Maoists | ఇంటికి వస్తారా.. ఆ ముగ్గురికి పోలీసు శాఖ పిలుపు..! ఉనికి కోసం మావోల ఆరాటం..!
Maoists విధాత: పోరాటాల గడ్డగా.. విప్లవాల ఖిల్లాగా ఖ్యాతినొందిన ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మావోయిస్టు ఉద్యమ ప్రస్థానం గతమెంతో ఘనం అన్నట్లుగా సాగి ప్రస్తుతం ఉనికిలో కూడా లేకుండా పోయింది. ఛత్తీస్ ఘఢ్ దంతేవాడలో తాజాగా మావోయిస్టులు(Maoists) ఐఈడి బాంబుతో పోలీసు వాహనాన్ని పేల్చి 11 మంది పోలీసులను బలిగొన్న ఘటన మరోసారి మావోయిస్టు పార్టీ కార్యకలాపాల తీరుతెన్నులపై చర్చలను రేకెత్తించింది. ప్రస్తుతం ఉమ్మడి నల్గొండ జిల్లా నుం ముగ్గురు మావోయిస్టులు అజ్ఞాత దళాల్లో పనిచేస్తుండగా వారు […]

Maoists
విధాత: పోరాటాల గడ్డగా.. విప్లవాల ఖిల్లాగా ఖ్యాతినొందిన ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మావోయిస్టు ఉద్యమ ప్రస్థానం గతమెంతో ఘనం అన్నట్లుగా సాగి ప్రస్తుతం ఉనికిలో కూడా లేకుండా పోయింది. ఛత్తీస్ ఘఢ్ దంతేవాడలో తాజాగా మావోయిస్టులు(Maoists) ఐఈడి బాంబుతో పోలీసు వాహనాన్ని పేల్చి 11 మంది పోలీసులను బలిగొన్న ఘటన మరోసారి మావోయిస్టు పార్టీ కార్యకలాపాల తీరుతెన్నులపై చర్చలను రేకెత్తించింది.
ప్రస్తుతం ఉమ్మడి నల్గొండ జిల్లా నుం ముగ్గురు మావోయిస్టులు అజ్ఞాత దళాల్లో పనిచేస్తుండగా వారు కూడా చత్తీస్ ఘడ్, తెలంగాణ, ఒరిస్సా సరిహద్దుల్లోని దక్షిణ బస్తర్- దండకారణ్య కారిడార్ ప్రాంతంలోనే పనిచేస్తుండటం ఆసక్తికరం. జిల్లాలోని చండూరు మండలం పుల్లెంలకు చెందిన పాక హనుమంతు అలియాస్ రాజేష్ తివారి, యూకే గణేష్ 1983 నుండి అజ్ఞాతంలో కొనసాగుతున్నాడు.
బీఎస్సీ చదువుతూ మధ్యలో మావోయిస్టు పార్టీలోకి వెళ్లిన హనుమంతు ప్రస్తుతం 62 ఏళ్ల వయసులో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా వెస్ట్ బస్తర్ డివిజన్ చత్తిస్ ఘడ్ దండకారణ్య సౌత్ రీజనల్ యూనిఫాయిడ్ కమాండెంట్ సెక్రటేరియట్ మెంబర్ గా పని చేస్తున్నారు. ఆయనపై 20 లక్షల రివార్డును పోలీస్ శాఖ ప్రకటించింది. చిట్యాల మండలం ఉరుమడ్లకు చెందిన మందుగుల భాస్కరరావు 1991 నుండి అజ్ఞాతంలో కొనసాగుతున్నారు.
బీఎస్సీ చదువుతూ మధ్యలో మావోయిస్టు పార్టీలోకి వెళ్లిన భాస్కరరావు ప్రస్తుతం 65 ఏళ్ల వయసులో మావోయిస్టు పార్టీ ఛత్తీస్ ఘడ్ డిసిఎస్, దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్నారు. ఆయనపై ఎనిమిది లక్షల రివార్డు కొనసాగుతుంది. గుర్రంపోడు మండలం చామలోని బావి వట్టికోడ్ కి చెందిన పన్నాల యాదయ్య అలియాస్ గన్ మెన్ 2004 నుండి అజ్ఞాతంలో కొనసాగుతున్నారు.
