ఏపీలో గాలి అటు మళ్లుతోందా..?
ఉన్నమాట: జగన్ అధికారం అయాచితంగా అందుకున్నది కాదు. తండ్రిని సీఎం చేసిన పార్టీని అడ్డుపెట్టుకుని అందలం ఎక్కింది కాదు. 12 ఏళ్ల క్రితం ఒక్కడిగా మొదలుపెట్టి ఈ రాష్ట్రంలోని ప్రతి ఊళ్లోనూ తన సైన్యాన్ని సృష్టించుకున్న వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి విజయం!. కానీ మూడున్నరేళ్ల వైఎస్ జగన్ పాలన జనం విశ్వాసానికి, ఆశలకు దూరమవుతున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. ఏ వర్గమూ సంతృప్తిగా లేని ఒక వాతావరణం ఏపీ రాజకీయాల్లో నివురుగప్పిన నిప్పులా అలుముకుందా? గత ఎన్నికల […]

ఉన్నమాట: జగన్ అధికారం అయాచితంగా అందుకున్నది కాదు. తండ్రిని సీఎం చేసిన పార్టీని అడ్డుపెట్టుకుని అందలం ఎక్కింది కాదు. 12 ఏళ్ల క్రితం ఒక్కడిగా మొదలుపెట్టి ఈ రాష్ట్రంలోని ప్రతి ఊళ్లోనూ తన సైన్యాన్ని సృష్టించుకున్న వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి విజయం!. కానీ మూడున్నరేళ్ల వైఎస్ జగన్ పాలన జనం విశ్వాసానికి, ఆశలకు దూరమవుతున్నట్లు సంకేతాలు వస్తున్నాయి.
ఏ వర్గమూ సంతృప్తిగా లేని ఒక వాతావరణం ఏపీ రాజకీయాల్లో నివురుగప్పిన నిప్పులా అలుముకుందా? గత ఎన్నికల సమయంలో ఏ వర్గాలైతే జగన్ సీఎం కావాలని తపించారో, ఉద్యమించారో, క్రియాశీలకంగా పనిచేశారో ఆ వర్గాలే ఇప్పుడు నోరెళ్లబెట్టే పరిస్థితి దేనికి సంకేతం? సరిగ్గా ఏడాదిన్నర కాలంలో జరగనున్న ఎన్నికల్లో 175 సీట్లు కైవసం చేసుకోవాలని కలలు కంటున్న జగన్‌కు బ్యాలెట్ బాక్సులు బాంబులుగా మారుతాయా? ఆ ప్రయత్నమే చేసింది విధాత. మూడ్ ఆఫ్ ద ఏపీని అంచనా వేసేందుకు వివిధ వర్గాలతో మాట్లాడింది. వారి అభిప్రాయాలు యధాతథంగా పాఠకులకు వివరిస్తోంది.
రాజకీయాల్లో ఉన్న వారు ఎవరైనా అన్ని వర్గాలను కలుపుకొని పోవాల్సిందే. ఎన్నికల సమయంలో అందరిపాత్రా.. నాయకులకు అత్యంత కీలకం. సమాజంలోని అన్ని వర్గాలూ.. అన్ని పార్టీలకూ అవసరమే. గత ఎన్నికలకు ముందు.. వైసీపీ అధినేత జగన్.. ఇలా అన్ని వర్గాలను కలుపుకొని పోయారు. పాదయాత్ర సమయంలో అన్నివర్గాలతో మమేకమై…అందరి బాధలను విన్నానని, మీ కష్టాలను తీరుస్తానని పెద్ద పెద్ద హామీలు ఇచ్చిన జగన్..ఆచరణలో ఎక్కడ విఫలమవుతున్నారు?.
