Karimnagar | కరీంనగర్ చరిత్ర అజరామరం: నలిమెల భాస్కర్
Karimnagar | కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నలిమెల భాస్కర్ రేపాల 'సజీవ కిరణాలు' పుస్తకావిష్కరణ విధాత బ్యూరో, కరీంనగర్: నిజాం సైన్యం ఆగడాలకు తిరుగుబాటు బావుటా ఎగురవేసిన కరీంనగర్ ఉమ్మడి జిల్లా చరిత్ర అజరామరమైనదని బహుబాషా కోవిధులు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నలిమెల భాస్కర్ అన్నారు. శనివారం కరీంనగర్ ఫిలింభవన్ లో ఏర్పాటు చేసిన ‘సజీవ కిరణాలు’ పుస్తకావిష్కరణ చేసిన అనంతరం నలిమెల భాస్కర్ మాట్లాడారు. సిరిసిల్ల గెరిల్లా పోరాటంతో పాటు […]

Karimnagar |
- కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నలిమెల భాస్కర్
- రేపాల ‘సజీవ కిరణాలు’ పుస్తకావిష్కరణ
విధాత బ్యూరో, కరీంనగర్: నిజాం సైన్యం ఆగడాలకు తిరుగుబాటు బావుటా ఎగురవేసిన కరీంనగర్ ఉమ్మడి జిల్లా చరిత్ర అజరామరమైనదని బహుబాషా కోవిధులు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నలిమెల భాస్కర్ అన్నారు. శనివారం కరీంనగర్ ఫిలింభవన్ లో ఏర్పాటు చేసిన ‘సజీవ కిరణాలు’ పుస్తకావిష్కరణ చేసిన అనంతరం నలిమెల భాస్కర్ మాట్లాడారు. సిరిసిల్ల గెరిల్లా పోరాటంతో పాటు ఆంధ్ర మహాసభలు నిర్వహించిన ఘనమైన చరితను అందిపుచ్చుకున్న కరీంనగర్ జిల్లా ఘనకీర్తి గతంలో వెలుగులోకి వచ్చింది తక్కువేనన్నారు.
బద్దం ఎల్లారెడ్డి లాంటి యోధుల పోరాట పటిమ, చాందాలో మిలటరీ క్యాంపు ఏర్పాటుకు మూలకారణమైన గులుకోట శ్రీరాములు, మహ్మదాపూర్ గుట్టల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించిన అనభేరి ప్రభాకర్ రావు, సింగిరెడ్డి భూపతి రెడ్డి, అమృత్ లాల్ శుక్లా, చెన్నమనేని రాజేశ్వర్ రావు లాంటి యోధానయోధులు చేపట్టిన పోరాటం నేటి తరానికి స్పూర్తి దాయకంగా నిలుస్తోందన్నారు.
శాంతియుత పోరాటం వైపు అడుగులు వేసిన రఘునాథ్ రావు కాచె, వెంకట రాజన్న అవధాని వంటి వారి పోరాటం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పివి నరసింహారావు ఆనాడే నైజాం ప్రభుత్వం చేస్తున్న దాష్టికాలను కళ్లకు కట్టినట్టుగా కథనాలు రాసి ఇక్కడ జరుగుతున్న వాస్తవ పరిస్థితులను యావత్ ప్రపంచానికి తెలియజేశారన్నారు.
నిజాం ప్రభుత్వంలోని పోలీస్ స్టేషన్లు, ఔట్ పోస్టులపై దాడులు చేయడమే కాకుండా అప్పటి పోలీసు అధికారులను కూడా మట్టుబెట్టి ఎదురొడ్ది పోరాట పటిమ కనబర్చారన్నారు. గట్టెపల్లి మురళీ ధర్ రావును హత్య చేసేందుకు నిజాం సైన్యం పథకం పన్నారంటే ఆ ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేయడమే కారణమన్నారు. మానాల అడవుల నుండి మహదేవపూర్ సరిహద్దు ప్రాంతం వరకు కూడా ఆనాటి యోధులు అందించిన త్యాగాల వల్లే నిజాం ఏరియా అంతా కూడా భారత్ లో విలీనం కావల్సి వచ్చిందన్నారు.
అయితే ఎంతో ఘనమైన పోరాట చరిత్ర మాత్రం అనుకున్నంతగా వెలుగులోకి రాలేదని నలిమెల భాస్కర్ అన్నారు. హైదరాబాద్ స్టేట్ విముక్తి కోసం జరిగిన పోరాటంలో నల్లగొండ, వరంగల్ పోరాటాల గురించి వెలుగులోకి వచ్చింది కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా పోరాటం గురించి మాత్రం రాలేదన్నారు. అయితే ఆ లోటు లేకుండా చేసిన ఘనత ‘సజీవ కిరణాలు’ పుస్తక రచయిత రేపాల నర్సింహరాములుకే దక్కుతుందన్నారు.
కండక్టర్ ఉద్యోగాన్ని వదిలేసి ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంతటా తిరుగుతూ మూలాలతో కూడిన చరిత్రను పుస్తక రూపంలో తీసుకరావడం ఆదర్శప్రాయమని కొనియాడారు. ప్రముఖ రచయిత అన్నవరం దేవేందర్ పుస్తక పరిచయం చేస్తూ, గౌరవెల్లిలో ఆనాటి నిజాం సైన్యం చేసిన ఆగడాలను కళ్లకు కట్టినట్టుగా వివరించారన్నారు. కార్యక్రమంలో పుస్తక రచయిత రేపాల నర్సింహరాములు, స్వాతంత్ర్య సమర యోధుల వారసులు గులాభీల మల్లారెడ్డి, ఎస్ సంపత్ కుమార్, గుల్కోట శ్రీకాంత్, తూమోజు జగదీశ్వరా చారి, అనభేరి మనవరాలు వాసంతి, శివనాద్రి ప్రమోద్ కుమార్ పాల్గొన్నారు.