జైల్లో మసాజ్.. అతను ఫిజియో కాదు.. ఖైదీ: జైలు అధికారులు

స్ప‌ష్టం చేసిన‌ తీహార్ జైలు అధికారులు అయినా ఫిజియోథెర‌పీ అంటున్న ఆప్‌ మంత్రి ప‌ద‌వి తొల‌గించాల‌ని బీజేపీ డిమాండ్‌ విధాత: తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ ఆప్ మంత్రి సత్యేందర్ జైన్‌కు జైల్లోనే మసాజ్ చేస్తున్న వీడియో ఇటీవ‌ల వైరల్ అయింది. అయితే ఇది ఫిజియోథెరఫీ అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఇచ్చిన వివరణ కొత్త మలుపు తిరిగింది. తీహార్ జైలులో మసాజ్ వీడియోలో ఉన్నది ప్రొఫెషనల్ ఫిజియోథెరపిస్ట్ కాదని, రేప్ కేసులో ఖైదీ అని […]

  • By: krs    latest    Nov 22, 2022 10:33 AM IST
జైల్లో మసాజ్.. అతను ఫిజియో కాదు.. ఖైదీ: జైలు అధికారులు
  • స్ప‌ష్టం చేసిన‌ తీహార్ జైలు అధికారులు
  • అయినా ఫిజియోథెర‌పీ అంటున్న ఆప్‌
  • మంత్రి ప‌ద‌వి తొల‌గించాల‌ని బీజేపీ డిమాండ్‌

విధాత: తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ ఆప్ మంత్రి సత్యేందర్ జైన్‌కు జైల్లోనే మసాజ్ చేస్తున్న వీడియో ఇటీవ‌ల వైరల్ అయింది. అయితే ఇది ఫిజియోథెరఫీ అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఇచ్చిన వివరణ కొత్త మలుపు తిరిగింది. తీహార్ జైలులో మసాజ్ వీడియోలో ఉన్నది ప్రొఫెషనల్ ఫిజియోథెరపిస్ట్ కాదని, రేప్ కేసులో ఖైదీ అని తీహార్ జైలులోని అధికారిక వర్గాలు తెలిపాయి,

“సత్యేంద్ర జైన్‌కు మసాజ్ చేస్తున్న రింకు S/o తారాచంద్ అనే ఖైదీ అత్యాచారం కేసులో ఖైదీగా ఉన్నాడని, అతనిపై జెపి కలాన్ పోలీస్ స్టేషన్‌లో పోక్సో సెక్షన్ 6, IPC 376, 506 & 509 కింద అభియోగాలు (ఎఫ్‌ఐఆర్ నం. 121/2021) న‌మోదైనట్లు జైలు అధికారులు స్ప‌ష్టం చేశారు.

మాట‌ల యుద్ధానికి దారి చూపిన‌ మ‌సాజ్ వీడియో

ఈ మ‌సాజ్ వీడియో బీజేపీ, ఆప్ పార్టీల మ‌ధ్య మాట‌ల యుద్ధానికి తెర‌లేపింది. ప‌ర‌స్ప‌రం ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌లు చేసుకుంటూ ఈ విష‌యాన్ని నిత్యం వార్త‌ల్లో ఉంచేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. జైలు అధికారులు మ‌సాజ్ చేసింది రేప్ కేసులో శిక్ష అనుభ‌విస్తున్న ఖైదీ అని స్ప‌ష్టం చేసినా, ఆప్‌ మంత్రులు గోపాల్ రాయ్‌, మ‌నీష్‌కుమార్ సిసోడియాలు మాత్రం మంత్రి మ‌సాజ్ వీడియో కేవ‌లం ఫిజియో థెర‌ఫీనే అంటూ ఇప్ప‌టికీ చెబుతున్నారు.

