వడ్డీ సొమ్ము కోసం.. కామారెడ్డిలో మహిళల భారీ ర్యాలీ

 ఆమరణ నిరాహార దీక్ష చేస్తా రమణారెడ్డి సచ్చుడో.. మహిళలకు వడ్డీ ఇచ్చుడో తేల్చాల‌ని ప్రభుత్వానికి సవాల్ రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఇక్కడి ఉద్యమం దిక్సూచి కావాలి విధాత, నిజామాబాద్: స్త్రీనిధి రుణాల వడ్డీ సొమ్ము 52 లక్షల రూపాయలను మహిళల ఖాతాల్లో జమ చేయాలని బీజేపీ నాయకుడు కాటిపల్లి వెంకటరమణారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహిళా సంఘాలకు రుణాలు ఇవ్వాలని, వడ్డీ సొమ్మును జమ చేయాలని, మహిళల నుండి రుణాల బలవంతపు వసూళ్లు నిలిపి వేయాలని కోరుతూ గత […]

వడ్డీ సొమ్ము కోసం.. కామారెడ్డిలో మహిళల భారీ ర్యాలీ
  • ఆమరణ నిరాహార దీక్ష చేస్తా
  • రమణారెడ్డి సచ్చుడో.. మహిళలకు వడ్డీ ఇచ్చుడో తేల్చాల‌ని ప్రభుత్వానికి సవాల్
  • రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఇక్కడి ఉద్యమం దిక్సూచి కావాలి

విధాత, నిజామాబాద్: స్త్రీనిధి రుణాల వడ్డీ సొమ్ము 52 లక్షల రూపాయలను మహిళల ఖాతాల్లో జమ చేయాలని బీజేపీ నాయకుడు కాటిపల్లి వెంకటరమణారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహిళా సంఘాలకు రుణాలు ఇవ్వాలని, వడ్డీ సొమ్మును జమ చేయాలని, మహిళల నుండి రుణాల బలవంతపు వసూళ్లు నిలిపి వేయాలని కోరుతూ గత వారం రోజులుగా కామారెడ్డి నియోజకవర్గంలోని మండల కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించారు.

ఇందులో భాగంగా శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో పది వేల మంది మహిళలతో భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని నిజాంసాగర్ చౌరస్తాలో ధర్నా చేపట్టారు. మహిళలనుద్దేశించి కాటిపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడారు. 2018 నుంచి మహిళలకు పావలా వడ్డీ ఇవ్వడం లేదన్నారు. ఫలితంగా ఐదేళ్లుగా కామారెడ్డి నియోజకవర్గం మహిళా సంఘాల సభ్యులకు 52 కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లించాలన్నారు.

2013 నుండి ఇప్పటి వరకు 120 కోట్ల రూపాయలు అవుతుందన్నారు. మహిళలు సంఘాల ద్వారా తీసుకున్న రుణాలు 36 నెలల వాయిదాపై కట్టాల్సి వుండగా ప్రస్తుతం 18 నెలలకే వసూలు చేస్తున్నారని, అది కూడా మహిళలను బెదిరింపులకు గురి చేసి వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తీసుకున్న రుణాలతో పాటు నిర్వహణ ఖర్చులు కలిపి వందకు 2 రూపాయల చొప్పున వడ్డీ పడుతున్నట్లుగా చెప్పారు. ఇది ప్రభుత్వం ఇచ్చేదేమిటని, బయట ఫైనాన్స్ వడ్డీ పడుతుందన్నారు.

గతంలో చంద్రబాబునాయుడు వెలుగు పథకం, రాజశేఖరరెడ్డి ఐకేపి పథకం ద్వారా మహిళలకు ఆర్థికంగా చేయూతనిచ్చారని, కిరణ్‌కుమార్ రెడ్డి మహిళలకు పావలా వడ్డీ రుణాలు ఇచ్చారని గుర్తు చేశారు. తెలంగాణలో ప్రస్తుతం చెల్లింపు వాయిదాలను 18 నెలలకు కుదించారని, రుణాలు చెల్లించకుంటే పరువు తీస్తామని బెదిరిస్తున్నారని మహిళలు ఈ సందర్బంగా వెంకటరమణారెడ్డితో చెప్పుకున్నారు.

మహిళలకు వడ్డీ సొమ్ము చెల్లించాలని కోరుతూ 6వ తేదీ నుండి 9 వరకు మున్సిపల్ ముందు నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. అప్పటికి ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించకుంటే ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. రమణారెడ్డి సచ్చుడో లేక మహిళలకు వడ్డీ సొమ్ము వచ్చుడో తేల్చుకుందామని ప్రభుత్వానికి సవాల్ చేశారు.

తమ ఉద్యమం రాష్ట్రంలోని మహిళలకు మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. ఇప్పటికే అనేక పథకాలు అతీగతీ లేకుండా పోయాయన్నారు. ఇంద్రప్రభ, బంగారు తల్లి, ఎస్సీ ఎస్టీ లకు భూమి కొనుగోలు వంటి పథకాలు కనుమరుగయ్యాయని పేర్కొన్నారు. కాగా కామారెడ్డి గంజ్ ప్రాంతం నుండి ప్రారంభమైన ర్యాలీ సిరిసిల్ల రోడ్డు, స్టేషన్ రోడ్డు మీదుగా నిజాంసాగర్ చౌరస్తా వరకు చేరుకుంది. అక్కడే ధర్నా నిర్వహించగా వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

పోలీసులు ట్రాఫిక్ ఇతర ప్రాంతాల నుండి మళ్లించారు. ర్యాలీలో కామారెడ్డి పట్టణం సహా మండలంలోని గ్రామాలు, భిక్నూర్, దోమకొండ, బీబీపేట, మాచారెడ్డి మండలాలకు చెందిన వివిధ గ్రామాల నుండి మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.