INDIA | ఢీ అంటే ఢీ! 80% నియోజకవర్గాల్లో ‘ఉమ్మడి’.. బీజేపీపై విపక్షాల కేంద్రీకృత యుద్ధం!
INDIA | ఇండియా కూటమి తరఫున ఒకే అభ్యర్థి 80% సీట్లలో అడ్డంకులు లేవన్న నేతలు రెండు మూడు రాష్ట్రాల్లోనే కొంత ఇబ్బంది అదికూడా సర్దుబాటు చేసుకునే అవకాశం విశ్వాసం వ్యక్తం చేస్తున్న ఇండియా నేతలు రేపటి నుంచి 3 రోజులపాటు ముంబై భేటీ కన్వీనర్‌గా బీహార్ ముఖ్యమంత్రి నితీశ్? చైర్మన్ పదవిలో సోనియాగాంధీ లేదా ఖర్గే! (విధాత ప్రత్యేకం) రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీని ఓడించాలన్న సంకల్పంతో ఉన్న ఐఎన్‌డీఐఏ నేతలు.. అందుకోసం […]

INDIA |
- ఇండియా కూటమి తరఫున ఒకే అభ్యర్థి
- 80% సీట్లలో అడ్డంకులు లేవన్న నేతలు
- రెండు మూడు రాష్ట్రాల్లోనే కొంత ఇబ్బంది
- అదికూడా సర్దుబాటు చేసుకునే అవకాశం
- విశ్వాసం వ్యక్తం చేస్తున్న ఇండియా నేతలు
- రేపటి నుంచి 3 రోజులపాటు ముంబై భేటీ
- కన్వీనర్‌గా బీహార్ ముఖ్యమంత్రి నితీశ్?
- చైర్మన్ పదవిలో సోనియాగాంధీ లేదా ఖర్గే!
(విధాత ప్రత్యేకం)
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీని ఓడించాలన్న సంకల్పంతో ఉన్న ఐఎన్‌డీఐఏ నేతలు.. అందుకోసం పకడ్బందీ ప్రణాళికలు రూపొందిస్తున్నారని తెలుస్తున్నది. ఇందులో అత్యంత ముఖ్యమైనది ఉమ్మడి అభ్యర్థి. కూటమిలో ఉన్న పార్టీలు కొన్ని ఒక రాష్ట్రంలో బలంగా ఉంటే.. మరికొన్ని ఇతర చోట్ల కూడా బలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్నేహపూర్వక పోటీలు సైతం నివారించి, ఒకే అభ్యర్థిని నిలిపేందుకు రంగం సిద్ధం చేస్తారని తెలుస్తున్నది. దాదాపు 80శాతం నియోజకవర్గాల్లో తాము దీన్ని సాకారం చేస్తామని, తద్వారా మోదీని ఢీ అంటే ఢీ అనే పద్ధతుల్లో ఢీకొంటామని కూటమిలోని సీనియర్ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
బీజేపీయేతర ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలతోపాటు.. జమ్ముకశ్మీర్, యూపీ, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, బీహార్, మహారాష్ట్ర, తమిళనాడు, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఇందుకు ఎలాంటి ఇబ్బందీ లేదన్న ఉత్సాహం నాయకుల మాటల్లో కనిపిస్తున్నది. ఢిల్లీ, పంజాబ్‌లలో కాంగ్రెస్-ఆప్ మధ్య, తృణమూల్, వామపక్షాల మధ్య బెంగాల్‌లో, కాంగ్రెస్-వామపక్షాల మధ్య కేరళలో కొంత ఇబ్బంది తలెత్తవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే అదేమీ అధిగమించలేని ఆటంకం కాదని అంటున్నారు. ఎందుకంటే తమ లక్ష్యం అంత స్పష్టంగా ఉన్నదని గుర్తు చేస్తున్నారు.
ఇండియా కూటమి భద్రంగానే ఉన్నదా? అన్న ప్రశ్నకు.. ఆ సందేహం ఒక్క పార్టీకి మాత్రమే ఉన్నదంటూ పరోక్షంగా బీజేపీ ఉద్దేశించి ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. తామంతా పూర్తి ఐక్యతతో ఉన్నామని, తమ లక్ష్యం కూడా స్పష్టంగా ఉన్నదని ఆయన తెలిపారు. ప్రత్యేకించి కూటమి ఐక్యతను కాపాడే విషయంలో కాంగ్రెస్ పట్టువిడుపులతో, ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఉన్నదని ఆయన వివరించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌కు చెందిన ముగ్గురు కీలక నేతలు సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ ముంబై సమావేశానికి హాజరవుతున్నారని చెప్పారు.