‘అమిత్‌ షా గుజరాత్‌లో జైలుకు వెళ్లినప్పుడు ఆయన కోసం ప్రత్యేక జైలును నిర్మించారని, సీబీఐ రికార్డుల్లో ఉంది. ప్రపంచంలో మరెవరికీ జైలులో ఇంత ప్రత్యేకత లభించలేదు. కానీ ఇప్పుడు సమస్య సత్యేందర్ జైన్ మ‌సాజ్ కాదు. MCD ఎన్నికల్లో ఆప్‌ని గెలిపించాలని ఢిల్లీ ప్రజలు నిర్ణయించుకున్నారు, డిసెంబర్ 4న జరిగే ఎన్నికల్లో BJP ఓడిపోబోతుంది. అందుకే ఇదంతా జరుగుతోంది.” అంటూ ఢిల్లీ మంత్రి, ఆప్‌ నేత గోపాల్‌ రాయ్ ఆరోపించారు.

ఆప్‌.. స్పా అండ్ మ‌సాజ్ పార్టీ

స‌త్యేంద‌ర్ జైన్ జైల్లో మసాజ్ చేయించుకోవడం, సెల్ లోపల ముగ్గురు, న‌లుగురు వ్యక్తులతో చర్చలు జరుపుతున్న వీడియో వైరల్ కావడంతో బీజేపీ ఆప్ పార్టీపై విమ‌ర్శ‌ల దాడి చేసింది. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర ఆప్‌ని “స్పా అండ్ మసాజ్ పార్టీ” అని అభివ‌ర్ణించారు. మనీలాండరింగ్ కేసులో జైలులో ఉన్న తమ “అవినీతి” మంత్రికి ఆప్ పార్టీ ప్రత్యేక ట్రీట్‌మెంట్ ఇస్తోందని, జైన్‌ జైలులోనే అవినీతికి పాల్పడుతున్నారని, ఆయనను మంత్రి పదవి నుంచి భ‌ర్తరఫ్‌ చేయాలని బీజేపీ డిమాండ్‌ చేసింది.

జైన్‌కు మ‌ద్ద‌తుగా ఢిల్లీ ఉప ముఖ్య‌మంత్రి
ఈ విష‌యంలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జైన్‌కు మద్దతుగా నిలిచారు. రాబోయే న‌గ‌ర‌పాల‌క సంస్థ ఎన్నిక‌ల్లో ఓట్లు పొందేందుకు బీజేపీ చౌకబారు వ్యూహాలకు దిగుతోంద‌ని ఆరోపించారు. “ఇది మసాజ్ వీడియో కాదు, ఇది ఫిజియోథెరపీ, ఎందుకంటే జైన్ జైలులో పడి అతని వెన్నెముకకు గాయమైంది. అతనికి రెండు సర్జరీలు జరిగాయి, వైద్యులు ఫిజియోథెరపీని సిఫార్సు చేశారు, ”అని చెప్పుకొచ్చాడు సిసోడియా.

కేజ్రీవాల్ రాజీనామాకు బీజేపీ డిమాండ్‌

మంత్రి సత్యేందర్ జైన్ జైలు గదిలో మసాజ్ చేయించుకుంటున్నట్లు చూపుతున్న సీసీ టీవీ ఫుటేజీ వివాదం కొత్త మలుపు తిరిగింది. ‘మసాజర్’ ప్రొఫెషనల్ ఫిజియోథెరపిస్ట్ కాదని, అత్యాచారం కేసులో ఖైదీ అని జైలు వ‌ర్గాలు చెప్పిన నేప‌థ్యంలో ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ త‌న‌ ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని బీజేపీ డిమాండ్ చేసింది.

అంతేకాదు, జైలుకెళ్లిన ఆప్ మంత్రి సత్యేందర్ జైన్ మసాజ్ వీడియో వివాదంపై ఫిజియోథెర‌ఫీ అంటూ బుకాయించిన‌ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని బీజేపీ నాయకుడు గౌరవ్ భాటియా డిమాండ్ చేశారు. సత్యేందర్ జైన్ ఇకపై మంత్రి పదవిని చేపట్టకూడదని, సత్యేందర్ జైన్‌ను భ‌ర్తరఫ్ చేయ‌లేనంత బలహీనంగా ఉంటే, కేజ్రీవాల్‌ సీఎం పదవికి రాజీనామా చేయాలని భాటియా డిమాండ్ చేశారు.