మైత్రీ మూవీ మేకర్స్‌పై ఐటీ దాడులు.. ఏం లభించాయంటే?
విధాత: టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటైన మైత్రి మూవీ మేకర్స్ ఆఫీసుల్లో ఐటీ సోదాలు భారీ స్థాయిలో జరిగాయి. సోమవారం ఉదయం మైత్రీ సంస్థకు సంబంధించిన కార్యాలయాల్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మైత్రీ నిర్మాతలు నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ ఇంట్లో కూడా తనిఖీ నిర్వహించినట్లుగా తెలుస్తోంది. ‘శ్రీమంతుడు’ చిత్రంతో తెలుగు చలన చిత్ర నిర్మాణ రంగంలో అడుగుపెట్టిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఇప్పుడు భారీ చిత్రాలను చేస్తోంది. రాబోయే సంక్రాంతికి ఇద్దరు […]

విధాత: టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటైన మైత్రి మూవీ మేకర్స్ ఆఫీసుల్లో ఐటీ సోదాలు భారీ స్థాయిలో జరిగాయి. సోమవారం ఉదయం మైత్రీ సంస్థకు సంబంధించిన కార్యాలయాల్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మైత్రీ నిర్మాతలు నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ ఇంట్లో కూడా తనిఖీ నిర్వహించినట్లుగా తెలుస్తోంది.
‘శ్రీమంతుడు’ చిత్రంతో తెలుగు చలన చిత్ర నిర్మాణ రంగంలో అడుగుపెట్టిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఇప్పుడు భారీ చిత్రాలను చేస్తోంది. రాబోయే సంక్రాంతికి ఇద్దరు అగ్ర హీరోల సినిమాలు విడుదల అవుతుంటే.. ఈ రెండూ ఈ సంస్థే నిర్మించడం విశేషం.
అంతే కాదు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ‘పుష్ప’, పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ వంటి చిత్రాలను కూడా ఈ సంస్థే నిర్మిస్తోంది. సోమవారం ఈ సంస్థకు సంబంధించిన దాదాపు 15 చోట్ల ఐటీ అధికారులు తనిఖీ చేసినట్లుగా తెలుస్తోంది. జీఎస్టీ విషయంలో కొన్ని అవకతవకలు కనిపించినట్లుగా తాజా సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇక ఈ బ్యానర్‌లో ఇప్పటి వరకు వచ్చిన చిత్రాలు కూడా భారీవే కావడం గమనార్హం. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం, సర్కారు వారి పాట, ఉప్పెన వంటి చిత్రాలు ఈ సంస్థలోనే విడుదలయ్యాయి. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘వాల్తేరు వీరయ్య’, నందమూరి నటసింహం హీరోగా ‘వీరసింహారెడ్డి’ వంటి చిత్రాలు ఈ బ్యానర్‌లో సిద్ధమై.. విడుదలకు రెడీగా ఉన్నాయి.
ప్రస్తుతం ఈ సంస్థ చేస్తున్న, చేయబోతున్న సినిమాల బడ్జెట్ మొత్తం దాదాపు రూ. 700 కోట్లకు పైనే ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ఆ అమౌంట్‌కి సరిపడా జీఎస్టీని వారు చెల్లించలేదనేలా వార్తలు బయటికి వచ్చాయి.
అయితే టాప్ హీరోల సినిమాల విడుదల విషయంలో.. ఇలా ఐటీ అధికారులు దాడి చేయడం.. ఆ తర్వాత కామ్‌గా ఉండటం అనేది చాలా కాలంగా జరుగుతూనే ఉంది. త్వరలోనే మరికొన్ని టాప్ నిర్మాణ సంస్థలపై కూడా ఐటీ అధికారులు దృష్టి పెట్టనున్నారని తెలుస్తోంది.