మహానగరంలో భూబకాసురులు.. ఖాళీ స్థలాలు, ప్ర‌భుత్వ జాగలు స్వాహా

మహానగరంలో భూబకాసురులు.. ఖాళీ స్థలాలు, ప్ర‌భుత్వ జాగలు స్వాహా
  • వట్టినాగులపల్లిలో భూ బ‌కాసురులు!
  • 111 జీవోను తొక్కేసి అక్ర‌మ లే అవుట్లు
  • వంద‌ల కోట్ల రూపాయ‌ల్లో భూదందా
  • వ‌ట్టినాగుల‌ప‌ల్లిపై అక్ర‌మార్కుల క‌న్ను
  • దాదాపు 400 ఎక‌రాల‌ క‌బ్జాకు స్కెచ్?
  • కాగితాల‌పై న‌కిలీ లేఅవుట్లతో ఆక్రమణ
  • జులుంను ప్ర‌శ్నించినవారికి బెదిరింపులు
  • ఆ భూములకు అనుమ‌తులివ్వ‌ట్లేదన్న
  • హెచ్ఎండీఏ, డీటీపీసీ, నార్సింగ్ మున్సిపాల్టీ
  • అయినా జేసీబీలతో సీమాంధ్ర రియ‌ల్ట‌ర్లు జోరు
  • క‌న్నెత్తి చూడని హెచ్ఎండీఏ అధికారులు

విధాత‌, హైద‌రాబాద్‌: మ‌హాన‌గ‌రంలో భూ బ‌కాసురులు రెచ్చిపోతున్నారు. రోజు రోజుకూ వారి అక్ర‌మాల‌కు అడ్డూ అదుపు లేకుండా పోతున్నది. ఖాళీ స్థలాలు, ప్ర‌భుత్వ భూములను సైతం వద‌ల‌కుండా క‌బ్జా పెట్టేస్తున్నారు. 111 జీవోను సైతం లెక్క చేయ‌కుండా అక్క‌డి స్థలాల‌ను ఆక్ర‌మించి, అక్ర‌మ లే అవుట్లు చేసి వంద‌ల కోట్ల రూపాయ‌లు దండుకుంటున్నారు.


ఇటీవ‌లే కోకాపేట భూముల ధ‌ర‌లు అమాంతం ఆకాశాన్ని అంట‌డంతో అక్ర‌మార్కుల ఆగ‌డాలు పెచ్చుమీరుతున్నాయి. 111 జీవో ప‌రిధిలో ఉన్న రంగారెడ్డి జిల్లా, గండిపేట మండ‌లం, వ‌ట్టినాగుల‌ప‌ల్లి రెవెన్యూ గ్రామంలోని భూముల‌పై అక్ర‌మార్కుల క‌న్ను ప‌డింది. దాదాపు 400 ఎక‌రాల‌ను క‌బ్జా చేసేందుకు స్కెచ్ వేశారని తెలుస్తున్నది. ఇందుకు ప‌క్కాప్లాన్ వేసి అమ‌లు చేస్తున్నారని సమాచారం.


ఇక్క‌డి భూములకు నాలా క‌న్వ‌ర్ష‌న్ లేక‌పోయినా, ఎలాంటి లే అవుట్లకు అనుమ‌తి లేక‌పోయినా అక్ర‌మార్కులకు అవేవీ ప‌ట్ట‌డంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. గ‌చ్చిబౌలి ఫైనాన్షియ‌ల్ డిస్ట్రిక్‌కు కూతవేటు దూరంలో బ‌ఫ‌ర్ జోన్ ప‌రిధిలో ఉన్నఈ గ్రామంలోని వ్య‌వ‌సాయ భూముల‌పై క‌న్నేసి, కాజేసే కుట్ర‌కు తెర లేపారని చెబుతున్నారు.