మిగతా పార్టీలు కూడా అదే పద్ధతిలో ఆలోచిస్తున్నాయని అంటున్నారు. ప్రజాస్వామిక వ్యవస్థలన్నింటినీ ఒక్కొక్కటిగా నాశనం చేసుకుంటూ.. దేశ లౌకిక స్వభావాన్ని మంటగలిపే విధానాలు అనుసరిస్తున్న మోదీ పాలనకు చరమగీతం పాడకపోతే.. ఈ దేశం మనుగడ కష్టమేనని ఒక సీనియర్ నాయకుడు అన్నారు. మహారాష్ట్ర నుంచి కూటమిలో ప్రాతినిథ్యం వహిస్తున్న మూడు పార్టీలు కాంగ్రెస్, శివసేన (ఉద్ధవ్), ఎన్సీపీ.. ముంబైలో ఈ నెల 31 నుంచి సమావేశాన్ని దిగ్విజయం చేసేందుకు కృషి చేస్తున్నాయి. ఇది కూడా ప్రతిపక్షాల ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తున్నదని విశ్లేషకులు అంటున్నారు.
ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయాలే కీలకం
రాబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించే విజయాలు.. దేశంలో బీజేపీ-ఆరెస్సెస్ సిద్ధాంతాలకు చెక్ చెప్పగలుగుతాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. మోదీ ఆధిపత్యాన్ని సవాలు చేసే శక్తులు పెరిగితే తప్ప దేశంలో విధ్వంసకర రాజకీయాలకు అడ్డుకట్ట వేయడం సాధ్యం కాదనే అభిప్రాయం ప్రగతిశీల శక్తులలో వ్యక్తమవుతున్నది.
తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్ విజయాలు సాధించగలిగితే.. దేశంలో నానాటికీ విస్తరిస్తున్న ఆరెస్సెస్-బీజేపీ భావ జాలాన్ని నిలువరించేందుకు రాజకీయ బలాన్ని సంతరించుకుంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మోదీ ఆధిపత్యానికి వ్యతిరేకంగా ప్రజా తీర్పు ఉంటే.. ఆయన విధ్వంసకర రాజకీయాలు కూడా గణనీయంగా తగ్గుతాయని చెబుతున్నారు. ఈ క్రమంలోనే ముంబై సమావేశం తర్వాత ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ తన శక్తియుక్తులన్నింటినీ కేంద్రీకరిస్తుందని అంటున్నారు.
మినీ జమిలితో ముందస్తు?
ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో బీజేపీ చావుదెబ్బలు తిన్నది. అక్కడ మోదీ తిరిగినా జనం నమ్మలేదు. దీంతో మరో ఐదు రాష్ట్రాల్లోనూ ఎదురుగాలి వీస్తే సార్వత్రిక ఎన్నికల్లో గట్టెక్కడం సాధ్యం కాదని భావిస్తున్న మోదీ రహస్యంగా ముందస్తు ప్రయత్నాల్లో ఉన్నారని తెలుస్తున్నది. మోదీ ముందస్తుకు వెళతారని, అందుకే ప్రతిపక్షాలకు ఆఖరి నిమిషంలో దొరకకుండా ముందే హెలికాప్టర్లను బీజేపీ బుక్ చేసేసుకున్నదని నిన్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించగా.. తాజాగా బీహార్ సీఎం నితీశ్‌కుమార్ సైతం ప్రధాని మదిలో ముందస్తున్న ఆలోచన బలంగా ఉన్నదని పేర్కొనడం గమనార్హం.
జమిలికి ప్రయత్నాలు చేస్తున్నారని తొలుత వార్తలు వచ్చినా.. ఉన్న తక్కువ సమయంలో అది సాధ్యమయ్యే పనికాదని తేలిపోవడంతో అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలు, కాస్త ముందో వెనుకో జరిగే రాష్ట్రాల ఎన్నికలను సర్దుబాటు చేసి మినీ జమిలికి వెళతారనే చర్చ ఉన్నది. ఈ విషయంలో ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని సైతం ఒప్పించారని జాతీయ మీడియాలో కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇండియా కూటమిలో ఉన్న రెండు పార్టీల అధినేతలు ముందస్తుపై మాట్లాడిన నేపథ్యంలో ముంబై భేటీలో దీనిపైనా చర్చించే అవకాశం కనిపిస్తున్నది.