రెడ్డి సామాజిక వర్గంలోనే తీవ్ర అసంతృప్తి
జగన్ పాదయాత్ర సమయంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు జగన్ కోసం తీవ్రంగా శ్రమించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి తరువాత రెడ్డి సామాజిక వర్గం నుంచి జగన్ సీఎం కాకపోతే… ఆ లోటును ప్రస్తుతం రెడ్లలో ఉన్న వారెవరూ భర్తీ చేసే శక్తి సామర్థ్యాలు లేవని, జగన్‌కు తోడుగా ఉండకపోతే రాజకీయ అత్యున్నత పదవులకు రెడ్డి సామాజిక వర్గం చాలా దూరమవుతుందని మూకుమ్మడిగా జగన్ వెంట నడిచారు. రెడ్డి ఉద్యోగుల సంఘాలు కూడా చంద్రబాబు చేసిన మేలు కాదని.. జగన్ను నెత్తికెత్తుకున్నాయి. కానీ మూడేళ్లలో వారి గౌరవం పెరిగిందా? అంటే లేదనే చెప్పాలి. వారికి గ్రామాల్లో ఏ ఒక్క పనికి సిఫారసు చేసే శక్తి లేదు.
ఎంత పెద్ద రెడ్డికైనా తెల్ల కార్డు ఇప్పించే హోదా లేదు. వలంటీరుకు ఉన్న గౌరవం, హోదా, ప్రజల్లో పలుకుబడి ఊరి పెద్దగా ఉన్న రెడ్డికి లేదు. ఇక ఏ ఒక్క అభివృద్ధి పని జరగని కారణంగా చిన్న చిన్న కాంట్రాక్టులు లేవు. ఆదాయం లేదు. చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీల పేరుతో రుణాల మంజూరు, ఇళ్ల పట్టాలు, రేషన్ కార్డులు, పెన్షన్లు వంటి అనేక పథకాల అమలులో టీడీపీ నాయకులకు అధికారం, ఆదాయం ఉండేది.
ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో ఆ అవకాశం రెడ్లకు లేకుండా పోయింది. ఇది వారిని మానసికంగా, ఆర్థికంగా కుంగదీస్తోంది. ఇప్పుడు వారిలో 80 శాతం మందికి జగన్ అంటే ప్రేమ లేదు. చంద్రబాబు అంటే వ్యతిరేకత లేదు. తెలుగుదేశం నుంచి రెడ్డి సామాజిక వర్గం తరఫున పోటీ చేసే అభ్యర్థులకు ఈ అసంతృప్తి బాగా ఉపయోగ పడుతుంది. ఇలా కనీసం రాష్ట్రంలో 10 స్థానాల్లో తెలుగుదేశం రెడ్డి అభ్యర్థులు సునాయాస విజయం పొందే అవకాశం ఉంది.
శ్రీసత్యసాయి జిల్లాలోని ఒక నియోజకవర్గంలో మొత్తం 90 శాతం ఓట్లున్న ఓ పల్లెటూరులో రెడ్డి సామాజికవర్గం వచ్చే ఎన్నికల్లో జగన్‌కు ఓటేయడం అంత బుద్ది తక్కువ పని మరొకటి లేదని బాహాటంగా చెబుతున్నారు. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి కూడా రెడ్డి సామాజికవర్గం కావడంతో ఆయన ప్రచారం చేయక పోయినా 20 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తాడని జోస్యం చెబుతున్నారు.
ఉద్యోగుల బాధ వర్ణనాతీతం.
పాదయాత్ర సమయంలో జగన్ వెంట నడిచి ఉద్యోగుల సమస్యలను మొర పెట్టుకున్నప్పుడు అన్నీ సావధానంగా విని.. తాను అధికారంలోకి వచ్చాక.. వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తానని, మిగిలిన సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు జగన్.. అయితే. అధికారంలోకి వచ్చారు కానీ.. ఇప్పటి వరకు ఏ ఒక్క సమస్య పరిష్కరించింది లేదు. సీపీఎస్ విషయంలో మాట మార్చారు. కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్‌వట్లు ఉద్యోగులకు అర్థమైపోయింది.
పైగా వారిపై ఇష్టమొచ్చినట్లు కేసులు పెట్టి వేధిస్తున్నారు. పీఆర్‌సీ విషయంలో తీవ్ర నిరాశ మిగిల్చారు. పైగా.. ఉద్యోగులపై వివిధ యాప్‌ల పేరుతో భారం పెరిగింది. వారికి సమయానికి వేతనాలు కూడా అందడం లేదు. దసరా, దీపావళికి కనీసం వారి పాత డీఏని కూడా ఇవ్వలేని దుస్థితి. ఇక ఉద్యోగులు నెల నెల జీతం నుంచి దాచుకుంటున్న జీపీఎస్, సీపీఎస్, గ్రాట్యుటి సొమ్మును ఖాళీ చేసేశారు.
కనీసం రిటైర్డైన ఉద్యోగికి ఏడాదికి కూడా ఆయనకు రావాల్సిన సొమ్ము ఇవ్వలేని పరిస్థితి. ఉద్యోగుల ఎర్నెడ్ లీవులు క్యాష్ చేసుకోవడానికి ఈ రోజు దరఖాస్తు చేస్తే రెండేళ్లు ఆగాల్సిని పరిస్థితి. దీంతో ఉద్యోగులు, వారి కుటుంబాలు జగన్ ప్రభుత్వంపై తీవ్ర నిరాశతో ఉన్నాయి. రేపు పోలింగు బూతుల్లో కూర్చుని ఓట్లు వేయించేది ఉద్యోగులే. వారు, వారి కుటుంబాలే కాదు, పోలింగ్ బూతుల్లో వారు జగన్‌కు వ్యతిరేకంగా చక్రం తిప్పితే అధమం 13 శాతం ఓటు బ్యాంకును జగన్ కోల్పోవాల్సి ఉంటుంది.
“గత ఎన్నికల్లో ఎగబడి జగన్‌కు ఓట్లేసినందుకు మా చెప్పుతో మేమే కొట్టుకునేలా చేశారు. జగన్ కంటే చంద్రబాబు ఉద్యోగుల సంక్షేమం విషయంలో వంద రెట్లు కాదు, వేయి రెట్లు మేలు” అంటూ వైఎస్ ఆర్ ఉపాధ్యాయ సంఘానికి చెందిన రెడ్డి సామాజికవర్గం నేత ఒకరు బహిరంగంగానే చెప్పారు. దీనికి ముందుగానే అడ్డుకట్ట వేయకపోతే..కీలకమైన ఉద్యోగ వర్గాలు జగన్‌కు దూరమయ్యే ప్రమాదం లేకపోలేదు.
అటకెక్కిన అభివృద్ధి- నిరాశలో తటస్థులు
ఏపీలో అమ్మ ఒడి, వైఎస్ ఆర్ చేయూత, దీవెన వంటి సంక్షేమ పథకాలు తప్ప అభివృద్ధి లేదన్న అసంతృప్తి తటస్థుల్లో బాగా ఉంది. జగన్ ప్రభుత్వం వచ్చాక కొత్త రోడ్లు వేయకపోగా, రోడ్లకు పడ్డ గుంతలు కూడా పూడ్చలేకపోయిందనే ఆక్రోశం చదువుకున్న, మేధావి వర్గంలో బాగా నాటుకపోతోంది. రాష్ట్రంలో జగన్ ఒక్క పరిశ్రమను తెచ్చింది లేదు. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు సృష్టించింది లేదు. వలంటీర్ల వ్యవస్థతో తన ప్రైవేటు సైన్యం ఏర్పాటు చేసుకోవడం తప్ప నిరుద్యోగులకు ఏం చేశారు అంటూ యువత ప్రశ్నిస్తోంది. చంద్‌బాబు కనీసం నిరుద్యోగ భృతి ఇచ్చేవారు..జగన్ వచ్చాక అది కూడా రద్దు చేశారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో జగన్‌కు ఓటేసి తప్పు చేశామంటున్నారు.
ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల యాజమాన్యం గరం గరం
జగన్ ప్రభుత్వం వచ్చాక ఏపీలో ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల పరిస్థితి క్షీణించింది. స్కూళ్లకు, కాలేజీలకు గ్రేడింగుల పేరుతో తమకు ఇష్టమొచ్చిన వారికి ఏ సౌకర్యాలు లేకున్నా ఏ గ్రేడు ఇవ్వడం, నచ్చని వారికి అన్ని సౌకర్యాలు ఉన్నా గ్రేడు తగ్గించడం వల్ల, ఫీజు రీ ఎంబర్స్ మెంట్ పథకం డబ్బులు వారికి సరిగా అందడం లేదు.
ఇక అమ్మ ఒడి డబ్బులైనా స్కూళ్లు, కాలేజీల అకౌంట్లకు వేస్తారనుకుంటే తల్లిదండ్రుల ఖాతాల్లోకి వేస్తుండంతో వారు ఫీజులు కట్టక బకాయిలు పేరుకుపోతున్నాయి. దీనికి తోడు ప్రతి ప్రైవేటుస్కూళ్లో 25 శాతం సీట్లు పేదలకు ఉచితంగా ఇవ్వాలన్న నిబంధన కఠినంగా అమలు చేస్తుండంతో చాలా స్కూళ్లలో జీతాలకు కూడా ఆదాయం సరిపోని పరిస్థితి ఉంది. ఇది ఆయా యాజమాన్యాలకు జగన్‌పై తీవ్ర వ్యతిరేకత ఏర్పడేందుకు దారితీస్తోంది.
మద్యం ప్రియుల నోట బూతులే బూతులు
ఇక మద్యం ప్రియులైతే జగన్ సర్కారుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పనికిమాలిన బ్రాండ్లను ఎక్కువ రేట్లకు అమ్మడంపై బేజారుపడుతున్నారు. కనీసం ఎంసీ బ్రాందీ, బ్లెండర్ స్ప్రైడ్, మాన్సన్ హౌస్ వంటి బ్రాండ్లకు కూడా దిక్కులేకపోవడంతో మధ్యతరగతి మద్యం ప్రియులు సైతం జగన్‌ను రోజూ తిట్టుకుంటున్నారు. బూమ్ బూమ్ బీర్ల పేరు వింటేనే ఒంటి కాలిపై లేస్తున్నారు.
కనీసం కింగ్‌ఫిషర్, బడ్ వైజర్స్ బీర్లు కూడా అందుబాటులో లేకపోవడంతో తాగుబోతులంతా జగన్ సర్కార్‌పై కసి పెంచుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో చీప్ లిక్కర్ రూ.120 దొరికేది. అది కూడా మంచి నిషా ఇచ్చేది. ఇప్పుడు అదే చీప్ లిక్కర్ ధర రూ.240 అయింది. కానీ మత్తు ఇవ్వదంటున్నారు. ఇలా జేబులు గుల్ల చేసుకున్న లక్ష్యం నెరవేరలేదన్నది మద్యం ప్రియుల ఆవేదన. మద్యం ప్రియులు కనీసం 5 శాతం ఓటు బ్యాంకుకు జగన్ సర్కారు దూరమవుతున్నది.
అడ్రస్ లేని రియల్ ఎస్టేట్
జగన్ ప్రభుత్వం వచ్చాక ఏపీలో రియల్ ఎస్టేట్ రంగం మునుపెన్నడూ లేనంత సంక్షోభాన్ని ఎదుర్కొం టోంది. దీంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఈగలు తోలుకునే పరిస్థితి. రకరకాల నిబంధనలు, జీవోల పేరుతో చిన్న, మధ్య తరగతి రియల్టర్లు భారీ నష్టాలతో కుదేలైపోయారు. భూములు, ప్లాట్ల అమ్మకాలు, కొనుగోల్లు లేక రియల్ ఎస్టేట్ దళారులు సైతం ఉపాధి లేక నగరాలకు వలసపోయారు. కొన్నిచోట్ల అన్ని అనుమతులతో వెంచర్లు వేసినా, అధికార పార్టీ నేతలు అడ్డుపడి వాటాలు అడుగుతున్నారు. దీంతో వారు కూడా లోలోపల గుట్టుగా ప్లాట్లు అమ్ముకోవాల్సిన దుస్థితి.