కడియంతో.. రాజయ్య రాజీ: సయోధ్య కుదిర్చిన కేటీఆర్

- ఏ హామీ ఇచ్చారనేది ప్రకటించలేదు
- రాజయ్య అనుచరుల ఆవేదన
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఉప్పూ, నిప్పుగా కొనసాగిన స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాడికొండ రాజయ్య, ఎమ్మెల్సీ స్టేషన్ ఘన్పూర్ బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి మధ్య ఎట్టకేలకు సయోధ్య కుదిరింది. వీరిద్దరి మధ్య నెలకొన్న సమస్యను చర్చించి పరిష్కారాన్ని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చూపెట్టినట్లు చెబుతున్నారు. రాజయ్యకు ఏమీ హామీ ఇచ్చారు అనేది బయటికి ఇంకా ప్రకటించకపోయినప్పటికీ ఏదో బలమైన భరోసా ఇచ్చినందునే రాజయ్య రాజీకి సిద్ధమైనట్లు భావిస్తున్నారు.
కడియానికి రాజయ్య మద్దతు
ఈ నేపథ్యంలోనే రానున్న శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ స్టేషన్ ఘనపూర్ అభ్యర్ధిగా కడియం శ్రీహరి అభ్యర్థిత్వానికి స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య సంపూర్ణ మద్దతు ప్రకటించినట్లు చెబుతున్నారు. కడియం అభ్యర్థిత్వానికి సంపూర్ణ మద్దతు అందించి, పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని ఎమ్మెల్యే రాజయ్య ప్రకటించారు. శుక్రవారం ప్రగతి భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, పార్టీ సీనియర్ లీడర్లతో జరిగిన సమావేశం అనంతరం పార్టీ అభ్యర్థి గెలుపు కోసం సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు రాజయ్య ప్రకటించారు. రానున్న ఎన్నికల్లో వరంగల్ ఎంపీగా పోటీ చేసే అవకాశం తో పాటు, ఎమ్మెల్సీగా అవకాశం కల్పించే వీలు ఉందని భావిస్తున్నారు.
రాజయ్య అనుచరుల ఆవేదన
కింది నుంచి పై వరకు స్టేషన్గన్పూర్ నియోజకవర్గంలో రెండు వర్గాలుగా విడిపోయిన బీఆర్ఎస్ నాయకులు ఇరువురి నాయకుల కలయికపట్ల ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.నాయకులు మధ్యలో తమని పావులుగా ఉపయోగించుకొని ఇబ్బందులకు గురి చేశారని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమని సంప్రదించకుండానే రాజయ్య, శ్రీహరితో రాజీ కుదుర్చుకోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాము కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మేనని, పార్టీ పురోభివృద్ధి తమ లక్ష్యమని వారు గుర్తు చేస్తున్నారు.