MULUGU | ములుగు BRSలో ముసలం? అసంతృప్తిలో అజ్మీరా ప్రహ్లాద్
MULUGU | టికెట్ రాక భంగపాటు పార్టీ నిర్ణయం పై తిరుగుబాటు? అనుచరులతో సమావేశాలు విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ములుగు బీఆర్ఎస్ లో ముసలం తప్పదా? ఆ పార్టీ అధిష్టానం వచ్చే ఎన్నికల్లో పోటీకి అభ్యర్థిగా జడ్పీ చైర్ పర్సన్, ఆదివాసీ బిడ్డ బడే నాగజ్యోతిని ఎంపిక చేసింది. ఈ నిర్ణయం టికెట్ ఆశించిన వారిని తీవ్రంగా భంగపరిచింది. గత ఎన్నికల్లో మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్ కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ […]

MULUGU |
- టికెట్ రాక భంగపాటు
- పార్టీ నిర్ణయం పై తిరుగుబాటు?
- అనుచరులతో సమావేశాలు
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ములుగు బీఆర్ఎస్ లో ముసలం తప్పదా? ఆ పార్టీ అధిష్టానం వచ్చే ఎన్నికల్లో పోటీకి అభ్యర్థిగా జడ్పీ చైర్ పర్సన్, ఆదివాసీ బిడ్డ బడే నాగజ్యోతిని ఎంపిక చేసింది. ఈ నిర్ణయం టికెట్ ఆశించిన వారిని తీవ్రంగా భంగపరిచింది. గత ఎన్నికల్లో మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్ కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క చేతిలో ఓటమిపాలయ్యారు.
ఆ తర్వాత టికెట్ ఆశిస్తున్న వారిలో ఆయన కుమారుడు, మాజీ మార్కెట్ చైర్మన్ అజ్మీరా డాక్టర్ ప్రహ్లాద్ తీవ్ర భంగపాటుకు గురయ్యారు. ఆయనతో పాతు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోరిక పరశురామ్ నాయక్ సైతం ఉన్నారు. సీనియర్ నాయకులుగా ఉన్న వీరిద్దరిని పక్కకుపెట్టి నాలుగేళ్ళ క్రితం రాజకీయాల్లోకి వచ్చిన నాగజ్యోతికి అవకాశం లభించడంతో జీర్ణించుకోలేక పోతున్నారు.
నాగజ్యోతికి గోల్డెన్ ఛాన్స్
నాగజ్యోతికి స్వల్పకాలంలో పార్టీలో మంచి గుర్తింపు దక్కింది. ములుగు ఎమ్మెల్యేగా పోటీచేసే అవకాశం కలిగింది. టికెట్ పొందిన నాగజ్యోతికి పెద్దగా రాజకీయ అనభవంగానీ, ఆ వయస్సు కూడా లేదు. చిన్న వయసులోనే ఆమెకు పోటీ చేసే అవకాశం ఆ పార్టీ కల్పించింది. తల్లిదండ్రులిద్దరిదీ మావోయిస్టు బ్యాక్ గ్రౌండ్. 2019 స్థానిక సంస్థల ఎన్నికల్లో తన స్వగ్రామం తాడ్వాయి మండలం కాల్పపల్లి గ్రామపంచాయితీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలుపొందారు.
ఒక విధంగా తన రాజకీయ ప్రవేశం ఈ విధంగా సాగింది. అదే ఏడాది మే నెలలో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా తాడ్వాయి జడ్పీటీసీగా పోటీచేసి తాను బీఆర్ఎస్ లో చేరారు. తర్వాత జడ్పీ వైఎస్ చైర్ పర్సన్ గా ఎన్నికయ్యారు. ఇటీవల ములుగు జిల్లా జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ మృతితో నాగజ్యోతి జడ్పీ చైర్ పర్సన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఒక విధంగా నాగజ్యోతి బీఆర్ఎస్ లో చేరే విధంగా జగదీశ్ బాగా ప్రోత్సహించారు.
అసంతృప్తిలో ఆశావహులు
పోరిక పరశురాం నాయక్ ఒకింత మౌనం వహించగా, ప్రహ్లాద్ మాత్రం భవిష్యత్ కార్యక్రమాన్ని రూపొందించుకునేందుకు తన అనుచరులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాల్లో అనుచరుల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. సెగ్మెంట్ పరిధిలోని మంగపేట మండల కార్యకర్తల సమావేశం గురువారం నిర్వహించారు.
