హుజురాబాద్‌లో కౌశిక్ రెడ్డికి లైన్ క్లియర్.. అడ్డంకులు తొలగిస్తున్న BRS అధిష్టానం
ఒక్కో మెట్టెక్కుతున్న పాడి నియోజకవర్గ ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగింత అడ్డంకులు తొలగిస్తున్న బీఆర్ఎస్ అధిష్టానం విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రానున్న ఎన్నికల్లో హుజురాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేందుకు పాడి కౌశిక్ రెడ్డికి ఆ పార్టీ అధిష్టానం లైన్ క్లియర్ చేస్తున్నది. పాడి కౌశిక్ రెడ్డి పోటీకి ఉన్న అడ్డంకులను తొలగిస్తూ కౌశిక్ ను ఒక్కో మెట్టెక్కిస్తుంది రానున్న ఎన్నికల్లో ఈటల కోటపై గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా అధిష్టానం పావులు కదుపుతున్నట్లు […]

- ఒక్కో మెట్టెక్కుతున్న పాడి
- నియోజకవర్గ ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగింత
- అడ్డంకులు తొలగిస్తున్న బీఆర్ఎస్ అధిష్టానం
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రానున్న ఎన్నికల్లో హుజురాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేందుకు పాడి కౌశిక్ రెడ్డికి ఆ పార్టీ అధిష్టానం లైన్ క్లియర్ చేస్తున్నది. పాడి కౌశిక్ రెడ్డి పోటీకి ఉన్న అడ్డంకులను తొలగిస్తూ కౌశిక్ ను ఒక్కో మెట్టెక్కిస్తుంది రానున్న ఎన్నికల్లో ఈటల కోటపై గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా అధిష్టానం పావులు కదుపుతున్నట్లు భావించాల్సి వస్తోంది.
ఈటలకు పోటీ పాడి కౌశిక్ రెడ్డి అని అధిష్టానం స్పష్టమైన అంచనాకు వచ్చిన తర్వాత ఈ మేరకు చకచకా పావులు కదుపుతోంది. ఇప్పటినుంచే హుజురాబాద్ నియోజకవర్గంలో కౌశిక్ ను ఎస్టాబ్లిష్ చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా తీసుకుంటుంది. ఈ మేరకు అధిష్టానం స్పష్టమైన సంకేతాలను అందిస్తోంది.
సెగ్మెంట్ బాధ్యతలు కౌశిక్ రెడ్డికి
హుజురాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ బాధ్యతలను బుధవారం పాడి కౌశిక్ రెడ్డికి అప్పగిస్తూ బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. దీంతో పార్టీ పై పట్టు రావడమే కాకుండా నియోజకవర్గంలోని కేడర్లో తన పరపతి పెంచుకునేందుకు వారితో సఖ్యత గా మసలుకునేందుకు ఇప్పటినుంచే అవకాశం కల్పించింది.
ఇప్పటికే కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఇటీవలనే కౌశిక్ ను ప్రభుత్వ విప్‌గా నియమించి ఆయనకున్న ప్రాధాన్యతను తెలియపరిచారు. అప్పటికే ఎమ్మెల్సీగా ప్రభుత్వ విప్పుగా హుజురాబాద్ సెగ్మెంట్లో అధికారిక కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతున్నారు. ఇప్పుడు పార్టీ బాధ్యతలు కూడా అప్పగించడం గమనార్హం.
పోటీ నుంచి.. గెల్లును తప్పించిన అధిష్టానం
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ పై పోటీ చేసిన బి ఆర్ ఎస్ వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ నుంచి రానున్న ఎన్నికల్లో ఇబ్బంది లేకుండా ముందుగా ఆయనను పర్యాటక కార్పొరేషన్ చైర్మన్ గా నియమించారు.
గతంలో ఒకసారి ఆయన వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తానంటూ చెప్పినప్పటికీ తాజా నియామకం వెనుక కౌశిక్ రెడ్డికి ఇబ్బంది లేకుండా చేసేందుకే శ్రీనివాస్ యాదవ్ కు నామినేటెడ్ పదవి ఇచ్చినట్లు ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అప్పుడే కౌశిక్ కు లైన్ క్లియర్ అయినట్లు భావించినప్పటికీ తాజా నిర్ణయంతో అధిష్టానం కౌశిక్ రెడ్డి వైపే మొగ్గినట్లు భావిస్తున్నారు.
ఉప ఎన్నికలతో.. కౌశిక్ రెడ్డికి ఛాన్స్
టిఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ తర్వాత ప్రాధాన్యత కలిగిన నాయకుడిగా ఎదిగి రెండు పర్యాయాలు ఆయన మంత్రివర్గంలో మంత్రిగా కొనసాగిన ఈటల రాజేందర్ ను బర్తరఫ్ చేయడమే కాకుండా పార్టీ నుంచి బహిష్కరణతో పరిణామాలు వేగంగా జరిగిపోయాయి. ఎమ్మెల్యేగా ఈటల రాజీనామాతో హుజురాబాద్ లో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి.
ఆకస్మికంగా వచ్చిన హుజరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటెలపై పోటీకి టిఆర్ఎస్ పార్టీలో బలమైన అభ్యర్థి లేకపోవడం ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కౌశిక్ రెడ్డికి టిఆర్ఎస్ గాలం వేసింది. కాంగ్రెసులోనే ఉంటూ టీఆర్ఎస్ కు అనుకూలంగా పని చేస్తున్నాడని ఆరోపణలు వ్యక్తమయ్యాయి.
అనుకున్నట్లే ఆఖరికి టిఆర్ఎస్ లో చేరిపోయాడు. ఈటలపై కౌశిక్ రెడ్డిని పోటీకి పెడతారని అందరూ భావించినప్పటికీ అప్పుడున్న రాజకీయ పరిస్థితులు, సామాజిక సమీకరణల నేపథ్యంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ వైపు పార్టీ అధిష్టానం మొగ్గుచూపింది.
గెల్లును రంగంలోకి దింపినప్పటికీ ఈటలను ఓడించ లేకపోయారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో కౌశిక్ రెడ్డి దశ మారింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమించాలని భావించినప్పటికీ ఏర్పడిన అడ్డంకితో కొద్దికాలం ఆయనకు అవకాశం దక్కనప్పటికీ కెసిఆర్ పట్టు పట్టి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. ఆ తర్వాత పరిణామాలు కౌశిక్ రెడ్డిపై అధిష్టానం నమ్మకంతో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.
సెగ్నెంట్ చరిత్ర పరిశీలించి అడుగులు
పాత కమలాపురం, ప్రస్తుత హుజరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల గత చరిత్రను పరిశీలించిన అనంతరం ఈటలకు పోటీగా రెడ్డి సామాజిక వర్గం చెందిన వ్యక్తి అయితేనే సానుకూల పరిస్థితులు ఉంటాయని భావించి కౌశిక్ రెడ్డిని ఈటలకు దీటుగా ప్రాజెక్ట్ చేస్తున్నట్టు భావిస్తున్నారు. గతంలో ముద్దసాని దామోదర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున ఈ ప్రాంతం నుంచి సుదీర్ఘకాలం ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే. అధిష్టానం చేసిన ఈ ప్రయోగం ఏ మేరకు ఫలిస్తుందో వచ్చే ఎన్నికల్లో ఫలితాలే తేలుస్తాయి.