సారంపై దృష్టి కేంద్రీకరించిన నేతలు
ప్రతిపక్షాల మధ్య ఐక్యత సాధన, కూటమి పేరు నిర్ణయానికి ఎక్కువ సమయం తీసుకున్నా.. చాలా తర్వగానే ఇండియా కూటమి తన నిర్మాణం, సారంపైకి దృష్టి మళ్లించింది. పాట్నా సమావేశం తర్వాత మరిన్ని పార్టీలు చేరడంతో ఇండియా కూటమిలో భాగస్వాముల సంఖ్య 26కు పెరిగింది. మూడో సమావేశాన్ని ఈ నెల 31 నుంచి మూడు రోజులపాటు ముంబైలో నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఈ సమావేశాల్లోనే కూటమికి కన్వీనర్‌ను ఎంపిక చేయనున్నారు. ఇండియా కూటమిలోకి వచ్చే భాగస్వాముల సంఖ్య కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పలు చిన్న పార్టీలు కూటమిలో చేరేందుకు ఇప్పటికే తమ సంసిద్ధత వ్యక్తం చేశాయి. మరోవైపు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతి ఇండియా కూటమి నేతలతో కీలక సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తున్నది. ఇటీవల బీఎస్పీ నాయకుడొకరు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌తో చర్చలు జరిపినట్టు సమాచారం. అయితే.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఆధారంగా మాయావతి నిర్ణయం ఉంటుందని తెలుస్తున్నది.
ఎన్నికల రాష్ట్రాల్లో సంయుక్త బహిరంగ సభలు
ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లో ఇండియా కూటమి ఆధ్వర్యంలో సంయుక్త బహిరంగ సభలు, ర్యాలీల నిర్వహణకు నేతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని తెలుస్తున్నది. ఈ క్రమంలోనే వ్యూహాల అమలుకు తగిన యంత్రాంగం ఏర్పాటుపై ముంబై భేటీలో కీలక నిర్ణయాలు ఉండనున్నాయి. ఇందుకోసం ప్రధాన పార్టీల నాయకులతో ఒక సమన్వయ కమిటీని ఖరారు చేయనున్నారు. దీనితోపాటే సంప్రదింపులు, మ్యానిఫెస్టో తయారీ వంటివాటిపై సబ్ కమిటీలను నియమించనున్నారు.
సీట్ల సర్దుబాటుపై తదుపరి భేటీల్లోనే
భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు అంశంపై ముంబై భేటీలో చర్చించే అవకాశం లేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 80శాతానికిపైగా సీట్లలో ఉమ్మడి అభ్యర్థిని నిలిపేందుకు అవకాశాలు ఉన్న నేపథ్యంలో దీనిపై సమయం వృథా చేయడం సరైంది కాదనే అభిప్రాయం కూటమి నేతల్లో వ్యక్తమవుతున్నది.
అయితే.. సర్దుబాట్లపై స్థూలంగా ఒక అవగాహనకు వచ్చే అవకాశం ఉండొచ్చని అంటున్నారు. ముంబై సమావేశాల్లో తొలి రోజున ఇండియా కూటమి లోగోను ఆవిష్కరించనున్నారు. ఇది అశోకచక్ర లేని త్రివర్ణ పతాకమని చెబుతున్నారు. నిజానికి ఇది వినూత్నం. ఇప్పటి వరకూ అనేక కూటములు జాతీయ స్థాయిలో, రాష్ట్రాల స్థాయిలో వచ్చినా.. ఏ కూటమి కూడా లోగోను కలిగి లేవు.
కన్వీనర్ బాధ్యత నితీశ్‌కే!
ముంబై సమావేశాల్లో కూటమికి కన్వీనర్‌గా నితీశ్‌కుమార్‌ను ఎంపిక చేస్తారని వినిపిస్తున్నది. కూటమి చైర్మన్ విషయంలో కాంగ్రెస్‌కు అవకాశం ఇస్తారని అంటున్నారు. అదే జరిగితే సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గేలలో ఒకరిని ఎంచుకుంటారని తెలుస్తున్నది.