Amrita Pal Singh | నేపాల్‌లో అమృత్ పాల్..?
విధాత: పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న ఖలిస్థాన్ వాద నాయకుడు అమృత్ పాల్ సింగ్ (Amrita Pal Singh) దేశ పరిహద్దులు దాటి నేపాల్‌లో తలదాచుకున్నాడని అనుమానంగా ఉంది. దీంతో అతడు భారత పాస్ పోర్టును కానీ, మరేదైనా నకిలీ పాస్ పోర్టును కానీ ఉపయోగించుకొని మరో దేశానికి పారిపోకుండా చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వం నేపాల్‌ను కోరింది. ఈ మేరకు కాఠ్మండూలోని భారత రాయబార కార్యాలయం నేపాల్ కాన్సులర్ సర్వీసెస్ శాఖకు లేఖ రాసింది. వీలైతే […]

విధాత: పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న ఖలిస్థాన్ వాద నాయకుడు అమృత్ పాల్ సింగ్ (Amrita Pal Singh) దేశ పరిహద్దులు దాటి నేపాల్‌లో తలదాచుకున్నాడని అనుమానంగా ఉంది. దీంతో అతడు భారత పాస్ పోర్టును కానీ, మరేదైనా నకిలీ పాస్ పోర్టును కానీ ఉపయోగించుకొని మరో దేశానికి పారిపోకుండా చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వం నేపాల్‌ను కోరింది. ఈ మేరకు కాఠ్మండూలోని భారత రాయబార కార్యాలయం నేపాల్ కాన్సులర్ సర్వీసెస్ శాఖకు లేఖ రాసింది. వీలైతే ఆయనను అరెస్టు చేయాలని ఈ లేఖలో కోరింది.
అమృత్‌పాల్ సింగ్ ఫోటో సహా ఇతర వ్యక్తిగత ఆనవాళ్లను వివరాలను హోటళ్ళకు, ఎయిర్ లైన్స్ కు, ఇతర సంబంధిత సంస్థలకు పంపించినట్టు తెలుస్తున్నది. ఈ నెల 18వ తేదీ నుంచి అమృత్‌పాల్ సింగ్ పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. అతడి దగ్గర పలు మారు పేర్లతో అనేక పాస్ పోర్టులు ఉన్నట్టు అనుమానిస్తున్నారు.
ఎవరీ అమృత్‌పాల్ సింగ్ ?
ఇటీవలి కాలం వరకు అమృత్‌పాల్ రాజకీయ, ఉద్యమ రంగాలలో లేడు. ఆయన గురించి ఎవరికీ తెలువదు. పంజాబ్‌లోని అమృత్ సర్ జిల్లాలోని జల్లూపూర్ ఖెరా నివాసి అయిన అమృత్‌పాల్ సింగ్ 2012లో దుబాయి వెళ్ళి తమ కుటుంబానికి చెందిన ట్రాన్స్ పోర్ట్ వ్యాపారంలో చేరాడు. మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన సింగ్ గతంలో ఒక కార్గో కంపెనీలో కూడా పనిచేశాడు.
వేర్పాటువాద భావజాల ప్రచారాన్ని సోషల్ మీడియా ద్వారా సాగించడంతో అమృత్‌పాల్ సింగ్ ప్రాచుర్యం పెరిగింది. సిక్కుల ఐక్యత, ప్రత్యేక దేశం అంటూ ప్రచారం సాగించాడు. ఒకప్పటి వేర్పాటువాద తీవ్రవాది భింద్రన్ వాలే మాదిరిగా తన వేషాన్ని మార్చుకొని దుబాయి నుంచి భారత్‌కు చేరుకున్నాడు.
అతడు పంజాబ్ చేరుకున్న నెల రోజుల తరువాత వారిస్ పంజాబ్ డే (పంజాబ్ వారసులు) అనే సిక్కు సంస్థకు అట్టహాసంగా జరిగిన ఒక కార్యక్రమంలో సారథ్యం చేపట్టారు. భింద్రన్ వాలే స్వగ్రామం రోడేలో జరిగిన కార్యక్రమానికి వేలాది మంది అనుచరులు హాజరయ్యారు. నటుడు ఉద్యమకారుడు అయిన దీప్ సిధు ఈ సంస్థ స్థాపకుడు. రైతుల నిరసన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన దీప్ సిధు ఆ తరువాత కాలంలో కారు ప్రమాదంలో మరణించాడు. ఈ సంస్థ అమృత్‌పాల్ సింగ్ కు అనువుగా లభించింది .
అతడు అంతర్జాతీయంగా ఖలిస్థాన్ అనుకూల శక్తులను కూడగడుతున్నాడని, దేశంలో వేర్పాటు వాద బీజాలు వేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడని కేంద్ర ప్రభుత్వం పసిగట్టడంలో విఫలమైంది. ఇటీవలి పలు సంఘటనలను బట్టి ఇతడు పంజాబ్‌లో ఎంతగా మద్దతు కూడగట్టుకున్నాడో తెలుస్తున్నది.
అమృత్‌పాల్ అనుచరుడిని ఒకరిని విడిపించుకోవడానికి గత నెలలో వందలాది మంది కత్తులు, తుపాకులు ధరించి ఒక పోలీసు స్టేషన్ పై దాడి చేశారు. పోలీసులు నిస్సహాయంగా మారి, అతడి విడుదలకు అంగీకరించి వారిని శాంతింప చేసి పంపించి వేశారు.
భింద్రన్ వాలే చాలా గొప్ప వాడు. నేను అతడి కాలి ధూళికి కూడా సరిపోను అని అమృత్‌పాల్ సింగ్ వ్యాఖ్యానించాడు. కానీ చాలా మందిని ఆయన భింద్రన్ వాలే వారసుడనే విధంగా నమ్మిస్తున్నాడు. 1980 దశకంలో పంజాబ్ లో ఖలిస్థాన్ ఉగ్రవాదం భీకర రూపం దాల్చింది. ఉగ్రవాదుల కాల్పులల వేలాది మంది అమాయకులు మరణించారు. అనేక మంది ప్రముఖులను కూడా ఉగ్రవాదులు కాల్చి చంపారు. పోలీసు చర్యలలో ఉగ్రవాదులు వేలాదిగా మరణించారు. అనేక మంది అమాయకులు కూడా మరణించారనే ఆరోపణలు ఉన్నాయి.
ఎవరు ఎవరి చేతిలో మరణించినా పంజాబ్ చరిత్రలో అదొక రక్త సిక్త అధ్యాయంగా నిలిచిపోయింది. 1984లో ఆపరేషన్ బ్ల్యూ స్టార్ పేర స్వర్ణాలయంపై సైనిక చర్య జరిగింది. ఈ సైనిక చర్యలో స్వర్ణాలయంలో ఉన్న అనేక మంది ఉగ్రవాదులు మరణించారు. ఉగ్రవాద నాయకుడు భింద్రన్ వాలే కూడా ఈ సైనిక చర్యలో మరణించాడు. ఆ తరువాత కాలంలో అంగరక్షకులుగా ఉన్న సిక్కుల కాల్పులలో ప్రధాని ఇందిరాగాంధీ మరణించారు.
అమృత్‌పాల్ సింగ్ కార్యకలాపాలు అతడి చర్యలకు సిక్కు యువతలో వస్తున్న స్పందన మూలంగా 1980 దశకం నాటి పంజాబ్ ఉగ్రవాదం తాలూకు గాయాలు గుర్తుకు వస్తున్నాయి. ఖలిస్థాన్ సాధన కోసం సాయుధ పోరాటం చేయాలని అమ్రుత్ పాల్ సింగ్ బహిరంగంగా పిలుపునిస్తుంటాడు. పాకిస్థాన్ ఇంటలిజెన్స్ ఏజెన్సీలతో అయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. విదేశాలలోని ఉగ్రవాద సంస్థలతో కలిసి ఆయన వేర్పాటువాద కార్యకలాపాలు సాగిస్తున్నాడు. యూకేలోని ఖలిస్తాన్ ఉగ్రవాది అవతార్ సింగ్ ఖండా మద్దతుతో అంతర్జాతీయంగా ఖలిస్థాన్ కు మద్దతు సాధించాడు. భారీ ఎత్తున యువతను ఆయుధాలను కూడగడుతున్నాడు.