పదవ తరగతి చదివిన యాదయ్య ప్రస్తుతం 60 ఏళ్ల వయసులో దళ సభ్యుడిగా మావోయిస్టు పార్టీ దండకారణ్యంలో పనిచేస్తుండగా, అతనిపై ఒక లక్ష రివార్డు కొనసాగుతుంది. చిత్రంగా ఆ ముగ్గురిపై కూడా పోలీసు రికార్డుల్లో 2012లో ప్రకటించిన రివార్డులు, రికార్డులే కొనసాగుతుండడం గమనార్హం.
ప్రస్తుతం హనుమంతు, భాస్కరరావు, యాదయ్యల వయస్సు 60 ఏళ్లకు పైబడిన నేపథ్యంలో వారు మావోయిస్టు పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనడం కష్టతరమే నని పోలీసు శాఖ భావిస్తుంది.
ఆధునిక సాంకేతిక యుగంలో ఆచరణ సాధ్యం కాని సిద్ధాంతాలను అనుసరిస్తూ, అజ్ఞాత పోరాటాలతో, హింసాత్మక మార్గంలో సాగడం అవివేకమని వయసు మీద పడిన మావోలు ఇకనైనా తమ కుటుంబాల కోసం లొంగిపోవాలని పోలీస్ శాఖ కోరుతుంది.
ఉనికి కోసం ఆరాటం.. కరువైన ప్రభావం
తెలుగు రాష్ట్రాల్లో పీపుల్స్ వార్ పార్టీగా ప్రస్థానాన్ని ప్రారంభించి మావోయిస్టు పార్టీగా ఎదిగి ప్రజల్లో తమ గెరిల్లా ఉద్యమ కార్యచరణతో బలమైన ప్రాబల్యం చాటిన నక్సలైట్ ఉద్యమం ప్రస్తుతం ఉనికి కోసం ఆరాటంతో కూడిన పోరాటాలకే పరిమితమైన దీనస్థితికి చేరుకుంది. మాజీ ముఖ్యమంత్రి మరి చెన్నారెడ్డి హాయంలో తెలుగు రాష్ట్రాల్లో బలం పూంజుకున్న నక్సల్స్ ఉద్యమం దివంగత వైయస్సార్ ప్రభుత్వ హాయాంలో శాంతి చర్చల దాకా అప్రతిహతంగా సాగింది.
2004లో ప్రభుత్వానికి మావోయిస్టుల(Maoists)కు మధ్య చర్చలు ఉద్యమాన్ని మలుపు తిప్పాయి. ఆ చర్చలు విఫలమైనప్పటికి, కాల్పుల విరమణ సమయంలో మావోయిస్టు పార్టీ బలపడింది. మావోయిస్టులు పోలీసులపై పదేపదే దాడులు చేయడం.. పోలీసులు కూడా ఎదురుదాడులతో మావోయిస్టులను గట్టి దెబ్బతీయడం సాగింది.
కేంద్ర కమిటీ లోని ముఖ్యమైన నాయకులు ఎన్ కౌంటర్ల లో చనిపోవడం, కొందరు లొంగిపోవడం వంటి పరిణామాలతో ఉద్యమం బలహీన పడింది. 2005 నాటికి ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమం 2010 నాటికి చప్పబడింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని మావోయిస్టుల కంటే పోలీసులు సమర్థంగా వినియోగించుకున్నారు.
నల్లమల, శేషాచలం, ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో నక్సలైట్ల స్థావరాలు గుట్టుమట్లు, వాళ్లు సంచరించే మార్గాల ఆసుపాసులు పోలీస్ శాఖ పసిగట్టింది. చర్చలు విఫలమయ్యాక ఒక్కసారిగా అణిచివేత చర్యలు ఊపందుకున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ భద్రతా దళాలు, గ్రేహౌండ్స్ వంటి ప్రత్యేక బలగాలు, గ్రీన్ గ్రీన్ హంట్, కోవర్ట్ ఆపరేషన్ లతో, కరువైన రిక్రూట్ మెంట్లతో, లొంగుబాట్లతో, వరుస ఎన్ కౌంటర్లతో మావోయిస్టు అణిచివేత చర్యలు ముమ్మురంగా సాగాయి.
