు సీనియర్ల స్థానాలకూ దరఖాస్తులు ఒకే సీటుకు పదుల సంఖ్యలో పోటీ ఒకరికి టికెట్‌ ఇస్తే.. మరొకరి అలక స్క్రీనింగ్ కమిటీకి వడపోత తలనొప్పి! ఎత్తు పారుతుందా.. తిప్పి కొడుతదా? బీఆర్‌ఎస్‌కు రెబెల్స్‌ బెడద వెయ్యికి పైగా దరఖాస్తులు దాఖలు ఫీజుల రూపంలో నాలుగు కోట్ల రాబడి విధాత: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ టికెట్ల కోసం దరఖాస్తులు వెల్లువలా వచ్చి పడ్డాయి. ఒక్కో నియోజకవర్గం నుంచి బహుళ […]

  • By: krs    latest    Aug 26, 2023 12:16 AM IST
Congress | కాంగ్రెస్ టికెట్లకు దరఖాస్తుల వెల్లువ.. తప్పదు తలనొప్పి!

Congress |

  • పోటీలు పడుతున్న ఆశావహులు
  • సీనియర్ల స్థానాలకూ దరఖాస్తులు
  • ఒకే సీటుకు పదుల సంఖ్యలో పోటీ
  • ఒకరికి టికెట్‌ ఇస్తే.. మరొకరి అలక
  • స్క్రీనింగ్ కమిటీకి వడపోత తలనొప్పి!
  • ఎత్తు పారుతుందా.. తిప్పి కొడుతదా?
  • బీఆర్‌ఎస్‌కు రెబెల్స్‌ బెడద
  • వెయ్యికి పైగా దరఖాస్తులు దాఖలు
  • ఫీజుల రూపంలో నాలుగు కోట్ల రాబడి

విధాత: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ టికెట్ల కోసం దరఖాస్తులు వెల్లువలా వచ్చి పడ్డాయి. ఒక్కో నియోజకవర్గం నుంచి బహుళ సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తులు అందించారు. చివరి శ్రావణ శుక్రవారం జాతరలా సాగిన ప్రక్రియలో 1000పైగా దరఖాస్తులు అందాయని పార్టీ వర్గాల సమాచారం. కొన్ని నియోజకవర్గాల్లో సీనియర్లకే కచ్చితంగా టికెట్లు దక్కుతాయని తెలిసినా, పోటీలో ఉన్నామన్న సంకేతాలిచ్చేందుకే ఆశావహులు దరఖాస్తు ఫీజుల కోసం ఆలోచించకుండా పోటెత్తడం విశేషం. దరఖాస్తుల ద్వారా గాంధీభవన్‌కు 4కోట్ల రూపాయల ఆదాయం లభించడం విశేషం.

పలుచోట్ల బహుళ దరఖాస్తులు

ఒకే కుటుంబానికి చెందిన ఆశావహులు పలు నియోజకవర్గాల్లో టికెట్ల కోసం దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. వీరిలో పలువురు ఎంపీలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు, సీనియర్ నాయకులు ఉన్నారు. అయితే గీతారెడ్డి, జనారెడ్డి, వీ హనుమంతరావు, రేణుకాచౌదరి, నాగం జనార్దన్‌రెడ్డి, కొండా మురళి మాత్రం దరఖాస్తులకు దూరంగా ఉండటం విశేషం.

స్క్రీనింగ్ కమిటీకి తలనొప్పి!

ఒకే నియోజకవర్గం నుండి పదుల సంఖ్యలో వచ్చిన దరఖాస్తులను వడపోయడం పార్టీ స్క్రీనింగ్ కమిటీకి తలనొప్పిగా తయారవ్వనుంది. ఒకరికి టికెట్ ఇస్తే మరొకరు అసమ్మతి లేవనెత్తే అవకాశముండటంతో ఆశావహులను కూర్చోబెట్టి అభ్యర్థుల ఎంపిక చేయడం కాంగ్రెస్ అధిష్ఠానానికి కత్తిమీద సాములా మారనున్నది. కొన్ని నియోజకవర్గాల్లో ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులు కూడా దరఖాస్తులు చేసుకున్నారు.

అయితే.. చాలా కాలంగా పార్టీలో ఉంటూ టికెట్‌ ఆశిస్తున్నవారు.. తమను కాదని ఇతర పార్టీల నుంచి వచ్చినవారికి టికెట్‌ కేటాయిస్తే.. ఊరుకునే పరిస్థితి కష్టమే. మొత్తంగా టికెట్ల కోసం కాంగ్రెస్ చేపట్టిన దరఖాస్తుల ప్రక్రియ అంతిమంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను మరింత జటిలం చేస్తుందన్న వాదన కేడర్‌లో వినిపిస్తున్నది. వచ్చిన దరఖాస్తులను స్క్రీనింగ్ కమిటీ పరిశీలించి, ప్రతి నియోజకవర్గానికి ముగ్గురి పేర్లను ఏఐసీసీకి సిఫారసు చేయనుంది.

