చామ‌ల కిర‌ణ్ కుమార్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి: ఎమ్మెల్యే రాజ‌గోపాల్‌రెడ్డి

చామ‌ల కిర‌ణ్ కుమార్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి: ఎమ్మెల్యే రాజ‌గోపాల్‌రెడ్డి

విధాత‌: వ‌చ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ గాలిలో కొట్టుకుపోవడం ఖాయమని మునుగోడు ఎమ్మెల్యే, భువ‌న‌గిరి పార్ల‌మెంట్ ఇన్‌చార్జీ కోమటిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి అన్నారు. శుక్ర‌వారం జ‌రిగిన జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయ‌న మాట్లాడారు. ప‌ది సంవత్సరాలు ప్రాజెక్టుల పేరుతో ధరణి పేరుతో మాజీ సీఎం కేసీఆర్‌ లక్షల కోట్లు దోచుకుని తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని విమ‌ర్శించారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో పైరవీలు చేసుకునే పల్ల రాజేశ్వర్ రెడ్డి ప్రజల మధ్యలో ఉంటాడా అని ప్ర‌శ్నించారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎల్ల‌ప్పుడూ ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటాడ‌న్నారు. 2009లో నన్ను భువనగిరి పార్లమెంటు అభ్యర్థిగా గెలిపించి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో జనగామ ప్రజల గొంతు వినిపించే అవకాశం కల్పించారు, అదేవిధంగా నేడు చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయ‌న‌ కోరారు. నియంత కేసీఆర్ పాలనకు చరమ‌గీతం పాడినట్లే మోదీ పాలన‌ను కూడా పారదోలాలన్నారు. 30 రోజులు కష్టపడి ఇంటింటికి కాంగ్రెస్ గ్యారంటీలను వివరించి ప్రజలకు విస్తృత స్థాయిలో తెలియపరచాలని కార్య‌క‌ర్త‌ల‌కు సూచించారు. తెలంగాణ‌ను ఇచ్చిన కాంగ్రెస్ వైపే జ‌న‌గామ ప్ర‌జ‌లు ఉన్నారు, మాయ‌మాట‌లు చెప్పి క‌ల్ల‌బొల్లి ముచ్చ‌ట్ల‌తో ప‌బ్బం గ‌డుపుకునే బీజేపీ అభ్య‌ర్థి బూర న‌ర్స‌య్య గౌడ్ వైపు లేర‌న్నారు.