Governor’s speech: గవర్నర్ ప్రసంగంపై కేటీఆర్, హరీష్ రావుల ఫైర్

కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ ప్రసంగంలో అన్ని అబద్ధాలు చెప్పించిందని కేటీఆర్, హరీష్ రావులు ఫైర్ అయ్యారు. గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ కార్యకర్తల ప్రెస్‌మీట్‌లా అసెంబ్లీలో గవర్నర్‌ గారి ప్రసంగం సాగిందని ఎద్దేవా చేశారు. గవర్నర్‌ ప్రసంగంలో కొత్త విషయాలు చెబుతారనుకుంటే అబద్ధాలతో సొంత డబ్బాలా ప్రభుత్వం గవర్నర్ ప్రసంగం రూపొందించిందని విమర్శించారు.

Governor’s speech: గవర్నర్ ప్రసంగంపై కేటీఆర్, హరీష్ రావుల ఫైర్

Governor’s speech: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలనుద్ధేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేసిన ప్రసంగంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు తీవ్ర విమర్శలు గుప్పించారు. గవర్నర్ ప్రసంగం ముగిశాక మీడియా పాయింట్ వద్ధ మాట్లాడిన కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ ప్రసంగంలో అన్ని అబద్ధాలు చెప్పించిందని ఫైర్ అయ్యారు. గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ కార్యకర్తల ప్రెస్‌మీట్‌లా అసెంబ్లీలో గవర్నర్‌ గారి ప్రసంగం సాగిందని ఎద్దేవా చేశారు. గవర్నర్‌ ప్రసంగంలో కొత్త విషయాలు చెబుతారనుకున్నామని.. రైతులకు భరోసా ఇస్తారని భావించామన్నారు.

20 నుంచి 30 శాతానికి మించి రైతులకు రుణమాఫీ జరగలేదని.. రుణమాఫీ పూర్తి చేసినట్లు గవర్నర్‌తో పచ్చి అబద్ధాలు చెప్పించారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి నో విజన్.. ఓన్లీ కమిషన్ అని విమర్శించారు. ఏఐ, డేటా సైన్సెస్‌ అని పెద్దమాటలు చెబుతున్నరని.. నో విజన్‌.. ఓన్లీ 20శాతం కమిషన్‌ అనే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నడుపుతూ.. ఢిల్లీకి మూటలు పంపే విజన్ కొనసాగిస్తున్నారన్నారు. చిన్న కాంట్రాక్టర్లను, సర్పంచులను వేధించి.. చివరకు ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌లు ఇవ్వకుండా, గురుకులాల్లో తిండిపెట్టకుండా పిల్లలను చంపుతున్న అరాచక ప్రభుత్వం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ ప్రభుత్వం’ అంటూ కేటీఆర్‌ ధ్వజమెత్తారు.

కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల గురుకులాల్లో చనిపోయిన విద్యార్థులకు కనీసం సంతాపం కూడా తెలపని అసమర్థ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వమని కేటీఆర్ మండిపడ్డారు. కేసీఆర్ పై గుడ్డి ద్వేషంతో మేడిగడ్డకు మరమ్మతులు చేయకుండా 15 నెలలు ఎండబెట్టడం వల్ల మొత్తం గోదావరి పరివాహక ప్రాంతంలో పొలాలు ఎండి పోయాయని..సిగ్గులేని ఈ ప్రభుత్వం రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి చేశామని..రూ.500బోనస్ ఇచ్చామని చెప్పుకుంటుందని దుయ్యబట్టారు. రేవంత్ అనే చేతకాని సీఎం వల్ల లక్షల ఎకరాల పంటలు ఎండిపోతున్నాయని, ఎండిపోయిన పొలాలకు రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలన్నారు.

కాంగ్రెస్ సర్కార్ ఘోర వైఫల్యం వల్ల 480 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. పంటలు ఎండకుండా నీళ్లు వదులుతారని గవర్నర్ నోటి వెంట మాట వస్తాదన్న ఆశతో ఉన్న రైతులకు నిరాశే మిగిలిందన్నారు. మూడేళ్ల తర్వాత కాంగ్రెస్ తల్లిని, రాహుల్ గాంధీ తండ్రిని సెక్రటేరియట్ నుండి మంచిగా మూట కట్టి గాంధీ భవన్‌కు పంపిస్తామని.. ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ పెట్టుకోండని కేటీఆర్ వ్యాఖ్యానించారు. బీసీలను కులగణన పేరుతో వంచించి.. అవమానించిందని ఈ మాటలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలే అంటున్నారన్నారు.

