Madhya Pradesh | చేతికి చిక్క‌నున్న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌?

Madhya Pradesh Politics ఎంపీపై క‌ర్ణాటక ఎన్నిక‌ల ప్ర‌భావం భారీ విజ‌యంతో కాంగ్రెస్ శ్రేణుల్లో పెరిగిన నైతిక స్థైర్యం, ఉత్సాహం బీజేపీ అగ్ర‌నాయ‌క‌త్వాన్ని క‌ల‌వ‌ర పెడుతున్న పార్టీ లుక‌లుక‌లు కాంగ్రెస్‌లో చేరిన క‌మ‌ల‌నాథులు బీజేపీకి దూర‌మ‌వుతున్న గిరిజ‌నులు క‌ర్ణాట‌క‌లో ప‌నిచేయ‌ని మోదీ ప్ర‌చారం ఓటర్లను ఆకర్షించడంలో విఫలం విధాత‌: మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో బీజేపీ మ‌ళ్లీ అధికారంలోకి రావ‌డం క‌ష్ట‌మేనా? క‌ర్ణాటకలో కాంగ్రెస్ బంప‌ర్ గెలుపు ప్ర‌భావం మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఉంటుందా? భారీ విజ‌యంతో కాంగ్రెస్ శ్రేణుల్లో నైతిక స్థైర్యం, గెలుపోత్సాహం […]

Madhya Pradesh | చేతికి చిక్క‌నున్న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌?

Madhya Pradesh Politics

  • ఎంపీపై క‌ర్ణాటక ఎన్నిక‌ల ప్ర‌భావం
  • భారీ విజ‌యంతో కాంగ్రెస్ శ్రేణుల్లో పెరిగిన నైతిక స్థైర్యం, ఉత్సాహం
  • బీజేపీ అగ్ర‌నాయ‌క‌త్వాన్ని క‌ల‌వ‌ర పెడుతున్న పార్టీ లుక‌లుక‌లు
  • కాంగ్రెస్‌లో చేరిన క‌మ‌ల‌నాథులు
  • బీజేపీకి దూర‌మ‌వుతున్న గిరిజ‌నులు
  • క‌ర్ణాట‌క‌లో ప‌నిచేయ‌ని మోదీ ప్ర‌చారం
  • ఓటర్లను ఆకర్షించడంలో విఫలం

విధాత‌: మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో బీజేపీ మ‌ళ్లీ అధికారంలోకి రావ‌డం క‌ష్ట‌మేనా? క‌ర్ణాటకలో కాంగ్రెస్ బంప‌ర్ గెలుపు ప్ర‌భావం మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఉంటుందా? భారీ విజ‌యంతో కాంగ్రెస్ శ్రేణుల్లో నైతిక స్థైర్యం, గెలుపోత్సాహం పెరిగిందా? క‌ర్ణాట‌క‌లో అనేక రోజులు ప్ర‌చారం చేసినా ఓటర్లను ఆకర్షించడంలో ఘోరంగా విఫలమైన మోదీ చరిష్మా మ‌ధ్యప్ర‌దేశ్‌లో చేయ‌దా? అంటే అవున‌నే అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.

224 స్థానాలున్న క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 136 సీట్ల‌ను గెలిచి కాంగ్రెస్ అధికారాన్ని హ‌స్త‌గ‌తం చేసుకున్న‌ది. అధికార బీజేపీ కేవలం 66 సీట్లకు పడిపోయింది. కర్ణాటకలో భారీ విజయంతో కాంగ్రెస్ శ్రేణుల్లో నైతిక స్థైర్యం, గెలుపోత్సాహం పెరిగిపోయింది.