సెప్టెంబర్‌ 2 వారంలో తొలి జాబితా!

సెప్టెంబర్ రెండో వారంలో కనీసంగా 50నుండి 60మందితో తొలి జాబితాను విడుదల చేయాని టీపీసీసీ లక్ష్యంగా పెట్టుకుంది. టికెట్ల కోసం దరఖాస్తులు తప్పనిసరైనప్పటికీ కొంతమంది సీనియర్లకు, అలాగే మునుముందు ఇతర పార్టీల నుంచి చేరే వారికి ఈ ప్రక్రియ నుంచి మినహాయింపు ఇవ్వవచ్చని తెలుస్తున్నది. దీనిపై ఏఐసీసీ తన నిర్ణయం ప్రకటించాల్సివుంది.

టికెట్ల కోసం పోటాపోటీ దరఖాస్తులు

కాంగ్రెస్ టికెట్ల కోసం సాగిన దరఖాస్తు జాతరలో చివరి రోజున పార్టీ సీనియర్ నేత సర్వే సత్యనారాయణ సైతం సికింద్రాబాద్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మాజీ ఎంపీ మధుయాష్కి ఎల్‌బీ నగర్ టికెట్‌కు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్ హుస్నాబాద్ టికెట్ కోసం, హుజూరాబాద్ టికెట్‌కు బల్మూరి వెంకట్‌, మధిర టికెట్ కోసం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తన అనుచరుల ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. ఖమ్మం, కొత్తగూడెం, పాలేరు జనరల్ సీట్ల టికెట్ కోసం పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీనియర్ నేత, మాజీ మంత్రి కే జానారెడ్డి తనయులు రఘువీర్‌రెడ్డి, జయవీర్‌రెడ్డి నాగార్జున సాగర్ టికెట్ కోసం దరఖాస్తు చేశారు.

మిర్యాలగూడ టికెట్ కోసం జానారెడ్డి పెద్దకుమారుడు రఘువీర్‌రెడ్డి దరఖాస్తు చేశారు. పీసీసీ మాజీ చీఫ్ ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హుజూర్ నగర్‌లో, ఆయన సతీమణి పద్మావతి కోదాడలో దరఖాస్తు చేసుకున్నారు. కాగా ఉత్తమ్ అనుచరుడైన మిస్టర్ ప్రెగ్నెంట్ చిత్ర నిర్మాత అప్పిరెడ్డి హుజూర్‌నగర్‌, కోదాడలలో దరఖాస్తు చేసుకున్నారు. ములుగు టికెట్ కోసం సీతక్క, పినపాక టికెట్ కోసం ఆమె కుమారుడు సూర్యం దరఖాస్తు చేసుకున్నారు. మాజీ డిప్యూటీ సీఎం దామోదరం రాజనరసింహ,ఆయన కూతురు త్రిష్టలు అందోల్‌ టికెట్ కోసం దరఖాస్తు చేశారు.

ముషీరాబాద్ టికెట్ కోసం మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్‌, ఆయన కుమారుడు అనిల్‌కుమార్ యాదవ్‌, ఎమ్మెల్సీ సీతక్క పీఏ సుధీర్‌ దరఖాస్తు చేసుకున్నారు. కరీంనగర్ నియోజకర్గం టికెట్ కోసం సీఎం కేసీఆర్ సోదరుడి కూతురైన రమ్యారావు, ఆమె కుమారుడు రితేశ్‌రావు దరఖాస్తు చేసుకున్నారు. జూబ్లీహిల్స్‌ స్థానానికి పీ విష్ణువర్ధన్‌రెడ్డితో పాటు అజారుద్దీన్‌కూడా దరఖాస్తు చేయడం ఆసక్తికరంగా మారింది.

వనపర్తి నుంచి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి, మునుగోడు నుంచి పాల్వాయి స్రవంతి, చలమల కృష్ణారెడ్డి, పున్న కైలాష్ నేత దరఖాస్తు చేసుకున్నారు. ఖైరాతాబాద్ నుంచి విజయారెడ్డి, రోహిణ్‌రెడ్డి, వినోద్‌రెడ్డి, నల్లగొండ నుంచి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొడంగల్ నుంచి రేవంత్‌రెడ్డిలు దరఖాస్తు చేసుకున్నారు.