Maharashtra | ఎన్సీపీలో గందరగోళం.. పరస్పర బహిష్కరణ.. సొంత కార్యవర్గాలు
Maharashtra | తమదే అసలు పార్టీ అంటూ ప్రకటనలు పార్టీ రక్షణకు కష్టిస్తున్న శరద్‌పవార్ ముంబై: మహారాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఆదివారం జరిగిన నాటకీయ పరిణామంతో రాజకీయాలు క్షణక్షణం మారుతున్నాయి. ఆదివారం ఏకనాథ్ శిండే ప్రభుత్వంలో అజిత్‌పవార్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. షిండే ఆయనతో పాటు మరో 8 మంత్రి ఎమ్మల్యేలను మంత్రి వర్గంలో చేర్చుకున్నారు. దీంతో ఐక్యంగా ఉన్న ఎన్‌సీపీలో చీలిక ఏర్పడింది. ఒక వైపు అజిత్ పవార్ వర్గం, మరో వైపు శరద్ […]

Maharashtra |
- తమదే అసలు పార్టీ అంటూ ప్రకటనలు
- పార్టీ రక్షణకు కష్టిస్తున్న శరద్‌పవార్
ముంబై: మహారాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఆదివారం జరిగిన నాటకీయ పరిణామంతో రాజకీయాలు క్షణక్షణం మారుతున్నాయి. ఆదివారం ఏకనాథ్ శిండే ప్రభుత్వంలో అజిత్‌పవార్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. షిండే ఆయనతో పాటు మరో 8 మంత్రి ఎమ్మల్యేలను మంత్రి వర్గంలో చేర్చుకున్నారు. దీంతో ఐక్యంగా ఉన్న ఎన్‌సీపీలో చీలిక ఏర్పడింది.
ఒక వైపు అజిత్ పవార్ వర్గం, మరో వైపు శరద్ పవార్ వర్గం రెండు ఒకదానికొకటి ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి. మెజార్టీ సభ్యులు తమవైపే ఉన్నారంటూ, తమదే నిజమైన ఎన్సీపీ అని రెండు వర్గాలూ ప్రచారం చేసుకుంటున్నాయి. అజిత్ పవార్ వైపు వెళ్లిన ఎమ్మెల్యేలను శరద్ పవార్ వర్గం బహిష్కరించింది.
దీనికి బదులుగా శరద్ పవార్ వైపు ఉన్న ఎమ్మెల్యేలను బహిష్కరించినట్లు అజిత్‌వర్గం ప్రకటించింది. ఇలా ఒకరినొకరు అనర్హులుగా ప్రకటించుకుంటూ, బహిష్కరించుకుంటూ ప్రత్యేక సమావేశాలు, బల ప్రదర్శనలు చేసుకుంటున్నారు.
ఎవరికి వారే కార్యవర్గాలు
తమ తమ వర్గాలకు నూతన అధ్యక్షులను, కార్యదర్శలును ఇరు వర్గాలు నియమించుకుంటున్నాయి. తమ వైపు ఉన్న ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశాల ఏర్పాటుకు తేదీలను ప్రకటించుకున్నారు. జూలై 5న రెండు గ్రూపుల నేతలు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. వైబీ చౌహాన్ సెంటర్‌లో శరద్ పవార్ వర్గం, బంద్రాలోని మెట్ సెంటర్‌లో అజిత్ పవార్ వర్గం సమావేశాల నిర్వహణకు ఏర్పాట్లు చేసుకున్నాయి.
శరద్ పవార్ వర్గం స్టేట్ చీఫ్ విప్‌గా జితేంద్ర అవధ్‌ను నియమించగా, అజిత్ పవార్ వర్గం సునీత్ తాత్కరేను స్టేట్ చీఫ్ విప్‌గా నియమించారు. అజిత్ పవార్ ఇప్పటికీ ఎన్సీపీ జాతీయ అధ్యక్షులు శరద్ పవార్ అని చెప్పడం గమనార్హం. అయితే ఇందులో ఎంత మంది ఎమ్మెల్యేలు ఎవరి వైపు ఉన్నారో.. అసలు పార్టీ ఎవరిదో ఇంకా స్పష్టం కావడం లేదు.
అజిత్ పవార్ వర్గం మంత్రాలయానికి ఎదురుగా కొత్త కార్యాలయం ఏర్పాటు చేసుకున్నది. అయితే బుధవారం జరిగే సమావేశంలో ఎవరి బలం ఏమిటో తేలనున్నది. పార్టీని కాపాడు కోవడానికి శరద్ పవార్ వయసు, ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా ప్రయత్నిస్తున్నాడని రాజకీయ పరిశీలకులు ప్రకాశ్ అకోల్కర్ అన్నారు.
అయితే ఛగన్ భుజ్‌బల్, అజిత్ పవార్‌లు శరద్ పవార్ రాజకీయ నేతృత్వంలోనే నాయకులుగా ఎదిగారన్నారు. అయితే వారు నేడు తమకు శరద్ పవార్ అవసరం లేదని అభిప్రాయ పడుతున్నారని అన్నారు.