మధ్యప్రదేశ్‌లో కూడా పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందనే ఆశలను మళ్లీ రేకెత్తించింది. క‌ర్ణాట‌క త‌ర‌హాలోనే మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో కూడా విజ‌య‌ఢంకా మోగిస్తామ‌ని, ఇక్క‌డ‌ ఐదు హామీలు నెర‌వేర్చామ‌ని, ఎంపీలోనూ అధికారం చేప‌ట్ట‌గానే నెర‌వేర్చుతామ‌ని కాంగ్రెస్ పార్టీ ఇటీవ‌లే ట్విట్ట‌ర్‌లో ప్ర‌క‌టించింది.

కర్ణాటక ఫలితాల‌ను ఎవ‌రు ప‌ట్టించుకుంటారు?: చౌహాన్‌

కర్ణాటక ఫలితాలను ఎవరు పట్టించుకుంటారు? అని మ‌ధ్య‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రశ్నించారు. ఇటీవ‌ల ఆయ‌న మాట్లాడుతూ.. @ఇది మధ్యప్రదేశ్. ఇక్కడ రికార్డు విజయాన్ని నమోదు చేస్తాం. ఇక్క‌డ కాంగ్రెస్ వారికి ఏమి ఉంది? మాకు నరేంద్ర మోదీ ఉన్నారు. రేయింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డి ప‌నిచేసే కార్య‌క‌ర్త‌లు ఉన్నారు. కాంగ్రెస్ ఇక్కడ మా దరిదాపుల్లోకి కూడా రాదు. ఇంకా నా చేతుల్లో అనేక అస్త్రాలు ఉన్నాయి* అని పేర్కొన్నారు.

కానీ, కర్ణాటకలో కూడా మోదీ ఉన్నారు. విప‌రీతంగా ప్ర‌చారం చేశారు. హిందూ అనుకూల జాతీయవాదం పేరిట ప్ర‌చారం హోరెత్తించారు. అయినా, ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకోలేక‌పోయారు. కాబ‌ట్టి మధ్యప్రదేశ్‌లో కర్ణాటక ఫలితాలు బీజేపీకి ఆందోళన కలిగించే అవ‌కాశం ఉన్న‌ది. రాబోయే రాష్ట్ర ఎన్నికలపై అవి కొంతైనా ప్ర‌భావం చూపుతాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.

అధికార బీజేపీలో అంత‌ర్గ‌త క‌ల‌హాలు

క‌ర్ణాట‌క ఫ‌లితాలతో కాంగ్రెస్ ఓ వైపు ఉత్సాహంగా, ఐక్యంగా క్షేత్ర‌స్థాయిలో దూసుకెళ్తుంటే మరోవైపు బీజేపీలో అంత‌ర్గ‌త క‌ల‌హాలు క‌ల‌వ‌ర పెడుతున్నాయి. ఇటీవ‌ల కొంద‌రు బీజేపీ నాయకులు కాంగ్రెస్‌లో చేరారు. సాగర్ జిల్లాకు చెందిన కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు అసంతృప్తితో ముఖ్యమంత్రిని క‌లిశారు. మ‌రోవైపు జ్యోతిరాదిత్య సింధియా ఫ్యాక్ట‌ర్ కూడా భ‌య‌పెడుతున్న‌ది.

మాజీ మంత్రులు అజయ్ బిష్ణోయ్‌, బ‌న్వర్ సింగ్ షెకావత్‌సహా అన్ని వైపుల నుంచి సీఎం చౌహాన్‌పై గుర్రుగా ఉన్నారు. బీజేపీ వింధ్య యూనిట్‌లో అసంతృప్తి ఉన్న‌ది. ఈ ప్రాంతం నుంచి చాలా సీట్లు వ‌చ్చినా మంత్రివర్గంలో సరైన ప్రాతినిధ్యం క‌ల్పించ‌లేదు. ఈ కార‌ణాల‌తో బీజేపీ శ్రేణుల్లో అయోమయం, అనైక్యత చోటుచేసుకుంటున్న‌ది. ఇది ఎక్క‌డ త‌మ కొంప ముంచుతుందోన‌ని బీజేపీ అధిష్ఠానం క‌ల‌వ‌ర ప‌డుతున్న‌ట్టు విశ్లేష‌కులు చెప్తున్నారు.

