ఫోన్ ట్యాపింగ్‌పై సీబీఐ విచారణ జరిపించాలి
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో వెలుగుచూస్తున్న విషయాల తీవ్రత దృష్ట్యా కేసును సీబీఐకి అప్పగించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి చర్యలు తీసుకోవాలని బీజేపీ రాజ్యసభ సభ్యులు కె.లక్ష్మణ్ సూచించారు

- ట్యాపింగ్‌కు కేసీఆర్, కేటీఆర్ బాధ్యులు
- బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్
విధాత: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో వెలుగుచూస్తున్న విషయాల తీవ్రత దృష్ట్యా కేసును సీబీఐకి అప్పగించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి చర్యలు తీసుకోవాలని బీజేపీ రాజ్యసభ సభ్యులు కె.లక్ష్మణ్ సూచించారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ నియంతృత్వాన్ని పాటించే వాళ్లు తమ నీడను కూడా నమ్మరని, అలాగే కేసీఆర్ కూడా ఎవరినీ నమ్మలేదని.. అందుకే రాజకీయ, మీడియా ప్రముఖులపై ఫోన్ ట్యాపింగ్ చేయించారని ఆరోపించారు.
కేంద్ర హోం శాఖ అనుమతి లేకుండా ఫోన్ ట్యాపింగ్ చేశారని, రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో హార్డ్ డిస్కులు, సమాచారాన్ని ధ్వంసం చేశారని, రెండో, మూడో ఫోన్ ట్యాపింగ్‌లు జరిగితే జరగవచ్చని కేటీఆర్ అంటున్నారని, ఇందుకు బాధ్యులైన కేసీఆర్, కేటీఆర్‌లను విచారించాలన్నారు. సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి కదలలేదని, సచివాలయానికి ఒక్కసారి కూడా వెళ్లలేదని, గత ప్రభుత్వంలో ప్రతి పథకంలో స్కామ్‌లు చేశారని, కమీషన్లు తీసుకున్నారని, ప్రశ్నించే వారిని బెదిరింపులకు గురి చేశారని, నియంతృత్వ పోకడలు సాగించారని విమర్శించారు.
రాజకీయ కక్ష సాధింపులో భాగంగా తన అధికారాన్ని కాపాడుకునేందుకు ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాపింగ్ చేయించారని, అసెంబ్లీ ఉప ఎన్నికల సమయంలో రాజకీయంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నిచారని ట్యాపింగ్ కేసు ద్వారా తేటతెల్లమైందన్నారు. ట్యాపింగ్ కుంభకోణంలో కొంత మంది పోలీసు అధికారులు ఏ రకంగా అక్రమార్జనకు పాల్పడ్డారో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయన్నారు. ప్రతిపక్ష నేతలతో పాటు రియల్టర్లు, వ్యాపారులు, జర్నలిస్టులు, చివరకు జడ్జీల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లుగా సమాచారం వెలుగుచూస్తుండటం ఆందోళనకరమన్నారు.
అక్రమ ట్యాపింగ్ ద్వారా కేసీఆర్ ప్రభుత్వం చట్టాల ఉల్లంఘనకు, పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించిందని, ఇది తీవ్రమైన నేరం అని లక్ష్మణ్ ఆరోపించారు. మద్యం కుంభకోణంలో కవిత పాత్ర ఉందని, ఫోన్ ట్యాపింగ్, కాశేశ్వరం ప్రాజెక్టు అవకతవకల్లో ఆ కుటుంబానికి ప్రమేయముందని, తెలంగాణ సంపదను దోచుకున్న వారికి శిక్ష పడాలని ప్రజలు కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీఆరెస్‌ను ఓడించి శిక్షించినప్పటికి ఆ పార్టీ నేతలు అహంకారాన్ని వీడటం లేదని, కేసుల్లో నిండా కూరుకుపోయి కూడా మేకపోతు గాంభిర్యాన్ని ప్రదర్శిస్తుండటం విడ్డూరంగా ఉందన్నారు.