KU JAC | కేయూ జేఏసీ నేతలపై పోలీసుల ఉక్కు పాదం
తెల్లవారుజామున హాస్టల్లపై పోలీసు దాడి తలుపులు పగులగొట్టి ఏడుగురు విద్యార్థి జాక్ నేతల అరెస్ట్ పోలీసులు, వైస్ ఛాన్స్లర్ రమేష్ తీరుపై తీవ్ర ఆగ్రహం అక్రమార్కులకు ప్రభుత్వ వత్తాసుపై మండిపాటు విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కాకతీయ యూనివర్సిటీ జేఏసీ నాయకుల (KU JAC Leaders) పై పోలీసులు ఉక్కు పాదం మోపారు. శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు యూనివర్సిటీ హాస్టల్‌పై దాడి చేసి, తలుపులు పగలగొట్టి జేఏసీ నాయకులను అరెస్టు చేసి, పోలీస్ స్టేషన్ కు […]

- తెల్లవారుజామున హాస్టల్లపై పోలీసు దాడి
- తలుపులు పగులగొట్టి ఏడుగురు విద్యార్థి జాక్ నేతల అరెస్ట్
- పోలీసులు, వైస్ ఛాన్స్లర్ రమేష్ తీరుపై తీవ్ర ఆగ్రహం
- అక్రమార్కులకు ప్రభుత్వ వత్తాసుపై మండిపాటు
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కాకతీయ యూనివర్సిటీ జేఏసీ నాయకుల (KU JAC Leaders) పై పోలీసులు ఉక్కు పాదం మోపారు. శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు యూనివర్సిటీ హాస్టల్‌పై దాడి చేసి, తలుపులు పగలగొట్టి జేఏసీ నాయకులను అరెస్టు చేసి, పోలీస్ స్టేషన్ కు తరలించారు.
కాకతీయ యూనివర్సిటీలో రెండు రోజుల క్రితం జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన మహా ధర్నా, విసి భవన్ ముట్టడి ఆందోళన సందర్భంగా జరిగిన ధ్వంసం సంఘటనల్లో పోలీసులు విద్యార్థి జేఏసీ నాయకులపై కేసులు నమోదు చేశారు.
ఏడుగురు విద్యార్థి నాయకుల అరెస్ట్
కేయూ జాక్ నాయకులను శుక్రవారం తెల్లవారుజామున 4గంటలకు పోలీసులు అరెస్టు చేశారు. పొద్దు పొద్దున్నే తలుపులు పగలగొట్టి 1) ఇట్టబోయిన తిరుపతి యాదవ్ 2) మెడ రంజిత్ కుమార్ 3) కాడపాక రంజిత్, 4) బందిగ రాకేష్ కృష్ణన్ 5) అరేగంటి నాగరాజు 6) బోట్ల మనోహర్ 7) హెచ్చు భగత్‌లను అరెస్టు చేసి, పోలీస్ స్టేషన్‌కు తరలించారు. జాక్ నేతలను రిమాండ్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
విద్యార్థి జేఏసీ నాయకుల ఆగ్రహం
అర్ధరాత్రి పోలీసులు చేసిన దాడి పట్ల నాయకులు, విద్యార్థులు, విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ వైఖరికి, వైస్ ఛాన్స్లర్ రమేష్ తీరు పట్ల మండిపడుతున్నారు. తాము ఉదయం 10 గంటలకు పోలీస్ స్టేషన్‌కు వస్తామని ముందస్తు సమాచారం అందించినప్పటికీ, అర్ధరాత్రి రూముల పై దాడి చేసి అరెస్టు చేయడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత దారుణంగా వ్యవహరించలేదని, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ కోసం కొట్లాడిన విద్యార్థుల పట్ల అనుసరిస్తున్న నిర్బంధాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు విద్యార్థి నాయకులు ఆవేదనతో వివరించారు.
అక్రమార్కులకు సర్కారు వత్తాసు
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీకి కారణమైన చైర్మన్ జనార్ధన్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ కాకతీయ యూనివర్సిటీ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన శాంతియుత నిరసన కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసిన విషయం తెలిసిందే. వైస్ ఛాన్స్లర్ తాటికొండ రమేష్ వైఖరికి నిరసనగా ఆయన ఛాంబర్ ముట్టడి సందర్భంగా పూల కుండీలు పగులగొట్టి, కిటికీ అద్దాలు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.
వైస్ ఛాన్సలర్, పోలీసులే కారణం
ఉద్రిక్త సంఘటనకు వైస్ ఛాన్స్లర్ తాటికొండ రమేష్ పూర్తి బాధ్యత వహించాలని విద్యార్థులు జేఏసీ నాయకులు స్పష్టం చేస్తున్నారు. వర్సిటీలో తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల సంఘర్షణ సభ నిర్వహణకు ముందుగా అనుమతించి, తర్వాత ప్రభుత్వ ఒత్తిడి కారణంగా అనుమతి ఇవ్వకుండా వ్యవహరించిన వీసి వైఖరికి నిరసనగా తాము మహా ధర్నా చేపట్టామన్నారు.
ఈ సందర్భంలో శాంతియుతంగా కార్యక్రమం నిర్వహిస్తుండగా పోలీసులు జోక్యం చేసుకొని మైక్ కట్ చేసి, అనుమతి నిరాకరించి ధర్నా సాఫీగా సాగకుండా అడ్డంకులు కల్పించారని విమర్శించారు. దీంతో విద్యార్థులు ఆగ్రహానికి లోనై వీసి భవన్ ముట్టడికి సిద్ధమయ్యారని జేఏసీ నేతలు గుర్తు చేస్తున్నారు.
విద్యార్థులను రెచ్చగొట్టింది వర్సిటీ పాలకవర్గం, పోలీసులేనని విమర్శిస్తున్నారు. ఆ సంఘటన పట్ల తాము విచారం వ్యక్తం చేస్తూ పోలీసులకు సహకరించేందుకు సిద్ధమయ్యామని జేఏసీ నాయకులు వివరించారు. అయినప్పటికీ పట్టించుకోకుండా హాస్టల్ రూముల పై దాడులు చేశారని, తమను అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
వీసీ నాన్ బోర్డర్
యూనివర్సిటీ నాన్ బోర్డర్లుగా తమను చిత్రీకరిస్తున్నారని, వాస్తవానికి వర్సిటీ వీ సి తాటికొండ రమేష్ నాన్ బోర్డర్ అంటూ రిటైర్మెంట్ తర్వాత వీసీగా వచ్చారని విద్యార్థి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వయం ప్రతిపత్తి గల యూనివర్సిటీని అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో నిర్వహిస్తున్నారని విమర్శించారు.
దొంగలను విడిచిపెట్టి మమ్మల్ని అరెస్టు
విద్యార్థులను మానసికంగా శారీరకంగా ఇబ్బందులకు గురి చేస్తే యూనివర్సిటీ పాలకవర్గం ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని విద్యార్థి నాయకులు హెచ్చరిస్తున్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వల్ల 30 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు బజారున పడ్డదన్నారు.
అనేకమంది మానసికంగా శారీరకంగా ఇబ్బందుల పాలవుతున్నారని ఆర్థిక సమస్యల మధ్య చదువుకున్న విద్యార్థులు ఆందోళనకు లోనవుతున్నారని వివరించారు. అయినా దొంగలను, దోషులను పట్టించుకోకుండా, పట్టుకోకుండా ప్రభుత్వం వారికి సద్దులు మోస్తూ, సమస్యపై నిలదీసిన తమను అరెస్టు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.