INDIA | ఎన్డీయేపై పోరుకు.. ఐఎన్‌డీఐఏ
INDIA ప్రతిపక్షాల కూటమికి పేరు ఖరారు ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయెన్స్ పేరుతో కూటమి హర్షం వ్యక్తం చేసిన విపక్ష నాయకులు ఇక ఇండియా అనే పదం పలకడం బీజేపీకి కష్టమేనన్న ఆర్జేడీ బెంగళూరు: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీపై ఉమ్మడి పోరాటానికి సిద్ధమైన ప్రతిపక్షాల.. తమ కూటమికి ఐఎన్‌డీఐఏ (ఇండియా) అని నామకరణం చేశారు. అంటే.. భారత జాతీయ అభివృద్ధి సమ్మిళిత కూటమి అని అర్థం. దీనిని ఇంగ్లిష్ పొడి అక్షరాల్లో ఐఎన్‌డీఏ అని […]

INDIA
- ప్రతిపక్షాల కూటమికి పేరు ఖరారు
- ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయెన్స్ పేరుతో కూటమి
- హర్షం వ్యక్తం చేసిన విపక్ష నాయకులు
- ఇక ఇండియా అనే పదం పలకడం బీజేపీకి కష్టమేనన్న ఆర్జేడీ
బెంగళూరు: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీపై ఉమ్మడి పోరాటానికి సిద్ధమైన ప్రతిపక్షాల.. తమ కూటమికి ఐఎన్‌డీఐఏ (ఇండియా) అని నామకరణం చేశారు. అంటే.. భారత జాతీయ అభివృద్ధి సమ్మిళిత కూటమి అని అర్థం. దీనిని ఇంగ్లిష్ పొడి అక్షరాల్లో ఐఎన్‌డీఏ అని వచ్చేలా పేరు పెట్టారు. కూటమి కొత్త పేరును కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బెంగళూరు సమావేశంలో ప్రకటించారు.
అంతకు ముందు సమావేశంలో చర్చించిన ప్రతిపక్ష నేతలు ఐఎన్‌డీఐఏ పేరుకు మద్దతు పలికారు. వ్యూహాత్మకంగా ఈ పేరును ఖరారు చేసినట్టు కనిపిస్తున్నది. ఎన్నికల ప్రచారంలోకి వెళ్లినప్పుడు ఎన్డీయేపై ఇండియా పోరాడుతున్నదనే అర్థం వచ్చేలా ఇది ఉన్నది. ప్రతిపక్షాల కొత్త కూటమి పేరుపై పలువురు నేతలు వినూత్నంగా స్పందించారు.
శివసేన (ఉద్ధవ్) నాయకురాలు ప్రియాంక చతుర్వేది హర్షం వ్యక్తం చేస్తూ.. టీమ్ ఇండియా వర్సెస్ ఎన్డీయే అని ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు. ‘ఇక ఇండియా అనే పదం ఉచ్ఛరించాలంటే బీజేపీకి కష్టమే’ అని ఆర్జేడీ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నది. కాంగ్రెస్ లోక్‌సభ ఎంపీ మాణిక్కం ఠాగూర్ ‘ఇండియా విల్ విన్’ అని పోస్టు చేశారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓ బ్రైన్ ‘చక్ దే ఇండియా’ అని వ్యాఖ్యానించారు.
భారత రాజకీయాల్లో మార్పు
ప్రతిపక్షాల బెంగళూరు సమావేశం మొత్తం దేశ రాజకీయాల్లోనే మూల మలుపు కాబోతున్నదని నాయకులు భావిస్తున్నారు. ‘మేం ఐక్యంగా నిలిచాం’ అనే నినాదం, కూటమికి ఇండియా అనే పేరు ప్రజల్లో చొచ్చుకుపోయేందుకు ఉపకరిస్తుందని చెప్పారు.
మరోవైపు అధికార బీజేపీ తన భాగస్వామ్య పక్షాల ఓట్లతో గెలిచి.. తర్వాత వాటిని వదిలేసిందని, ఇప్పుడు ప్రతిపక్షాల సమావేశం నేపథ్యంలో ప్రతి ఒక్క చిన్న పార్టీని కలుపుకొని పోయేందుకు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి తిరుగుతున్నదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ట్విట్టర్‌లో మండిపడ్డారు.