ప్ర‌తి మూడు రోజుల‌కొక మ‌హిళ మృతి.. ఇట‌లీలో పెల్లుబుకిన నిర‌స‌న‌లు

ఇట‌లీలోని యువ‌తుపై దాడులు పెరుగుతుండ‌టంతో నిర‌స‌న‌లు పెల్లుబుకాయి. స‌గ‌టున ప్ర‌తి మూడు రోజుల‌కొక మ‌హిళ.. దాడుల్లో ప్రాణాలు కోల్పోతున్న‌ట్లు పోలీసు నివేదిక‌లు చెబుతున్నాయి

ప్ర‌తి మూడు రోజుల‌కొక మ‌హిళ మృతి.. ఇట‌లీలో పెల్లుబుకిన నిర‌స‌న‌లు

విధాత‌: ఇట‌లీ (Italy) లోని యువ‌తుపై దాడులు పెరుగుతుండ‌టంతో నిర‌స‌న‌లు పెల్లుబుకాయి. స‌గ‌టున ప్ర‌తి మూడు రోజుల‌కొక మ‌హిళ.. దాడుల్లో ప్రాణాలు కోల్పోతున్న‌ట్లు పోలీసు నివేదిక‌లు చెబుతున్నాయి. తాజాగా ప‌ర్యాట‌కంగా ప్ర‌సిద్ధి చెందిన వెనిస్ న‌గ‌రంలో గిలియా అనే యువ‌తిని మాజీ ప్రేమికుడు ట్యురెటా హ‌త్య చేయ‌డంతో ఈ నిరస‌న‌లు మరింత ఉద్ధృతం అయ్యాయి. ఈ ఘ‌ట‌న‌లో యువ‌తిని ప‌లుమార్లు పొడిచి దారుణంగా చంప‌డంతో యువ‌త‌లో ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెంచుకుంది.


వారం క్రితం నుంచి ఆచూకీ లేకుండా పోయిన ఆమెను వెతుకుతుండ‌గా.. ప్లాస్టిక్ క‌వ‌ర్‌లో చుట్టిఉన్న మృత‌దేహాన్ని పోలీసులు తాజాగా స్వాధీనం చేసుకున్నారు. ఆమె ప్రియుడు జ‌ర్మ‌నీ పారిపోయిన‌ట్లు గుర్తించిన అధికారులు.. అక్క‌డి పోలీసుల సాయంతో ప‌ట్టుకున్నారు. అత‌డిని ఇట‌లీకి తీసుకువ‌చ్చి.. జైలుకు త‌ర‌లించారు. ఈ త‌ర‌హాలో యువ‌తుల‌పై దాడులు పెరుగుతుండ‌టంతో ఇట‌లీలో ఎక్క‌డిక‌క్క‌డ యువ‌త రోడ్ల‌పైకి వ‌స్తున్నారు. శ‌నివారం ఇంటర్నేష‌న‌ల్ డే ఫ‌ర్ ద ఎలిమినేష‌న్ ఆఫ్ వ‌యొలెన్స్ ఎగైనెస్ట్ ఉమెన్ కూడా కావ‌డంతో పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు చెల‌రేగాయి.


‘ఈ ఏడాది ఇప్ప‌టి వ‌ర‌కు 106 మంది మ‌హిళల హ‌త్య‌లు జ‌రిగాయి. వీటిల్లో గిలియా హ‌త్య మ‌రింత దారుణం’ అని నిర‌స‌న‌లో పాల్గొన్న గాంబేరీ అనే యువ‌తి ఆవేద‌న వ్య‌క్తం చేసింది. త‌న సోద‌రిని ట్యురెటా ఎప్పుడూ అవ‌మానిస్తూ ఉండేవాడ‌ని.. గిలియా సోద‌రి ఎలెనా పేర్కొంది. ఆ ప‌రిస్థితుల‌న్నింటినీ త‌ను గ‌ట్టిగా పోరాడి..బ‌య‌ట‌ప‌డింద‌ని కానీ ఇలా జ‌రిగిపోయింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. ప్రతి యువ‌తికి త‌న సోద‌రి క‌థ ఒక పాఠ‌మ‌ని అభిప్రాయ‌ప‌డింది.