ఎన్నిక‌ల స‌మ‌యం కావ‌డంతో ఎవ‌రూ ప‌ట్టించుకునే ప‌రిస్థితిలో లేర‌ని వారి ప‌నులు గుట్టుచ‌ప్పుడు కాకుండా కానిచ్చేస్తున్నారని అంటున్నారు. కాగితాల‌పై న‌కిలీ లేఅవుట్లు సృష్టించుకొని రైతుల‌కు చెందిన భూముల‌న్నీ త‌మ‌వేన‌ని ఆక్ర‌మ‌ణ‌ల‌కు పాల్ప‌డుతున్నారని పలువురు బాధితులు వాపోతున్నారు.


ఇవి రూపాయి రూపాయి పోగేసుకొని, ఎన్నో ఏళ్ల కింద కొనుకున్న భూముల‌ని, వాటిపై మీ జులుం ఏంట‌ని ప్ర‌శ్నించినవారిపై బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నారని బాధితులు చెబుతున్నారు. త‌మ వెన‌క బ‌డాబాబులు ఉన్నారని, కోర్టుల‌ను కూడా సునాయ‌సంగా మేనేజ్ చేస్తామ‌ని, త‌మ‌ను ఎవ‌రు ఏమీ చేయ‌లేర‌ని చెబుతున్నార‌ని అక్క‌డి రైతులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.


అనుమతులు ఇవ్వటం లేదు


ఇక్క‌డి భూములకు తాము ఎలాంటి అనుమ‌తులు ఇవ్వ‌డం లేద‌ని హెచ్ ఎండీఏ, డీటీపీసీ, నార్సింగ్ మున్సిపాలిటీల అధికారులు స్ప‌ష్టం చేస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ త‌మ‌ది అధికారిక లేఅవుట్ అని ద‌బాయిస్తూ అడ్డ‌గోలుగా వెంచ‌ర్లు వేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ విషయాలు చెప్పుకొని రైతులు ల‌బోదిబో మంటూ వారి గోడు వెళ్లబోసుకుంటున్నారు.


కన్నెత్తి చూడని అధికారులు


ఈ ప్రాంతంలోని భూముల్లో వెంచర్లకు అనుమలు లేవని చెబుతున్న హెచ్‌ఎండీఏ అధికారులు.. మరోవైపు ఇదే ప్రాంతంలో సీమాంధ్ర రియల్టర్లు జేసీబీలు, బుల్డోజర్లతో నిర్విరామంగా పనులు చేయిస్తున్నప్పటికీ అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో అధికారుల వైఖరిపై అనేక అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. త‌మ భూమిని అక్ర‌మించుకునేందుకు కొంద‌రు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారని, వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కొందరు బాధితులు ఫిర్యాదు చేస్తే.. ఫిర్యాదు తీసుకోవ‌డానికి కూడా పోలీసులు నిరాక‌రించిన‌ట్లు తెలిసింది. భూ య‌జ‌మానులు అక్ర‌మార్కుల‌పై ఫిర్యాదులు చేస్తున్నా, సివిల్ వివాదాల్లో తాము జోక్యం చేసుకోవ‌డం లేదంటూ జారుకుంటున్నారని అంటున్నారు. దీంతో పోలీసులు సైతం ప‌రోక్షంగా అక్ర‌మార్కుల‌కే స‌పోర్ట్ చేస్తున్నారా? అన్న అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.


111జీవో కూడా పట్టడం లేదు


111 జీవో ఇంకా ర‌ద్దు చేయ‌లేద‌ని ప్ర‌భుత్వం చెబుతున్నది. ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం 111 జీవో నిబంధన‌లు అమ‌లు చేస్తున్నామ‌ని హైకోర్టుకు స్ప‌ష్టం చేసింది. అయిన‌ప్ప‌టికీ భూ బ‌కాసురులు నిబంధ‌న‌లు ఖాత‌రు చేయ‌డం లేదు. బ‌డాబాబుల అండ‌దండ‌ల‌తో డ‌బుల్ రిజిస్ట్రేష‌న్‌లు సృష్టిస్తూ రైతుల నుంచి భూములు అన్యాక్రాంతంగా గుంజుకుంటున్నారని స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.