Manchiryala | బెల్లంపల్లిలో అభివృద్ధి ప‌నుల‌ను ప్రారంభించిన మంత్రి KTR

Manchiryala విధాత, ప్రతినిధి అదిలాబాద్: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సింగరేణి కార్మిక క్షేత్రంలో నలుగురు మంత్రులు పర్యటించారు. నియోజకవర్గంలో ఐటీ మున్సిపల్ శాఖ మాత్యులు కేటీఆర్, హోంశాఖ మంత్రి మహమ్మద్ అలీ, ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, వృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, అటవీ, దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటించి పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలను చేశారు. బెల్లంపల్లి నియోజకవర్గంలోని కాసిపేట మండలం దేవపూర్ లో ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీ 2 వేల కోట్లతో నాలుగో […]

Manchiryala | బెల్లంపల్లిలో అభివృద్ధి ప‌నుల‌ను ప్రారంభించిన మంత్రి KTR

Manchiryala

విధాత, ప్రతినిధి అదిలాబాద్: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సింగరేణి కార్మిక క్షేత్రంలో నలుగురు మంత్రులు పర్యటించారు. నియోజకవర్గంలో ఐటీ మున్సిపల్ శాఖ మాత్యులు కేటీఆర్, హోంశాఖ మంత్రి మహమ్మద్ అలీ, ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, వృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, అటవీ, దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటించి పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలను చేశారు.

బెల్లంపల్లి నియోజకవర్గంలోని కాసిపేట మండలం దేవపూర్ లో ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీ 2 వేల కోట్లతో నాలుగో ప్లాంట్ విస్తరణ పనులకు మంత్రి కేటీఆర్ శిలాఫలకం ఆవిష్కరించారు. బెల్లంపల్లిలో 355 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లకు మంత్రి కేటీఆర్ భూమిపూజ చేశారు. 114 కోట్ల 89 లక్షల అభివృద్ధి పనులకు నేడు భూమి పూజ చేశారు. అలాగే బెల్లంపల్లిలోని ఏఎంసీ మైదానంలో సింగరేణి స్థలంలో ఏళ్ల తరబడి నివాసం ఉంటున్న కార్మిక కార్మికేతరులకు 7 వేల ఇళ్లపట్టాల పంపిణీ చేశారు.

అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ…. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రాంతంలో అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ హయాంలో కరెంటు ఉంటే వార్త అని కానీ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో నేడు కరెంటు పోతే వార్త అని పేర్కొన్నారు. నాడు కాంగ్రెస్ హయాంలో 9 గంటల కరెంటు ఇస్తే అది ఎప్పుడు వచ్చేది ఎప్పుడు పోయేది తెలియదని రైతులు ఆవేదన చెందేవారని పేర్కొన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు కల్లబొల్లి మాటలతో వస్తున్నారని ఇప్పుడేదో ఉద్ధరిస్తామని 55 ఏళ్లు అభివృద్ధి చేయని నాయకులు ఇప్పుడు ఏం చేశారని ఎద్దేవ చేశారు.

కాంగ్రెస్ పార్టీ చివరి దశలో ఐసీయూలో వెంటి లెటర్ పై ఉందని వారి మాటలు నమ్మొద్ద‌ని పేర్కొన్నారు.
మరో పార్టీ బిజెపి గత ఎన్నికల్లో సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఈ 9 సంవత్సరాలు కాలంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించారు. బిజెపి అధికారంలోకి వస్తే జెన్ ధన్ ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తామని చెప్పి ఇప్పటివరకు ఎన్ని వేశారని ప్రశ్నించారు. బిజెపి పార్టీ ప్రజలను లక్షాధికారిని చేయలేదని కానీ మోడీ ప్రియ మిత్రుడు అయిన అదానికి మాత్రం కోట్ల రూపాయల మేలు చేశారని పేర్కొన్నారు.

కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు గ్యాస్ సిలిండర్ కు 400 రూపాయలు ఉంటే బిజెపి అధికారంలోకి వస్తే రేటు తగ్గిస్తామని చెప్పి 400 రూపాయలు ఉన్న గ్యాస్ నేడు 1200 పెంచిందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బిజెపికి నలుగురు ఎంపీలను గెలిపిస్తే సింగరేణిలో నాలుగు బొగ్గు బావులను వేలం పాటలో పెట్టారని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ మంచిదో ఏ పార్టీ అభివృద్ధి చేస్తుందో ఆలోచించి ఓటు వేయాలని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను మూడోసారి అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత మీదే అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు దివాకర్ రావు రేఖా నాయక్ కోనేరు కోనప్ప ఆసిఫాబాద్ జడ్పీ చైర్మన్ కోవలక్ష్మి మంచిర్యాల జెడ్పీ చైర్మన్ నల్లాల భాగ్యలక్ష్మి టిఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.