ఆరు గ్యారంటీల్లో ఒక గ్యారంటీ అమలు చేయకుండా.. 420 హామీల్లో ఒక్క హామీ అమలు చేయకుండా ఇవాళ కొత్త ప్రాజెక్టుకు ఇటుక పెట్టకుండా 1.62లక్షలకోట్ల అప్పు చేసినందుకు రేవంత్‌రెడ్డిని గవర్నర్‌ ఏమన్నా మందలిస్తరేమోనని అనుకుంటే.. అక్కడ కూడా గాంధీభవన్‌లో ప్రసంగం చేసేలా కార్యకర్తలా గవర్నర్‌ ప్రసంగం సాగిందన్నారు. తెలంగాణలో ఈ రోజు ఉన్న పరిస్థితికి చావుడప్పు కొట్టాలి. కానీ, పెళ్లిల్లో డీజే కొట్టినట్లు గవర్నర్‌ డబ్బా కొట్టారని కేటీఆర్ అన్నారు. దావోస్‌లో రూ.1.79లక్షలకోట్ల పెట్టుబడులని మరోసారి గవర్నర్‌ అబద్ధాలు చెప్పించారు’ అంటూ ధ్వజమెత్తారు.

ఏడాదిన్నర పాలనా వైఫల్యానికి గవర్నర్ ప్రసంగం నిదర్శనం : హరీష్ రావు

మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ గతేడాది గవర్నర్ ప్రసంగానికి, ఈసారి గవర్నర్ ప్రసంగానికి తేడా ఏం లేదన్నారు. గవర్నర్లు మారారు తప్ప, ప్రసంగాలు మారలేదన్నారు. చేయనివి చేసినట్లు, ఇవ్వని ఇచ్చినట్లు..అబద్దాలు, అవాస్తవాలతో కూడిన ప్రసంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ తో చెప్పించిందని విమర్శించారు. ఏడాదిన్నర ప్రభుత్వ పాలనా వైఫల్యానికి గవర్నర్ ప్రసంగం నిదర్శనమని పెదవి విరిచారు. బీసీల కులగణన తప్పుల తడకగా చేసి.. ఇప్పుడు ఏ ప్రాతిపదికన బిల్లు పెడతారని..తప్పుల కులగణన చేసిన రోజును సామాజిక న్యాయ దినోత్సవంగా ఎలా జరుపుతారని హరీష్ రావు ప్రశ్నించారు. కనీసం అంబేద్కర్ విగ్రహానికి దండ కూడా వేయని వాళ్లు సామాజిక న్యాయ దినోత్సవాన్ని జరుపుతారా? అని విమర్శించారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్చారని.. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే చోట రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం పెట్టారని.. తెలంగాణ సంస్కృతి అభివృద్ధికి చేపట్టిన చర్యలుగా వీటీని భావించాలా? అని ప్రశ్నించారు.

లక్షా 78వేల కోట్ల పెట్టుబడులు వచ్చినయని గొప్పలు చెబుతున్నారని,ఇప్పటి వరకు చెప్పిన ఒప్పందాలు ఎన్ని గ్రౌండ్ అయ్యాయన్నదానిపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఎస్ఎంఇలు ఇబ్బందులు పడుతుంటే, కొత్త పాలసీ అని డబ్బా కొడుతున్నారని మండిపడ్డారు. అన్ని పంటలకు బోనస్ అని చెప్పి సన్నాలకు పరిమితం చేసారు. ఇంకా 400 కోట్లు పెండింగ్ ఉంది. 1200 కోట్లు ఇచ్చినం అనేది పచ్చి అబద్దమన్నారు. 445 రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. కనీసం రైతు బీమా డబ్బులు కూడా ఇవ్వడం లేదన్నారు.

కృష్ణా జలాలు ఆంధ్రా దోచుకుపోతుంటే మౌనంగా ఉన్న మీరు దాని గురించి మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించారు. ఆరు గ్యారెంటీల్లో మహాలక్ష్మి మొదటి హామి నెలకు 2500 ఇప్పటికి దిక్కులేదని..ఇంకా దీన్ని గేమ్ చేంజర్ అని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మహిళా సంఘాలకు ఈ ఏడాది ఒక్క రూపాయి కూడా వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదన్నారు. 55,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినం అని అబద్దం చెప్పారని,. పది వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదన్నారు. జా బ్ క్యాలెండర్ జాబ్ లెస్ క్యాలెండర్ చేశారని.. నిరుద్యోగ భృతి ఊసే లేదని.ఏటా 2లక్షల ఉద్యోగాలు అని యువతను మోసం చేశారని విమర్శించారు. విద్యావ్యవస్థ నిర్వీర్యం చేశారని, గురుకులాల్లో 83 మంది విద్యార్థులు ప్రాణం కోల్పోయారన్నారు. ఆరోగ్య శ్రీ అమలు కావడం లేదని హరీష్ రావు విమర్శించారు.