దీంతో మావోయిస్టు పార్టీ తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా బలహీన పడుతూ వచ్చింది. మధ్యలో ఏఓబి లో బలిమెల జలాశయంలో 2008 జూన్ లో భద్రతా దళాల పై మావోలు జరిపిన దాడిలో 38 మంది సిబ్బంది మృతి చెందారు. 2010లో దక్షిణ బస్తర్ లో 75 మంది జవాన్లు మావోల దాడిలో అసువులు బాసారు. 2017లో సుక్మా జిల్లా బుర్కాపూర్ లో 25 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను బలిగొన్నారు.
2020 మార్చిలో సుకుమార్ జిల్లా నింపాలో 17 మంది జవాన్లు మా వాళ్ళ దాడిలో హతమయ్యారు. 2021 ఏప్రిల్ లో బీజాపూర్ జిల్లా లో మందు పాతర పేల్చి 21 మంది భద్రతా సిబ్బందిని హతమార్చారు. ప్రస్తుతం భౌగోళిక అనుకూలత ఆసరాగా ఏవోబి, చత్తీస్ ఘడ్ దండకారణ్య ప్రాంతాలకు పరిమితమై పోలీసు బలగాలతో పోరాడుతుంది. ఈ క్రమంలోనే ఈనెల 26న చత్తీస్ ఘడ్ దంతేవాడ అరుణ్ పూర్ లో మావోల దాడిలో 11 మంది డిఆర్జి సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.
కాగా గత దశాబ్ద కాలంలో మావోయిస్టుల దాడులు కేంద్ర ప్రభుత్వం నివేదిక మేరకు 77శాతం తగ్గిన తీరు వామపక్ష తీవ్రవాద ఉద్యమ క్షిణతకు నిదర్శనం. కొండపల్లి సీతారామయ్య మొదలు ముప్పాల లక్ష్మణరావు(గణపతి), నంబాల కేశవరావు, ఆర్కే ,సుధాకర్, గాజర్ల రవి(గణేష్), చలపతి, శాఖమూరి అప్పారావు, టెక్కలపల్లి వాసుదేవరావు, మల్లోజుల కోటేశ్వరరావు(కిషన్ జి), జిలుగు నరసింహారెడ్డి (జంపన్న), బెల్లం నారాయణస్వామి (దామోదర్), మాధవ్, కటకం సుదర్శన్, రాజిరెడ్డి, కడారి సత్యనారాయణ, భానుడి వెంకటరమణ, టెక్ రమణ, సాంబశివుడు, దుబాసి శంకర్, పటేల్ సుధాకర్ రెడ్డి, ఆజాద్, రాజమౌళి, నల్ల ఆదిరెడ్డి, సంతోష్ రెడ్డి, శీలం నరేష్, హరి భూషణ్(జగన్) వంటి నేతలు మావోయిస్టు పార్టీలో కీలకంగా వ్యవహరించారు. వారిలో కొందరు ఎన్ కౌంటర్లలో హతమవ్వగా, మిగిలిన వారు ఇప్పటికి ఆ పార్టీలో కీలక స్థానాల్లో కొనసాగుతున్నారు. వారిలో వారిలో చాలామంది వయో భారం, అనారోగ్యాలతో సతమతమవుతున్నారు.
2004 నాటికి మైదాన ప్రాంతాల్లోను విస్తరించిన మావోలు ఆనాటి ప్రభుత్వంతో చర్చలు విఫలమైన వెంటనే పెరిగిన అణిచివేతతో 2005లో 163 మంది మావోయిస్టులు పోలీస్ కాల్పుల్లో చనిపోయారు. 2006లో 139 మరణించారు. 2016లో మల్కన్ గిరి జిల్లా బెజ్జంకి ఎన్ కౌంటర్ లో 29 మంది మృతితో ఆ ఏడాది కూడా 50 మందికి పైగా, 2018లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా పూజారి కాంకేడు గ్రామం ఎన్ కౌంటర్ తో 11 మందిని కోల్పోయింది.
