ఆళ్ల అడుగులు అటువైపేనా?

గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా నిర్ణయం ఏపీలో సంచలనంగా మారింది. ఆయన ఎమ్మెల్యే పదవికి స్పీకర్‌ ఫార్మాట్‌లోనే రాజీనామా చేశారు

ఆళ్ల అడుగులు అటువైపేనా?
  • ఏపీలో సంచలనం రేపిన మంగళగిరి ఎమ్మెల్యే రాజీనామా
  • చాలాకాలంగా జగన్‌పై అసంతృప్తితో!
  • రెండు పర్యాయాలుగా దక్కని మంత్రిపదవి
  • పార్టీలోనూ ప్రాధాన్యం కొరవడిందనే ప్రచారం
  • ఏపీని ప్రభావితం చేయనున్న తెలంగాణ ఫలితాలు
  • కాంగ్రెస్‌తోనే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందనే ప్రచారంలో ఆ పార్టీ నేతలు
  • ఆళ్ల కూడా కాంగ్రెస్‌లోనే చేరే అవకాశం!

విధాత ప్రత్యేకం: గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా నిర్ణయం ఏపీలో సంచలనంగా మారింది. ఆయన ఎమ్మెల్యే పదవికి స్పీకర్‌ ఫార్మాట్‌లోనే రాజీనామా చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ సభ్యత్వాన్నీ వదులుకున్నారు. ఆళ్ల తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పటికిప్పుడు తీసుకున్నది కాదని ఆయన అనుచరులు చెబుతున్నారు. వైసీపీ అధినేత జగన్‌పై చాలాకాలంగా ఆళ్ల అసంతృప్తితో ఉన్నారని సమాచారం. 2014, 2019లో వరుసగా రెండుసార్లు మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. మంత్రి పదవి ఆశించారు. కానీ ఆయనకు ఆ అవకాశం రాలేదు. పార్టీ పదవుల విషయంలోనూ తగిన ప్రాధాన్యం తమ నేతకు దక్కలేదని ఆయన అనుచరులు ఆగ్రహంతో ఉన్నారు. చాలాకాలంగా ఆళ్ల పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా నాలుగు నెలల సమయం మాత్రమే ఉన్నదని, ఈ సమయంలో ఆళ్ల తీసుకున్నపార్టీకి నష్టం చేస్తుందని నాయకులు, కార్యకర్తలు అంటున్నారు.

అందుకే రాజీనామా?

ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి వ్యతిరేకంగా తాడేపల్లి నగర అధ్యక్షుడు దొంతిరెడ్డి వేమారెడ్డి ఆదివారం వైసీపీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇప్పటికే మంగళగిరిలో ఎమ్మెల్యే ఆళ్ల కార్యాలయం ఉన్నది. ఒకే పార్టీకి చెందిన ఇద్దరు నేతలు కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. వేమారెడ్డి ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్నిఆప్కో మాజీ చైర్మన్‌ గంజి చిరంజీవి ప్రారంభించడం విశేషం. కార్యకర్తలకు చేరువ కావడానికి నూతన కార్యాలయం ప్రారంభించామని చెబుతున్నా, ఇరువర్గాల మధ్య విభేదాలే కారణమని ఆళ్ల రాజీనామాతో స్పష్టమైందని పరిశీలకులు అంటున్నారు. ఆర్కే రాజీనామాకు ముందే మంగళగిరి వైసీపీ ఇన్‌చార్జ్‌గా గంజి చిరంజీవికి బాధ్యతలు అప్పగించింది. ఇదే ఆర్కే అసంతృప్తికి కారణమైందని అంటున్నారు. పొమ్మనలేక పొగ పెట్టిందనేందుకు కొంతకాలంగా నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలే నిదర్శనమని చెబుతున్నారు.

ఆళ్ల అడుగులు ఎటు?

ఎమ్మెల్యే స్పీకర్‌ ఫార్మాట్‌లోనే రాజీనామా చేశానని చెబుతున్నా దానిపై స్పీకర్‌దే తుది నిర్ణయం. వైఎస్‌ఆర్‌టీపీ తెలంగాణలో ఎన్నికలకు దూరంగా ఉన్నది. ఎన్నికలకు ముందే షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారనే వార్తలు వచ్చాయి. అప్పుడే ఆమెకు ఏపీ కాంగ్రెస్‌ బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం కూడా జరిగింది. తాజాగా ఆర్కే రాజీనామా ఉదంతంతో మళ్లీ ఒకసారి ఆ చర్చ మొదలైంది. ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరుతారని నియోజకవర్గంలో చర్చించుకుంటున్నారు. కర్ణాటక, తెలంగాణ ఫలితాలు ఏపీలో కాంగ్రెస్‌ నేతలు, శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపాయని, విభజన వల్ల నష్టపోయిన ఏపీకి కాంగ్రెస్‌ మాత్రమే న్యాయం చేస్తుందని అక్కడి నేతలు ఇప్పటికే ప్రచారాన్ని మొదలుపెట్టారు. కేంద్రంలో ఉన్న బీజేపీ పదేళ్లుగా ఏపీకి చేసింది ఏమీ లేదని, అలాగే రాష్ట్రంలో ఐదేళ్లు పాలించిన టీడీపీ, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం కూడా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేదని అందుకే ఈసారి తమకు అవకాశం ఇవ్వాలని అక్కడి కాంగ్రెస్‌ నేతలు ప్రజలు కోరుతున్నారు.


తెలంగాణ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన హామీల వలే ఏపీ ప్రజలకు కూడా హామీలు ఇస్తుందని, రానున్న రోజుల్లో దీనికి సంబంధించిన ఒక ప్రణాళికను ప్రజల ముందు పెడుతారని అంటున్నారు. వైసీపీకి రాజీనామా చేసిన ఆళ్లకు కాంగ్రెస్‌ మినహా మరో ఆప్షన్‌ లేదంటున్నారు. ఎందుకంటే అక్కడి నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పోటీ చేస్తారు. వైపీసీ ఇప్పటికే గింజి చిరంజీవికి బాధ్యతలు అప్పగించినందున వైసీసీ అభ్యర్థి ఆయనే కావొచ్చు. ఇక ఏపీలో బీజేపీకి బలం లేదు. ఆపార్టీని అక్కడి ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు. అందుకే అన్ని ఆలోచించిన ఆళ్ల కాంగ్రెస్‌వైపే అడుగులు వేస్తారని సమాచారం.