గిరిజ‌నుల‌పై రాహుల్ జోడో యాత్ర ప్ర‌భావం

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని బుర్హాన్‌పూర్, ఖర్గోన్, ఖాండ్వా, బర్వానీ వంటి గిరిజన జిల్లాలను భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్‌గాంధీ సందర్శించారు. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాలకు చేరుకున్నారు. వారితో మ‌మేక‌మ‌య్యారు. 230 సీట్లు ఉన్న‌ మధ్యప్రదేశ్ శాసనసభలో 47 స్థానాలు (20 శాతం) షెడ్యూల్డ్ తెగలకు (ST) రిజర్వు చేయబడ్డాయి.

రాష్ట్రంలో దాదాపు 70 నుంచి 80 స్థానాల్లో గిరిజన ఓటర్లు అధికంగా ఉన్నారు. కర్నాటకలోని 15 గిరిజన సీట్లలో ఒక్కటి కూడా బీజేపీ గెలవలేకపోయింది. అది బీజేపీకి ఆందోళన కలిగిస్తుంది. మ‌రోవైపు జై ఆదివాసీ యువ శక్తి సంఘటన్ (JAYS) మాల్వాలో ప్రభావం చూపడానికి ప్రయత్నిస్తున్న‌ది. 2013 లో 31 ఎస్టీ సీట్లు గెలుచుకున్న బీజేపీ 2018 లో 16 సీట్లకు పరిమిత‌మైంది. మ‌రోవైపు కాంగ్రెస్ బ‌లం రెట్టింపు అయింది. హ‌స్తం సీట్ల వాటా 15 నుంచి 30 కి పెరిగింది. బీజేపీ 109 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ 114 సీట్లు గెలుచుకున్న‌ది.

గిరిజన ఓటర్లు ఎంత కీలకమో గ్రహించిన బీజేపీ.. రెండేండ్లుగా వారిని మ‌చ్చిక చేసుకొనే చ‌ర్య‌లు చేప‌ట్టింది. కేంద్రంలోని ముగ్గురు కీలక వ్యక్తులు – ప్రధానమంత్రి, హోం మంత్రి, రాష్ట్రపతి ఇటీవ‌ల‌ వివిధ గిరిజన సంఘాలు నిర్వహించిన ఉత్సవాల్లో పాల్గొన్నారు. రాష్ట్రపతిగా ఒక గిరిజన మహిళను నియమించడం కూడా దేశంలోని వివిధ గిరిజన వర్గాలను మెప్పించేందుకు తీసుకున్న చ‌ర్యే అని నిపుణులు భావిస్తున్నారు. ఇంత చేసినా కర్ణాటకలోని అన్ని గిరిజన స్థానాల్లో బీజేపీ ఓడిపోయింది. కాబ‌ట్టి ఆదివాసీ జనాభా అత్యధికంగా ఉన్న మధ్యప్రదేశ్‌లో సహజంగానే బీజేపీ ఆందోళ‌న చెందుతున్న‌ది.

కాంగ్రెస్ గెలుపు ఉత్సాహం

కాంగ్రెస్ అగ్రనాయకులు అట్టడుగు స్థాయికి చేరుకోవడం ద్వారా కార్యకర్తలను ఒప్పించి, ఏకం చేస్తున్నారు. దిగ్విజయ్ సింగ్ నిరంతరం మండల స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తూ పార్టీలో సమన్వయం చేస్తున్నారు. కానీ, బీజేపీ మాత్రం ఇంకా ఈ కసరత్తు ప్రారంభించలేదు. బీజేపీ నాయకులు, కార్యకర్తలలో మరింత ఆగ్రహం ఉన్నందున దానిని చ‌ల్లార్చాల్సి ఉన్న‌ది.

