కోమటిరెడ్డి అనుచరులు జైలుకే: కంచర్ల

పిల్లిగుట్ట భూముల్లో కోమటిరెడ్డి అనుచరుల అక్రమాలపై కచ్చితంగా చర్యలు ఉంటాయని, వారు జైలుకెళ్లక తప్పదని కంచర్ల భూపాల్ రెడ్డి హెచ్చరించారు

  • By: Somu    latest    Nov 23, 2023 12:46 PM IST
కోమటిరెడ్డి అనుచరులు జైలుకే: కంచర్ల
  • నాయకులను కొన్నా.. కాంగ్రెస్ కు ఓటమి తప్పదు
  • నల్గొండ బీఆరెస్ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి


విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: పిల్లిగుట్ట భూముల్లో కోమటిరెడ్డి అనుచరుల అక్రమాలపై కచ్చితంగా చర్యలు ఉంటాయని, వారు జైలుకెళ్లక తప్పదని కంచర్ల భూపాల్ రెడ్డి హెచ్చరించారు. అసైన్డ్ భూములకు అక్రమంగా దొంగ పట్టాలు సృష్టించి, భూములను కాజేసిన దొంగలను ప్రజల ముందు ఉంచుతామని అన్నారు. నీతి, నిజాయితీతో ముందుకు పోతున్న.. నా ప్రగతి నివేదికను మీ ముందు ఉంచుతానని స్పష్టం చేశారు. వీటీ కాలనీలోని క్యాంప్ కార్యాలయంలో ఆస్ట్రేలియా ఎన్నారై భూపాల్ రెడ్డికి మద్దతు ప్రకటిస్తూ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కంచర్ల స్పందించారు.


ఎక్కడో ఇతర దేశాల్లో ఉన్న ఎన్నారైలకు తెలంగాణ అభివృద్ధి కనిపిస్తోందని, అందుకే బీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించారన్నారు. 27 రాష్ట్రాలకు తెలంగాణ అన్నపూర్ణగా మారిందంటే.. రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందిందో అర్థం చేసుకోవాలన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో ఐటీ మంత్రిగా ఉండి కూడా హబ్ తేకుండా ప్రజలను మభ్యపెడితే.. తాను ఒక్కసారి గెలిచి నల్గొండ ఇట్ హబ్ ను తెచ్చి భవిత భవిష్యత్తుకు పునాది వేశామన్నారు. తన విజయానికి నిన్నటి కాంగ్రెస్ సభే నిదర్శనమనీ, ఆసభకు కావాల్సిన అన్ని వసతులు మావే అయినా.. సభను సక్సెస్ చేసుకోలేకపోయారని ఎద్దేవా చేశారు.


డబ్బు సంచులతో నాయకులను కొన్నా కూడా, ప్రజలపై నాపై ఉన్న నమ్మకాన్ని కొనలేదనడానికి నిన్నటి సభే నిదర్శనం కాదా అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షులు కాసర్ల నాగేందర్, కన్వీనర్ సాయిరాం, యూత్ వింగ్ అధ్యక్షుడు వినయ్ సన్నీ గౌడ్ మాట్లాడుతూ నల్గొండ అభివృద్ధి చూస్తుంటే మెల్బోర్న్ ను తలపిస్తోందని కొనియాడారు. భూపాల్ రెడ్డిలా నిబద్ధతతో పని చేసే నాయకులు లేరూ.. రారూ అని, నల్గొండను చీకటిమయం చేసుకోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు భరత సింహారెడ్డి, శ్రీవేకర్, సునీల్, క్రాంతి, వినోద్, అఖిల్, వీరేందర్ పాల్గొన్నారు.