అత్యాశకో.. దురాశకో..కాంగ్రెస్‌ను గెలిపించారు
ప్రజలు కొన్ని సందర్భాల్లో అత్యాశకో, దురాశకో, మరోరకంగానో మోసపోతారని, గత ఎన్నికల్లో కూడా మోసపోయి కాంగ్రెస్‌ను గెలిపించారని బీఆరెస్ అధినేత కేసీఆర్ అన్నారు

– వారి మాయ మాటలకు మోసపోయారు
– సీఎం రేవంత్‌రెడ్డీ.. ఇంత అసహనమా?
– లోక్‌సభ ఎన్నికల్లో కర్రుకాల్చి వాత పెట్టాలె
– లేదంటే వాళ్లలో నిర్లక్ష్యం పెరిగిపోతుంది
– గులాబీ జెండా ఎంత బలంగా ఎగిరితే..
ప్రజల పక్షాన అంత బలంగా కొట్లాడుతుంది
– మొన్న గెలిచి ఉంటే.. దేశాన్ని చైతన్యం చేసేవాడిని
– కరీంనగర్ కదనభేరి సభలో కేసీఆర్
– కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ సీఎం నిప్పులు
కరీంనగర్: ప్రజలు కొన్ని సందర్భాల్లో అత్యాశకో, దురాశకో, మరోరకంగానో మోసపోతారని, గత ఎన్నికల్లో కూడా మోసపోయి కాంగ్రెస్‌ను గెలిపించారని బీఆరెస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈ రోజు వందరోజుల్లోనే ఏం జరిగిందో ప్రజలందరికీ తెలుసని చెప్పారు. ‘ముఖ్యమంత్రిని ఆరు గ్యారంటీలు ఏమైనయ్? కరెంటు మాయమైంది.. నీళ్లెందుకు మాయమైతున్నయ్ అంటే.. ఆయన ‘నేను పండవొట్టి తొక్కుత.. పేగులు మెడల వేసుకుంట.. పెండ మొకానికి రాసుకుంట.. చీరుత.. సంపుత.. మానవ బాంబునైత.. మట్టిబాంబునైత అని మాట్లాడుతున్నడు. ఇంత అసహనమా?’ అని బీఆరెస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లగొండ సభ అనంతరం చాలా రోజులకు మళ్లీ కరీంనగర్‌లో కదన భేరి పేరుతో నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు.
కరెంటు, నీళ్ల సమస్య ఎందుకు?
రాష్ట్రంలో మంచి నీళ్లకు, కరెంటుకు ఎందుకు సమస్యలు వస్తున్నయో తనకు అర్థం కావడం లేదని కేసీఆర్ అన్నారు. తాము ఎంతో శ్రమించి మిషన్ భగీరథ తెచ్చామని, దానితో రాష్ట్రమంతా నీటిని సరఫరా చేశామని చెప్పారు. ఇప్పుడున్న ప్రభుత్వానికి ఆ పథకాన్ని నడిపే తెలివిలేదా? అని ప్రశ్నించారు. తాను ముఖ్యమంత్రి అయిన ఏడాదిన్నరలోనే కరెంటు పరిస్థితిని చక్కదిద్దానని కేసీఆర్ అన్నారు. 24 గంటలు రైతులకు ఉచితంగా కరెంటు వచ్చిందని చెప్పారు. ‘కేసీఆర్ జర్ర ముఖం మల్పంగనే కట్క బంద్‌జేసినట్టు కరెంటు బందైతదా? మేం తొమ్మిదేళ్లు ఇచ్చింది ఇయ్యాల ఈ చవట దద్దమ్మలకు ఇయ్యొస్తలేదా?’ అని కేసీఆర్ నిప్పులు చెరిగారు.
కాంగ్రెస్‌కు ఓటేస్తే ప్రజలకే నష్టం
మరోసారి కాంగ్రెస్‌కే ఓటు వేస్తే.. తెలంగాణ ప్రజలు నష్టపోతారని కేసీఆర్ హెచ్చరించారు. ‘ఏమీ చేయకపోయినా జనం మళ్లీ మనకే ఓటేసిండ్రని ఆరు గ్యారంటీలకు ఎగనామం పెడ్తరు. ఈ టైమ్‌లో మీరు కర్రు కాల్చి వాతపెట్టకపోతే వాళ్లలో నిర్లక్ష్యం వస్తది. అహంకారం పెరుగుతది’ అని చెప్పారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో గులాబీ జెండా ఎంత బలంగా ఎగిరితే ప్రజల పక్షాన కాపలాదారులుగా అంత బ్రహ్మాండంగా ముందుకుపోతామని కేసీఆర్ భరోసా ఇచ్చారు. ‘ఇంతకు ముందు నలుగురు బీజేపీ ఎంపీలు ఏం చేశారు? ఏకాన పైస తెచ్చారా? ఏమన్నా రాష్ట్రానికి లాభం చేశారా? అని కేసీఆర్ ప్రశ్నించారు. అవలోకగా, తమాషాగా ఓట్లు వేయొద్దని ప్రజలను కోరారు.
ముఖ్యమంత్రి మాట్లాడే భాష ఇదేనా?
‘ముఖ్యమంత్రిని ఆరు గ్యారంటీలు, కరెంటు మాయమైంది.. నీళ్లెందుకు మాయమైతున్నయ్ అంటే.. ఆయన నేను పండవెట్టి తొక్కుత.. పేగులు మెడల వేసుకుంట.. పెండ మోకానికి రాసుకుంట.. చీరుత.. సంపుత.. మానవ బాంబునైత.. మట్టిబాంబునైత అని మాట్లాడుతున్నడు. ఇంత అసహనమా..? ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాషనా? పద్ధతా? తెలంగాణ రాష్ట్రానికి, సమాజానికి ఇదో గౌరవమా?’ అని కేసీఆర్ అన్నారు. ‘నేను మాట్లాడినా.. ఉద్యమంలో మాట్లాడాను. తెలంగాణను వ్యతిరేకించినోళ్లను దద్దమ్మలు, సన్నాసులు అన్నాను. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదేళ్లలో ఒక్కరోజు, సందర్భంలో దురుసుమాటలు విన్నరా? అని ప్రశ్నించారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క ఎకరం పొలం అయినా ఎండిందా? అని కేసీఆర్ ప్రశ్నించారు. మరి ఇవాళ ఏం బీమార్ వచ్చిందని అడిగారు. ఈ బీమార్ ఇట్లనే ఉండాలా? మళ్లీ తెలంగాణ ఆత్మహత్యలు రావాలా? అని ప్రజలను ప్రశ్నించారు.
టీవీలో కూర్చుంటా.. కాళేశ్వరం సంగతి ఏంటో చెబుతా
కాళేశ్వరం ప్రాజెక్టులోని వంద కాంపోనెంట్లలో మేడిగడ్డ బ్యారేజి ఒక్కటని కేసీఆర్ అన్నారు. అందులో కొంత ఇసుక జారి రెండు పిల్లర్లు కుంగితే.. ఏదో ప్రళయం బద్దలైనట్టు, దేశమే కొట్టుకుపోయినట్టు చేస్తున్నారని మండిపడ్డారు. రెండు మూడు రోజుల తర్వాత టీవీలో కూర్చుంటున్నానని.. కాళేశ్వరం సంగతి ఏంటి? ఎందుకు కట్టినమో వివరిస్తానని అన్నారు. ‘మన పండ్లలో ఒక పన్ను ఒదులైతది.. ఏ పన్ను ఊగుతదో ఆ పన్ను బాగు చేసుకుంటాం. అంతేకానీ 32 పండ్లు రాలగొట్టుకుంటమా?’ అని కేసీఆర్ ప్రశ్నించారు.
మొన్న గెలిచి ఉంటే.. దేశంలో చైతన్యం చేసేవాడిని
కేంద్రంలో సమర్థవంతమైన ప్రభుత్వం ఉంటే.. యావత్ దేశం కరెంటు కొరత లేకుండా ఉంటుందని కేసీఆర్ అన్నారు. ‘మొన్న నన్ను ఆగవట్టి బ్రేక్ కొట్టారు కానీ.. మొన్న గెలిచి ఉంటే.. ఆపాటికి దేశంలో చైతన్యం చేసేవాడిని’ అని చెప్పుకొన్నారు.