బీజేపీ క్షేత్రస్థాయిలో సమన్వయం కోసం పని ప్రారంభించి ఉండాల్సింది. అయితే కాంగ్రెస్‌కు ఆధిక్యం లభించింది, ఇప్పుడు కార్యకర్తల్లో శక్తిని నింపడానికి, మధ్యప్రదేశ్‌లో కూడా విజయం సాధించడానికి కార్యకర్తలకు స్ఫూర్తిని ఇవ్వడానికి కర్ణాటక ఉదాహరణను కలిగి ఉంది. కాగా, గుజరాత్, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ అధికార వ్యవస్థలో ఎన్నో మార్పులు చేసింది. చాలా మంది ఎమ్మెల్యేలు, మంత్రులకు టిక్కెట్లు నిరాకరించింది. వయస్సు సంబంధిత నిబంధనలను ప్రవేశపెట్టింది. ఇతర మార్పులు చేసింది.

మధ్యప్రదేశ్‌లో కొత్త ప్రయోగాలు చేయడానికి లేదా తాజా మార్పులు చేయడానికి బీజేపీ వెనుక‌డుగు వేసే అవ‌కాశం ఉన్న‌ది. ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరు పేలవంగా ఉంటే వారికి టిక్కెట్లు ఇవ్వ‌క‌పోవ‌చ్చు.

రాష్ట్రాల ప్ర‌జ‌ల ఆలోచ‌న‌లు భిన్నం

సాధారణంగా ఒక రాష్ట్ర ఎన్నికల ఫలితాలు మరో రాష్ట్రంపై ప్రభావం అన్ని సంద‌ర్భాల్లో చూప‌బోవ‌ని
రాజ‌కీయ పండితుల అభిప్రాయం. లోక్‌సభ ఎన్నికల సంద‌ర్భంగా దేశవ్యాప్తంగా ఒక పార్టీ హ‌వా కొన‌సాగుతూ ఉంటుంది. కానీ, అసెంబ్లీ ఎన్నికలకు ఇది ఒకేలా ఉండదు. కర్ణాటక ఒక దక్షిణ భారత రాష్ట్రం. మధ్యప్రదేశ్ ఉత్తర భారతదేశం లేదా హిందీ బెల్ట్‌లో అంతర్భాగం. అక్క‌డ ప్ర‌జ‌ల పరిస్థితి, ఆర్థిక స్థితి, మానసిక స్థితి, సమస్యలు మధ్యప్రదేశ్‌లోని ప్రజల కంటే భిన్నంగా ఉంటాయి.

ఇక్కడ కుల, మత సమీకరణాలు, మతం, జాతీయత పట్ల ప్రజల దృక్పథం వేరు. నిరుద్యోగం, మౌలిక వసతుల లేమి వంటి ప్రాథమిక సమస్యలు అన్ని చోట్లా దాదాపు ఒకేలా ఉన్నప్పటికీ ప్రజల మనోభావాలు వేర్వేరుగా ఉంటాయి. రాజస్థాన్ లాగా, కర్ణాటక ప్రజలు ప్రతి ఐదేండ్ల‌కోసారి ప్రభుత్వాన్ని మార్చాలని కోరుకుంటారు. కానీ, మధ్యప్రదేశ్‌లో సాధారణంగా ఒకే పార్టీ ఎక్కువ కాలం అధికారంలో ఉంటుంది. గతంలో కాంగ్రెస్ ఉండ‌గా, ఇప్పుడు బీజేపీ ఉన్న‌ది.

అందువల్ల కర్ణాక‌టక ఎన్నికలు మధ్యప్రదేశ్‌పై ప్రత్యక్ష ప్రభావం చూప‌క‌పోవ‌చ్చ‌ని మ‌రికొంద‌రు విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డ్డారు. ఏది ఏమైనప్పటికీ, కర్ణాటక పరాజయం బీజేపీ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసిందని రాజకీయ విశ్లేషకులు ఏకగ్రీవంగా విశ్వ‌సించారు.