కాంగ్రెస్‌-బీజేపీలది ఫెవికాల్‌ బంధం

కాంగ్రెస్, బీజేపీల మధ్యఉన్న ఫెవికాల్ బంధం కొనసాగుతుందనడానికి, గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల నామినేషన్‌పై గవర్నర్‌ తీసుకున్న నిర్ణయమే నిదర్శనమని కేటీఆర్‌ అన్నారు

కాంగ్రెస్‌-బీజేపీలది ఫెవికాల్‌ బంధం
  • గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల నిర్ణయమే నిదర్శనం
  • బీఆరెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆఆర్‌
  • ప్రజాపాలనలో ఇంచార్జీల పాలన ఎందుకూ
  • సర్పంచ్‌లపై రాజకీయ కక్ష సాధింపు


విధాత : కాంగ్రెస్, బీజేపీల మధ్యఉన్న ఫెవికాల్ బంధం కొనసాగుతుందనడానికి, ఆ రెండు పార్టీల కుమ్మక్కు రాజకీయాలకు గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల నామినేషన్‌పై గవర్నర్‌ తీసుకున్న నిర్ణయమే నిదర్శనమని బీఆరెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. శుక్రవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గవర్నర్ వ్యవహరిస్తున్న పక్షపాత తీరును తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారన్నారు.


తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడిన దాసోజు శ్రవణ్, ఎరుకల సామాజిక వర్గానికి చెందిన కుర్ర సత్యనారాయణలను గత ప్రభుత్వం ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తే రాజకీయపరమైన సంబంధాలు ఉన్నాయని చెప్పి వారి అభ్యర్థిత్వాన్ని తిరస్కరించిందని, అలాంటప్పుడు కోదండరామ్‌ను ఎట్లా ఆమోదిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి లెటర్ రాగానే ఆగమేఘాల మీద ఎలా సంతకం చేసారో గవర్నర్ ప్రజలకు చెప్పాలన్నారు.


రాష్ట్ర ప్రజలు ఇచ్చే జీతంతో గవర్నర్ పనిచేస్తున్నారని, రాజ్ భవన్ నడుస్తున్నదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. గవర్నర్‌ బాధ్యులు రేవంత్ రెడ్డికి కాదని, రాష్ట్ర ప్రజలకి బాధ్యులు అనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఒకటే రోజు రాజీనామా చేసిన ఎమ్మెల్సీలకు ఒకటే బులిటిన్ ద్వారా రాజీనామా ఆమోదించారని, ఒకటే కోటా కింద ఉన్న ఎమ్మెల్సీలకి వేరువేరుగా ఎన్నికలు నిర్వహించారని, ఇది కూడా బీజేపీ-కాంగ్రెస్‌ కుమ్మక్కు రాజకీయాలను చాటుతుందన్నారు.


రేవంత్ రెడ్డి పోయి అమిత్ షాను కలవగానే ఓకే ఎన్నిక కాకుండా వేరువేరుగా ఎన్నికలు జరిగేటట్టు నిర్వహించారని, ఒకేసారి ఎన్నిక జరిగితే ఒకటి బీఆరెస్‌కు, మరొకటి కాంగ్రెస్‌కి వచ్చేదన్నారు. బీజేపీ రాష్ట్రంలో కాంగ్రెస్‌కు జాకీలు పెట్టి మద్దతుగా నిలుస్తున్నదన్నారు. కాంగ్రెస్‌-బీజేపీల కుమ్మక్కు ప్రజలందరికి అర్ధమవుతుందన్నారు. బండి సంజయ్ కూడా మొన్న కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుకోవద్దు బీఆరెస్‌ అంతం చూద్దామని చెప్పారని, నిన్న గుంపు మేస్త్రి(రేవంత్‌రెడ్డి) కూడా ఇదే మాట చెప్పారని, వారి మాటలు కూడా ఆ రెండు పార్టీల కుమ్మక్కు రాజకీయాలకు నిదర్శనమన్నారు.


ప్రజాపాలనలో ఇంచార్జీలు ఎందుకూ


ప్రజాపాలన అంటే ప్రజలతో ఎన్నికైన ప్రజాప్రతినిధులు పాలన చేయాలి కానీ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక ఇంచార్జీలు కాదని కాంగ్రెస్ ప్రభుత్వం తెలుసుకోవాలన్నారు. ప్రజల తరఫున ఎన్నికైన సర్పంచుల పదవీకాలం పొడగించాలి.. కాని ప్రత్యేక ఇంచార్జీలను పెట్టవద్దని డిమాండ్ చేస్తున్నామన్నారు. రెండు సంవత్సరాల పాటు కరోనా సమయంలో వారి పరిపాలన సమయం పోయిందని.. అందుకూ వారి పదవి కాలాన్ని ఆరు నెలలు లేదా సంవత్సరం మేర పొడిగించాలని కోరుతున్నామన్నారు.


లేని పక్షంలో తిరిగి సర్పంచ్ ఎన్నికలు నిర్వహించే వరకు వారి కాలాన్ని పొడిగించాలన్నారు. సర్పంచ్‌లు గ్రామాల్లో పూర్తి చేసిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు పెట్టుకుంటే మంత్రులు అందుబాటులో లేరు, కొత్తగా ఎన్నికైన మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందుబాటులో లేరు అంటూ ప్రభుత్వం అడ్డుకుంటుందన్నారు. పెద్దలు ఎప్పుడో సుమతి శతకంలో చెప్పిన మాట… కనకపు సింహాసనమున శునకమును కూర్చుని పెట్టినా దాని బుద్ధి మారనట్లుగా, మంచి పదవిలో కూర్చోబెట్టినంత మాత్రాన నీచ మానవులు తమ బుద్ధి మారరని కేటీఆర్‌ అన్నారు.


రేవంత్ రెడ్డి అహంకారం, వెకిలి వ్యవహారం చూస్తుంటే వాళ్లు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నామనుకుంటున్నారని, మేము ఇంకా అధికారంలో ఉన్నామనుకొని మమ్మల్ని ఆడిపోసుకుంటున్నారన్నారు. మీకు చేతనైతే ఇచ్చిన 420 అమలుపరచండని, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుపరచండన్నారు. రాజకీయాల్లో ఇలాంటి కుసంస్కారం ఉన్న వ్యక్తులు ఉన్నప్పుడు ఇలాంటి విమర్శలు తప్పడం లేదన్నారు. ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నాలు ఎన్ని చేసిన ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేదాకా వెంటాడుతామన్నారు.