సమ్మక్క సారక్క యూనివర్సిటీ భవనాల శంకుస్థాపనకు ప్రధాని
ములుగులో ఏర్పాటు చేసిన సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ భవనాల నిర్మాణాల భూమి పూజకు ప్రధాని నరేంద్ర మోడీని తీసుకొస్తామని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి తెలిపారు

- యూనివర్సిటీ తాత్కాలిక క్యాంపస్ ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడి
- గిరిజనులకు 35శాతం సీట్ల కేటాయింపు
విధాత: ములుగులో ఏర్పాటు చేసిన సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ భవనాల నిర్మాణాల భూమి పూజకు ప్రధాని నరేంద్ర మోడీని తీసుకొస్తామని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ములుగులో సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ క్యాంపస్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా సమ్మక్క సారక్క తాత్కాలిక ట్రైబల్ యూనివర్సిటీ ప్రారంభించుకోవడం సంతోషకరమైన విషయమని పేర్కొన్నారు.
335 ఎకరాలకు గాను, 50 ఎకరాలు ఇంకా భూసేకరణ జరగాల్సి ఉందని, పూర్తిస్థాయిలో భూసేకరణ పూర్తికాగానే యూనివర్సిటీ భవనాల శాశ్వత నిర్మాణం చేపడతామన్నారు. భూసేకరణ పూర్తికాగానే దేశ ప్రధానిని, రాష్ట్ర ముఖ్యమంత్రిని పిలిచి సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీకి భూమి పూజ చేపిస్తామన్నారు. సమ్మక్క సారక్క సెంట్రల్ యూనివర్సిటీకి హైదరాబాదులోని సెంట్రల్ యూనివర్సిటీ మెంటర్‌గా పనిచేస్తుందన్నారు. సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీలో 35 శాతం సీట్లు గిరిజనులకు కేటాయించేలా చూస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
ఇటీవల బడ్జెట్లో రూ.900ల కోట్లు కేటాయించిన కేంద్రం వచ్చే విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించాలని నిర్ణయించిందని, అలాగే తాత్కాలికంగా తరగతుల నిర్వహణ కోసం ములుగు మండలం జాకారంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్‌ను కేటాయించిందని తెలిపారు. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం ఈ ప్రాంతంలో ఉండడం ఈ ప్రాంత వాసులు చేసుకున్న అదృష్టమన్నారు. ఆర్కియాలాజికల్ శాఖ ద్వారా 7 కోట్ల రూపాయలుతో పాటు, రాష్ట్ర ప్రభుత్వానికి టూరిజం శాఖ ద్వారా 60 కోట్ల రూపాయలు అప్పగించి అభివృద్ధి పనులు ప్రారంభించడం జరిగిందన్నారు.
అనంతరం రాష్ట్ర మంత్రి సీతక్క మాట్లాడుతూ రాష్ట్ర విభజన చట్టం మేరకు 900కోట్ల రూపాయలు గిరిజన యూనివర్సిటీ ప్రారంభించుకోవడం, అదికూడా దేశ ప్రధాని సమ్మక్క-సారలమ్మ తల్లులతో పేరుతో యూనివర్సిటీ ప్రారంభించడం సంతోషదాయకమని హర్షం వ్యక్తం చేశారు. రాజకీయాలకతీతంగా ములుగు జిల్లా అభివృద్ధికి కేంద్రం సహకరించాలని మంత్రి కోరారు. గిరిజన యూనివర్సిటీలో గిరిజనులకు 35శాతం సీట్లు కేటాయించడం సంతోషమన్నారు. మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, జిల్లా అధికారులు పాల్గొన్నారు. అయితే శిలాఫలంలో ఎంపీ కవిత పేరులేకపోవడం, ఉమ్మడి వరంగల్ జిల్లాకే చెందిన అటవీశాఖ మంత్రి కొండా సురేఖకు ఆహ్వానం లేకపోవడం కొంత వివాదస్పదమైంది.