ఇదే విధంగా అన్ని మండలాల సమావేశాలు నిర్వహించిన తర్వాత తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు. టికెట్ రాక పోవడం పట్ల అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవసరమైతే రెబల్ గా బరిలోకి దిగినా అండగా నిలుస్తామంటూ అనుచరులు ప్రహ్లాద్ కు భరోసా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన నిర్ణయం ఎలా? ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.
భవిష్యత్తు కార్యాచరణలో ప్రహ్లాద్
భవిష్యత్ కార్యాచరణలోభాగంగా మంగపేట మండలం సీనియర్ నాయకులతో గురువారం మాజీ మంత్రి దివంగత అజ్మీర చందూలాల్ తనయుడు డాక్టర్ అజ్మీర ప్రహ్లద్ చర్చించారు. ఈ సమావేశంలో ఆయన
మాట్లాడుతూ ‘ములుగు నియోజకవర్గంలో చందులాల్ గత 40 సంవత్సరాలుగా ప్రజలకు అండగా ఉన్నారు. కేసీఆర్ పిలుపుమేరకు తెలంగాణ ఉద్యమంలో కి వచ్చి సెటిలర్స్ తో సంబంధాలను కొనసాగించి తెలంగాణ సాధించడంలో నేను మా నాన్న పాత్ర ఉంది.
చందూలాల్ ఎమ్మెల్యే గా గెలిచి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారని భావోద్వేగంతో చెప్పారు. చందూలాల్ , నేను అహర్నిశలు మమేకమై ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ ముందు వరుసలో ఉన్నానన్నారు. అసెంబ్లీ టికెట్ నాకు ఇస్తారని ఆశించాను. చివరకు టిక్కెట్ ఇవ్వకపోవడం చాలా బాధాకరమన్నారు. అనేక ఆటుపోట్లను ఎదుర్కొని పార్టీని మేము నిలబెట్టామన్నారు.
చివరి వరకు టికెట్ ఇస్తారని ఆశించాం కానీ ఇవ్వలేదన్నారు. మీ అందరి అభిప్రాయం మేరకు నడుచుకుంటా’ అని ప్రహ్లద్ అన్నారు. దీనిపై కార్యకర్తలందరూ ముక్తకంఠంతో తప్పకుండా మీకు టిక్కెట్ వచ్చి ఉంటే అత్యంత మెజార్టీగా గెలిచే వారన్నారు. బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా నిలబడ్డా గాని మీరు తప్పకుండా గెలుస్తారని చెప్పారు. నియోజకవర్గంలో అన్ని మండలాల్లో కూడా ఆత్మీయ భేటీలు నిర్వహించి నిర్ణయం తీసుకుంటానని ప్రకటించడం గమనార్హం.
ప్రహ్లాద్ పట్ల అధిష్టానం అసంతృప్తి
చందూలాల్ మంత్రిగా ఉన్న సమయంలో ప్రహ్లాద్ వ్యవహరించిన తీరు. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో చందూలాల్ ఓటమికి ప్రహ్లాద్ తీరే కారణమనే అభిప్రాయాలున్నాయి. అప్పట్లో పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. చందూలాల్ మృతి తర్వాత పార్టీ ఇంచార్జ్ గా ఆయన వ్యవహరించారు. ఈ సమయంలో పార్టీలో తీవ్ర అసంతృప్తి పెరిగింది. ఆయనను తప్పించి బీసీ సామాజిక వర్గానికి చెందిన జగదీశ్ ను తెరపైకి తెచ్చారు. ప్రహ్లాద్ ను పార్టీ దూరం పెట్టింది.
అయినప్పటికీ ఆయన తనదైన పద్ధతిలో నియోజకవర్గంలో తన అనుచరులతో ముందుకు సాగుతున్నారు. తన తండ్రి రాజకీయ వారసునిగా తనకు అవకాశం కల్పిస్తారని ఆశించినప్పటికీ నిరాశ తప్పలేదు. ఈ పరిస్థితిలో ఆయన బీఆర్ఎస్ లోనే కొనసాగుతారా? తన రాజకీయ భవిష్యత్తు కోసం ఏ విధంగా ముందుకు సాగుతారనే ఆసక్తి ములుగు నియోజకవర్గంలో నెలకొంది. పార్టీ అధిష్టానం ఏమైనా బుజ్జగిస్తుందా? చూడాలి.