Delhi | కోర్టు భవనంపై నుంచి దూకి న్యాయవాది ఆత్మహత్య
దక్షిణ ఢిల్లీలోని సాకేత్ కోర్టులో సోమవారం షాకింగ్ ఘటన చోటుచేసుకున్నది. 44 ఏండ్ల న్యాయవాది కోర్టు భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు

- రెండేండ్లుగా కాలేయ వ్యాధితో
- బాధపడుతున్నట్టు సూసైడ్ నోట్ స్వాధీనం
Delhi | విధాత: దక్షిణ ఢిల్లీలోని సాకేత్ కోర్టులో సోమవారం షాకింగ్ ఘటన చోటుచేసుకున్నది. 44 ఏండ్ల న్యాయవాది కోర్టు భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. అప్పటి దాకా తమతో ఉన్న న్యాయవాది అకస్మాత్తుగా ఆత్మహత్యకు పాల్పడటంతో తోటి లాయర్లు షాక్‌కు గురయ్యారు. పోలీసులు మృతుడి వద్ద సూసైడ్ లేఖ స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. న్యాయవాది ఓం కుమార్ శర్మ సోమవారం సాయంత్రం సాకేత్ కోర్టులోని లాయర్ చాంబర్ నుంచి ఒక్కసారిగా దూకేసి బలవన్మరణానికి పాల్పడ్డారు. పార్కింగ్ ప్రాంతం నుంచి అతని మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రెండు సంవత్సరాలుగా కాలేయ వ్యాధితో బాధపడుతున్నట్లు మృతుడి జేబులో సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.
“రాత్రి 8 గంటలకు సాకేత్ కోర్టులోని లాయర్ చాంబర్ నుంచి ఒక న్యాయవాది దూకి మరణించాడని మాకు సమాచారం అందింది. అతని మృతదేహం సాకేత్ కోర్టు వెనుక పార్కింగ్ ప్రాంతంలో కనుగొన్నాం. మేము మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు పంపించాం” అని సీనియర్ పోలీసు అధికారి చెప్పారు. మృతుడు రెండేళ్లుగా కాలేయ వ్యాధితో బాధపడుతున్నట్టు విచారణలో తేలిందని పేర్కొన్నారు. సోమవారం ఓం కుమార్ తన భార్యతో కలిసి దవాఖానకు వెళ్లి సాకేత్ కోర్టుకు వచ్చారని, భార్యను గేటు వద్ద ఉంచి ఆపై ఆత్మహత్యకు పాల్పడ్డారని అధికారి తెలిపారు. కేసు దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు.