Revanth Reddy | KTRకు నోటీసులిచ్చి విచారిస్తే.. అసలు విషయాలు బయటకు వస్తాయి

కేటీఆర్‌కు ఎందుకు నోటీస్‌లు ఇవ్వలేదు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పునరావాస కేంద్రంగా మారిన టీఎస్పీస్సీ నిరుద్యోగులకు విశ్వాసనం కల్పించడంలో పూర్తిగా విఫలమైన ప్రభుత్వం తెలంగాణకు పట్టిన చీడ కేసీఆర్‌ కుటుంబం సిటీ కార్యాలయం వద్ద టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రేవంత్‌పై చర్యలు తీసుకుంటాం: సిట్‌ విధాత: మంత్రి కేటీఆర్ (Minister KTR) కు నోటీస్‌లు ఇచ్చి విచారిస్తే అసలు నేరస్తులు బయట పడతారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అన్నారు. టీఎస్పీస్సీ (TSPSC) […]

  • By: Somu    latest    Mar 23, 2023 10:22 AM IST
Revanth Reddy | KTRకు నోటీసులిచ్చి విచారిస్తే.. అసలు విషయాలు బయటకు వస్తాయి
  • కేటీఆర్‌కు ఎందుకు నోటీస్‌లు ఇవ్వలేదు
  • తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పునరావాస కేంద్రంగా మారిన టీఎస్పీస్సీ
  • నిరుద్యోగులకు విశ్వాసనం కల్పించడంలో పూర్తిగా విఫలమైన ప్రభుత్వం
  • తెలంగాణకు పట్టిన చీడ కేసీఆర్‌ కుటుంబం
  • సిటీ కార్యాలయం వద్ద టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
  • రేవంత్‌పై చర్యలు తీసుకుంటాం: సిట్‌

విధాత: మంత్రి కేటీఆర్ (Minister KTR) కు నోటీస్‌లు ఇచ్చి విచారిస్తే అసలు నేరస్తులు బయట పడతారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అన్నారు. టీఎస్పీస్సీ (TSPSC) పేపర్‌ లీకేజీపై తాను, బండి సంజయ్(Bandi Sanjay), కేటీఆర్ ముగ్గురం స్పందించామని, అయితే కాంగ్రెస్, బీజేపీ అధ్యక్షులకు నోటీసులిచ్చి కేటీఆర్‌కు నోటీసివ్వలేదన్నారు. మంత్రి కేటీఆర్‌కు ఎందుకు నోటీస్‌లు ఇవ్వలేదని ప్రశ్నించారు.

సిట్‌ నోటీసులపై స్పందించిన రేవంత్‌రెడ్డి గురువారం విచారణకు హాజరు కావడానికి సిట్‌ కార్యాలయానికి వెళ్లారు. సిట్‌ విచారణ ముగిసిన తరువాత బయటకు వచ్చిన ఆయన అక్కడే ఉన్న మీడియాతో మాట్లాడుతూ విచారణకు పిలిచి మమ్మల్ని భయపెట్టే ప్రయత్నం అధికారులు చేశారని ఆరోపించారు. విచారణలో కేటీఆర్ వ్యాఖ్యల వివరాలను సిట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు.

మంత్రి కేటీఆర్ (Minister KTR) కు నోటీస్‌లు ఇవ్వండి.. స్పందించకపోతే ఆయనను విచారించాలని కోరామన్నారు. సిట్ విచారణ చేయకుండానే కేటీఆర్ నేరం ఎలా జరిగిందో తెలంగాణ సమాజానికి వివరించారని రేవంత్‌ ఆరోపించారు. ఇంత చేసిన కేటీఆర్ వ్యాఖ్యలు సిట్ అధికారుల దృష్టికి రాలేదట.. ఇది మరీ విడ్డూరంగా ఉందన్నారు. మంత్రి కేటీఆర్‌పై ఫిర్యాదు తీసుకోమని, కేవలం సమాచారం మాత్రమే తీసుకుంటామని అధికారులు చెప్పారన్నారు.