మావోల కార్యకలాపాలు క్రమంగా ఉత్తర తెలంగాణ అడవులు, నల్లమల, శేషాచలం అడవుల నుండి కూడా కనుమరుగై ప్రస్తుతం బస్తార్-దండకారణ్య ప్రాంతానికి పరిమితమయ్యాయి. ఒకప్పుడు 2004లో వైయస్సార్ ప్రభుత్వ హయాంలో చర్చల సమయంలో తెలుగు రాష్ట్రాలలో మావోయిస్టు గెరిల్లా సభ్యుల సంఖ్య 1000 మంది వరకు ఉండగా నేడు 150మందికి అటు ఇటుగా తగ్గిపోయింది. 2004 నుండి జరిగిన ఎన్ కౌంటర్లలో 70మందికి పైగా కేంద్ర, రాష్ట్ర పార్టీ అగ్ర నాయకులను కోల్పోయింది.
2013 నుండి మావోయిస్టు కార్యకలాపాలు చత్తీస్ ఘడ్ , ఒరిస్సా, మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో మాత్రమే సాగుతున్నాయి. తెలంగాణలో ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ వంటి సరిహద్దు జిల్లాలలో మావోల కార్యకలాపాలు అడపాదడప వెలుగు చూస్తున్నాయి. ఒరిస్సా- ఛత్తీస్ ఘడ్ ప్రాంతాల్లో తలదాచుకుంటూ తెలంగాణ సరిహద్దు జిల్లాల్లోకి వచ్చి వెళుతూ ఉనికి చాటుతున్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో మావోయిస్టు ఉద్యమ ప్రస్థానం ఆలేరు, కృష్ణపట్టి, కనగల్, రాచకొండ దళాల కార్యకలాపాలతో పాతికేళ్లపాటు ఉధృతంగా సాగింది. హోంశాఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి, ఎమ్మెల్యే రాగ్యానాయక్ హత్యలతో పాటు పలు పార్టీల నాయకులను, ఇన్ఫార్మర్లను హత్యలు చేసి, పలు పోలీస్ స్టేషన్లను, రైల్వే స్టేషన్లను, ప్రభుత్వ కార్యాలయాలను పేల్చివేసి రాజకీయ వర్గాలకు, పోలీస్ శాఖకు కంటిమీద కునుకు లేకుండా చేశారు.
పెరిగిన పోలీసు నిర్బంధాలు, విస్తరించిన సాంకేతిక పరిజ్ఞానం, వరుస ఎన్ కౌంటర్ల ఎదురు దెబ్బలు, కోవర్ట్ ఆపరేషన్లు, నయీమ్ ముఠా వేట, రిక్రూట్మెంట్ల కరువుతో జిల్లా పరిధిలో మావోయిస్టు పార్టీ పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది.
జిల్లా నుంచి వలిగొండ మండలం కోనాపూరి ఐలయ్య అలియాస్ సాంబశివుడు, చామల కిష్టయ్య అలియాస్ దయాలు ఏపీ, ఏవోబి రాష్ట్ర కార్యదర్శులుగా పనిచేశారు. వారిలో సాంబశివుడు, ఆయన సోదరుడు రాములు నయీమ్ ముఠా చేతిలో హతమవ్వగా, దయా ఎన్ కౌంటర్లో మరణించాడు.
మావోయిస్టు పార్టీ పాతికేళ్ల ఉద్యమ ప్రస్థానంలో ఉమ్మడి జిల్లాకు చెందిన 82 మంది మావోయిస్టులు చనిపోగా, వారిలో అత్యధికంగా వలిగొండ మండలం నుండి 13 మంది పార్టీ గెరిల్లా దళాల్లో వివిధ హోదాల్లో పనిచేస్తూ ప్రాణాలు వదిలారు.
జిల్లాకు చెందిన 178 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వారితో పాటు మిలిటెంట్లుగా, కొరియర్లుగా, సానుభూతిపరులుగా మరో 1700 మంది వరకు పార్టీ కార్యకలాపాల్లో భాగస్వామ్యమై కేసుల పాలయ్యారు. ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న ముగ్గురు పాక హనుమంతు, మందుగుల భాస్కరరావు, పన్నాల యాదయ్యలు సైతం ఇతర రాష్ట్రాల గెరిల్లా దళాల్లో పనిచేస్తుండడంతో ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో మావోయిస్టుల ఉనికి పూర్తిగా లేకుండా పోయింది.