Komati Reddy | పీఎం మోడీతో.. కోమటిరెడ్డి భేటీ
అభివృద్ధి పనుల కోసమే: కోమటిరెడ్డి పంట నష్టం అంచనాకు కేంద్ర బృందాలు విధాత: ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు భువనగిరి పార్లమెంటు పరిధిలోని అభివృద్ధి పనుల కోసం నిధుల మంజూరు కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(Narendra Modi) ని కలవడం జరిగిందని సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీమంత్రి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkata Reddy) స్పష్టం చేశారు. గురువారం ఆయన ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఒక ఎంపీగా ప్రధానమంత్రితో […]

- అభివృద్ధి పనుల కోసమే: కోమటిరెడ్డి
- పంట నష్టం అంచనాకు కేంద్ర బృందాలు
విధాత: ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు భువనగిరి పార్లమెంటు పరిధిలోని అభివృద్ధి పనుల కోసం నిధుల మంజూరు కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(Narendra Modi) ని కలవడం జరిగిందని సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీమంత్రి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkata Reddy) స్పష్టం చేశారు. గురువారం ఆయన ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఒక ఎంపీగా ప్రధానమంత్రితో తాను భేటీ అయ్యానని రాజకీయాలపై చర్చించలేదన్నారు.
తెలంగాణలో పేపర్ల లీకేజీ కేసు, లిక్కర్ స్కాం, పంట నష్టం అంశాలపై ప్రధానమంత్రితో చర్చించారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఆ విషయాలన్నీ ప్రధానమంత్రికి తెలుసని, అభివృద్ధిపై చర్చించిన విషయాలు మాత్రం తాను వెల్లడిస్తున్నానని, అన్ని విషయాలు చెప్పలేను అన్నారు. వడగళ్ల వానతో తెలంగాణలో పెద్ద ఎత్తున జరిగిన పంట నష్టం అంచనా వేసేందుకు కేంద్ర బృందాలను పంపాలని ప్రధాని మోడీని కోరినట్లు తెలిపారు. తన దృష్టికి తెలంగాణ పంట నష్టం సమస్య వచ్చిందని త్వరలోనే కేంద్ర బృందాలను పంపిస్తానని మోడీ హామీ ఇచ్చారన్నారు.
ఎంపీగా ఒక ఎడాది గడువు మాత్రమే ఉన్నందున పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు అన్నింటిని గ్రౌండింగ్ చేసేందుకు నిధుల మంజూరుకు ప్రధానమంత్రిని కలిసి విన్నవించగా అన్నింటికీ ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. హైదరాబాద్ – విజయవాడ రహదారి విస్తరణ పనులను వెంటనే చేపట్టాలని, ఘట్కేసర్ నుంచి ఆలేరు జనగామ వరకు ఎంఎంటీఎస్ రైలు పొడగింపు పనులను పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే చేపట్టాలని కోరడం జరిగిందని వెంకట్ రెడ్డి తెలిపారు.2015-16 సంవత్సరములో రాయగిరి వరకు 416కోట్లతో మంజూరైన ఎంఎంటీఎస్ రైలు పొడగింపు కు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా ఇవ్వడం లేదని ప్రధానికి వివరించానన్నారు. అందుకే పూర్తిగా కేంద్రమే ఎంఎంటీఎస్ విస్తరణ చేపట్టాలని కోరినట్లు తెలిపారు.
గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారిని కలిశాను. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలోని పలు అంశాలపై చర్చించాను. హైదరాబాద్ మెట్రో రైలును ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకు విస్తరించాలని కోరాను. దీనికోసం ఉన్నత స్థాయిలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వివరించాను. @narendramodi pic.twitter.com/yHou3ckJfz
— Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) March 23, 2023
ఆయుష్మాన్ భారత్, ఫసల్ బీమా వంటి కేంద్ర పథకాల నుండి రాష్ట్ర ప్రభుత్వం తప్పుకుందని అలాంటి పరిస్థితుల్లో ఎంఎంటీఎస్ రైలు పొడిగింపుకు తన వాటా చెల్లింపులో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం జరుగని పని అని, అందుకే కేంద్రమే దాన్ని పూర్తి చేయాలని కోరగా ప్రధాని సానుకూలంగా స్పందించారన్నారు. పద్మశ్రీ ఆసు మల్లేశం కనిపెట్టిన 20 ఆసు మిషిన్లకు అదనంగా మరో వెయ్యి మిషన్ల తయారీకి ఒక మిషన్ కి 25000 చొప్పునలు ఇవ్వాలని, తొలి దశలో 500 మిషన్ల తయారీకి నిధులు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు.
అలాగే చేనేత కార్మికులకు అందిస్తున్న జీవన్ సురక్ష బీమా యోజన పథకం వయస్సు పరిమితిని 50 నుంచి 70 ఏళ్లకు పొడిగించాలని కోరినట్లు తెలిపారు. తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఆరు జిల్లాలకు చెందిన 126 కిలోమీటర్ల రోడ్లకు 86 కోట్ల పీఎంజీఎస్‌వై నిధులు మంజూరు చేయాలని కోరగా స్పెషల్ కేసు కింద సాంక్షన్ చేస్తామని మోడీ హామీ ఇచ్చారు అన్నారు. తెలంగాణలో పేపర్ లీకేజీ సమస్యపై తాను కూడా ఆందోళన కార్యక్రమం చేపడుతానన్నారు. భట్టి విక్రమార్క పాదయాత్ర తమ జిల్లాకు వచ్చిన సందర్భంగా తాను పాల్గొంటానన్నారు.