Delhi Liquor Case | ఆప్‌ను ఆగం చేసిన ఢిల్లీ లిక్కర్ కేసు.. అగ్రనేతలంతా అరెస్ట్..

Delhi Liquor Case : ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఒక్కొక్కరుగా ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అగ్రనేతలంతా అరెస్టయ్యారు. ఇప్పటికే ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, మరో సీనియర్ నేత ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ ఈ కేసులో అరెస్టై జైల్లో ఉండగా.. తాజాగా ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అదుపులోకి తీసుకున్నది. దాంతో ఆప్ అగ్ర నాయకత్వమంతా లిక్కర్ కేసులో అరెస్టైనట్లు అయ్యింది.
భారత్ రాష్ట్ర సమితి (BRS) నాయకురాలు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత కూడా ఇటీవలే ఈ కేసులో అరెస్టై ఏడు రోజుల ఈడీ కస్టడీలో ఉన్నది. 2021-22 ఏడాదికి సంబంధించిన ఢిల్లీ లిక్కర్ పాలసీలో మనీలాండరింగ్ జరిగినట్లు ఈడీ గుర్తించింది. హోల్‌సేల్ లిక్కర్ వ్యాపారులకు 12 శాతం, రిటెయిలర్లకు 185 శాతం చొప్పున అధిక లాభాలు వచ్చేలా ప్లాన్ చేసి పాలసీని రూపొందించారని చెబుతోంది.
హోల్‌సేల్ వ్యాపారులకు వచ్చే 12 శాతం ప్రాఫిట్‌లో 6 శాతం ఆప్ నేతలకు, ఈడీ సౌత్ గ్రూప్‌గా పిలుస్తున్న దక్షిణాది మధ్యవర్తులు, వ్యాపారులు, రాజకీయ నాయకులకు కిక్‌బ్యాక్ రికవరీగా వచ్చేలా పాలసీని రూపొందించారని ఈడీ తెలిపింది. అందుకు ప్రతిఫలంగా సౌత్ గ్రూప్ రూ.100 కోట్లను ఆప్‌కు సంబంధించిన విజయ్ నాయర్‌కు అడ్వాన్స్‌గా ఇచ్చిందని పేర్కొంది. ఈ 100 కోట్ల రూపాయలను ఆప్ గోవా అసెంబ్లీ ఎన్నికల కోసం ఖర్చు చేసిందని వెల్లడించింది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సౌత్ గ్రూప్ పాత్రపైనే ఈడీ ప్రధానంగా దృష్టి సారించింది. సౌత్ గ్రూప్‌కు సంబంధించిన లిక్కర్ కంపెనీలకు మేలు చేసేలా ఢిల్లీ లిక్కర్ పాలసీలో సవరణలు చేసినట్లు తేలిందని, ఎలాంటి సంప్రతింపులు జరపకుండానే మనీశ్ సిసోడియా లిక్కర్ పాలసీని సౌత్ గ్రూప్‌కు అనుకూలంగా మార్చారని ఈడీ చెబుతోంది. కాగా, ఇప్పటికే రద్దయిన ఈ లిక్కర్ పాలసీ రూపకల్పన సందర్భంగా మొత్తం 16 మంది కీలక వ్యక్తులు మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఈడీ గుర్తించింది. కాగా, ఈ కేసులో నిందితులుగా ఉన్నవారిలో కొంతమంది సాక్ష్యులుగా మారారు.