మంత్రి కేటీఆర్‌ను భర్తరఫ్‌ చేయాలి

పేపర్‌ లీకేజీకి పూర్తి బాధ్యత మంత్రి కేటీఆర్ దేనని రేవంత్‌రెడ్డి అన్నారు. కేటీఆర్‌ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం టీఎస్పీఎస్సీ పరీక్ష నిర్వహణను అపహాస్యం చేసిందన్నారు. జరిగిన నేరాన్ని ఇద్దరికే పరిమితం చేసి కేటీఆర్ పెద్ద తలల్ని కాపాడే ప్రయత్నం చేశారన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజశేఖర్ రెడ్డి, కేటీఆర్ పీఏ తిరుపతికి భాగస్వామ్యం ఉందన్నారు.

పరీక్ష రాసిన అభ్యర్థుల్లో వంద మందికి పైగా 100 మార్కులు వచ్చాయని తాము గతంలోనే చెప్పమన్నారు. వారిని విచారించాల్సింది పోయి సిట్ ద్వారా నోటీసులిచ్చి తమను భయపట్టే ప్రయత్నం ప్రభుత్వం చేసిందన్నారు. రాజ్యాంగాన్ని గౌరవిస్తూ సిట్‌ ఇచ్చిన నోటీస్‌లకు స్పంధించి అధికారులకు పూర్తి వివరాలను తెలియజేశామన్నారు. తనకు ఉన్న సమాచారాన్ని, వివరాలను సిట్ అధికారి ఏఆర్ శ్రీనివాస్ కు అందించామని తెలిపారు.

రాజకీయ పునరావాస కేంద్రంగా టీఎస్పీఎస్సీ

టీఎస్పీఎస్సీ హిందువులకు దేవాలయం, ముస్లింలకు మసీదు, సిక్కులకు గురుద్వారా లాంటిదని రేవంత్‌రెడ్డి అన్నారు. అలాంటి టీఎస్పీఎస్సీపై నిరుద్యోగులకు విశ్వాసం కల్పించడంలో ప్రభుత్వం విఫలం చెందిందన్నారు. అయితే దురదృష్టవ శాత్తు తెలంగాణలో టీఎస్పీఎస్సీ రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. నియామకాలు లోపభూయిష్ఠంగా జరిగాయన్నారు.

ప్రశ్నాపత్రం లీకేజీని నియంత్రించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. సీఎం కేసీఆర్‌ పాలనను వదిలి బీఆరెస్ పార్టీని విస్తరించుకువడంపైనే దృష్టి పెట్టారన్నారు. తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించింది విద్యార్థులు, నిరుద్యోగులేనని తెలిపారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టిందే నిరుద్యోగులన్నారు.

టీఎస్పీఎస్సీలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో నిందితుడు ప్రవీణ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రికి చెందిన వ్యక్తి అని రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్‌ 60 ఏండ్ల పోరాటాన్ని, 1200 మంది విద్యార్థుల బలిదానాలను, 30 లక్షల విద్యార్థుల భవిష్యత్తును రాజమండ్రికి చెందిన ప్రవీణ్ కుమార్ చేతిలో పెట్టాడన్నారు.

త్యాగాలు చేసి తెలంగాణ తెచ్చుకొని తొమ్మిది సంవత్సరాలు గడిచినా, తెలంగాణకు చెందిన వ్యక్తి కంప్యూటర్ అసిస్టెంట్ గా ఉద్యోగం చేయడానికి పనికిరాడా అని అడిగారు. జరిగిన నష్టాన్ని విచారణ చేయడానికి తెలంగాణకు చెందిన అధికారి లేడా అని అడిగారు. తెలంగాణకు చెందిన నిజాయితీ గల అధికారులు ఎందరో ఉన్నారు.

కానీ, టీఎస్పీఎస్సీ కేసును విచారిస్తున్న సిట్ అధికారి ఏఆర్ శ్రీనివాస్ విజయవాడకు చెందిన వ్యక్తి అని అన్నారు. ఆనాడు కేసీఆర్, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు సమైక్య పాలనలో తెలంగాణకు చెందిన వ్యక్తి అడ్వొకేట్ జనరల్ గా లేడని అన్నారని, ఇప్పుడు తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తరువాత టీఎస్పీఎస్సీలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ గా పనిచేయడానికి తెలంగాణ బిడ్డ లేడా..? అని అడిగారు. 30లక్షల తెలంగాణ నిరుద్యోగుల భవిష్యత్ ఆంధ్రా వాళ్లే నిర్ణయిస్తున్నారని రేవంత్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

చుక్కా రామయ్య, హరగోపాల్, కోదండరాం, నాగేశ్వర్‌ లతో పాటు తెలంగాణ మేధావులను తాను ప్రశ్నిస్తున్నానని చెప్పారు. తెలంగాణ వస్తే బిడ్డల బతుకులు బాగుపడతాయన్నారు మరీ రాష్ట్రం వచ్చినా ఆంధ్రా అధికారుల చేతిలోనే తాళాలు ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు. దొర ఎంగిలి మెతుకులకు ఆశపడి అల్లం నారాయణ కేసీఆర్ పంచన చేరారన్నారు. తెలంగాణ బిడ్డల త్యాగాలను కేసీఆర్ అపహాస్యం చేశారన్నారు.

50 లక్షల మంది ఉసురు ఉప్పెనై కేసీఆర్‌ కుటుంబాన్ని కప్సేస్తుంది

విద్యార్థులు, నిరుద్యోగుల కోసం ఎన్ని అవమానాలైనా, ఎన్ని కేసులైనా ఎదుర్కొంటానని రేవంత్‌ అన్నారు. తెలంగాణకు పట్టిన చీడ, పీడ కేసీఆర్ కుటుంబమేనన్నారు. ఆ చీడ, పీడను వదిలించే వరకు మా పోరాటం ఆగదన్నారు. 50లక్షల మంది ఉసురు ఉప్పెనై కేసీఆర్ కుటుంబాన్ని కప్పేస్తుందన్నారు. కెటీఆర్, జనార్దన్ రెడ్డి, అనితా రామచంద్రన్ ను విచారణ చేయాల్సిందేనని సిట్ అధికారులకు స్పష్టం చేశామన్నారు. రాజకీయ ఒత్తిడులకు అతీతంగా విచారణ చేయాలని కోరామన్నారు.

ఈ శుక్ర, శనివారాలలో ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగ నిరసన కార్యక్రమం ఉంటుందని, 25న సాయంత్రం కాకతీయ యూనివర్సిటీలో నిరసన కార్యక్రమాలు ఉంటాయన్నారు. మూడు నిర్దిష్టమైన డిమాండ్ల తో భవిష్యత్ కార్యాచరణతో ముందుకెళతామని రేవంత్‌ స్పష్టం చేశారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇచ్చిన నోటిఫికేషన్లు, క్వాలిఫై అయిన వారి వివరాలు, ఉద్యోగాలు వచ్చిన వారి వివరాలు వెబ్ సైట్ లో ఉంచేలా చూడాలని అధికారులను కోరామన్నారు.

రేవంత్‌పై చర్యలు తీసుకుంటాం: సిట్‌

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి సిట్‌ కార్యాలయానికి వచ్చి ఎలాంటి ఆధారాలు ఇవ్వలేదని సిట్‌ తెలిపింది. ఎలాంటి ఆధారాలు ఇవ్వకుండా కేవలం రాజకీయంగా మాట్లాడి వెళ్లారని పేర్కొన్నది. వంద మందికి వందకు పైగా మార్కులు వచ్చిన విషయంపై ఎలాంటి సమాచారం ఇవ్వలేదని తెలిపింది. దీంతో నిరాధారమైన ఆరోపణలు చేసిన రేవంత్‌పై న్యాయనిపుణులతో చర్చించి చర్యలు తీసుకుంటామని సిట్‌ పేర్కొన్నది.