INDIA | అశోక చక్రం లేని.. త్రివర్ణం పతాకం! ఇండియా కూటమికి జెండా ఇదే?

INDIA | ముంభై భేటీలో చర్చించనున్న నేతలు 31 నుంచి మూడు రోజుల సమావేశం తొలిరోజు సాయంత్రం లోగో విడుదల స్ఫూర్తినిచ్చేలా ఉంటుందన్న సంజయ్‌ రౌత్‌ న్యూఢిల్లీ: రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని ఓడించే దిశగా 26 ప్రతిపక్ష పార్టీల కూటమి తన మూడో సమావేశాన్ని ముంబైలో నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమికి చక్రం లేని త్రివర్ణ పతాకాన్ని జెండాగా తీసుకునే అవకాశం ఉన్నదని విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి. ఇండియా కూటమి మూడో సమావేశం ఆగస్ట్‌ […]

  • By: Somu    latest    Aug 28, 2023 12:56 PM IST
INDIA | అశోక చక్రం లేని.. త్రివర్ణం పతాకం! ఇండియా కూటమికి జెండా ఇదే?

INDIA |

  • ముంభై భేటీలో చర్చించనున్న నేతలు
  • 31 నుంచి మూడు రోజుల సమావేశం
  • తొలిరోజు సాయంత్రం లోగో విడుదల
  • స్ఫూర్తినిచ్చేలా ఉంటుందన్న సంజయ్‌ రౌత్‌

న్యూఢిల్లీ: రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని ఓడించే దిశగా 26 ప్రతిపక్ష పార్టీల కూటమి తన మూడో సమావేశాన్ని ముంబైలో నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమికి చక్రం లేని త్రివర్ణ పతాకాన్ని జెండాగా తీసుకునే అవకాశం ఉన్నదని విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి. ఇండియా కూటమి మూడో సమావేశం ఆగస్ట్‌ 31 నుంచి మూడు రోజులపాటు ముంబైలో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

ఈ సమావేశాల్లో జెండా కూడా అజెండాలో ఉన్నదని సమాచారం. 31వ తేదీ సాయంత్రం 7 గంటల సమయంలో అందరు ప్రతిపక్ష నేతల సమక్షంలో కూటమి లోగో, జెండాను ఆవిష్కరిస్తారని శివసేన (ఉద్ధవ్‌ వర్గం) నేత సంజయ్‌ రౌత్‌ తెలిపారు. కూటమి లోగో ప్రతి భారతీయుడికి స్ఫూర్తినిచ్చేదిగా ఉంటుందని చెప్పారు.

ఇండియా కూటమి తొలి సమావేశం పాట్నాలో, రెండో సమావేశం బెంగళూరులో నిర్వహించగా.. మూడో సమావేశాన్ని ముంబైలో ఏర్పాటు చేశారు. బెంగళూరు భేటీ సందర్భంగా కూటమికి ‘ఇండియన్‌ నేషనల్‌ డెవలప్‌మెంటల్‌ ఇంక్లూసివ్‌ అలయెన్స్‌-ఐఎన్‌డీఐఏ) అని నామకరణం చేయగా.. మూడో భేటీలో జెండాపై నిర్ణయంతోపాటు.. పొత్తులు, సీట్ల సర్దుబాటుపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.

ప్రతిపక్ష కూటమి తరఫున నిర్వహించే అన్ని ర్యాలీలు, సభల్లో ఉమ్మడిగా ఒక జెండాను ఉపయోగించాలన్న ఆలోచనలో కూటమి నేతలు ఉన్నట్టు సమాచారం. కూటమిగా ఉమ్మడి జెండాఉన్నా.. ఆయా రాష్ట్రాల్లో పోటీ చేసే మిత్రపక్షాలు.. తమ సొంత జెండాలు, ఎన్నికల చిహ్నాలు ఉపయోగిస్తాయి. ముంబై సమావేశం తర్వాత సెప్టెంబర్‌ నుంచి ప్రతిపక్షాలు దేశవ్యాప్తంగా సభలు, ర్యాలీలు నిర్వహిస్తాయి. వీటిలో ఆరు లేదా ఏడుగురు కీలక నేతలు, కాంగ్రెసేతర ముఖ్యమంత్రులు పాల్గొనే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.

ఈ సభలు, ర్యాలీల సందర్భంగా ప్రసంగాలు వ్యూహాత్మకంగా ఉండేలా రూపొందిస్తారని సమాచారం. ప్రధాని మోదీపై వ్యక్తిగత విమర్శల జోలికి పోకుండా.. ప్రభుత్వ విధానాలు, కుల గణన, ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత, ఇతర సామాజిక అంశాలపైనే ప్రధానంగా కేంద్రీకరించాలని భావిస్తున్నట్టు చెబుతున్నారు. ముంబై సమావేశాల్లోనే కూటమికి చైర్మన్‌, ముఖ్య సమన్వయ కర్త, నలుగురు లేదా ఐదుగురు ప్రాంతీయ సమన్వయ కర్తల నియామకంపై చర్చించి, నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.

ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ను మినహాయిస్తే.. ఇండియా కూటమి తరఫున అభ్యర్థులను దించేందుకు 450 స్థానాలను గుర్తించినట్టు చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో 40 నుంచి 80 సీట్లు ఆశిస్తున్న బీఎస్పీ అధినేత్రి మాయావతితో కూడా ఇండియా కూటమి నేతలు సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం. ఈ అంశం కూడా ముంబై భేటీలో చర్చకు వస్తుందని అంటున్నారు. దీనితోపాటు.. కూటమిలోకి మరికొన్ని చిన్న పార్టీలను తీసుకునే విషయంలోనూ చర్చిస్తారని సమాచారం.

సారథ్యం ఎవరికి?

ఇండియా కూటమికి చైర్మన్‌, ముఖ్య కన్వీనర్‌ ఎవరనేది ముంబై భేటీలో తేలిపోనున్నది. అయితే ఇండియా కూటమి సారథ్య బాధ్యతలు మీరు తీసుకుంటారా? అన్న మీడియా ప్రశ్నకు బీహార్‌ సీఎం, జేడీయూ అధినేత నితీశ్‌కుమార్‌ స్పందిస్తూ.. ‘నేను ఏదో ఒకటి అవ్వాలని అనుకోవడం లేదు. ఈ విషయాన్ని నేను పదే పదే చెబుతూ వస్తున్నాను. నాకు అలాంటి కోరిక ఏమీ లేదు. అందరినీ ఒక్కతాటిపైకి తేవాలనేదే నా కోరిక’ అని అన్నారు.