ఆన్‌లైన్‌లో 2600 కోట్ల రికార్డులు లీక్‌..చ‌రిత్ర‌లో అతి పెద్ద డేటాలీక్

సైబ‌ర్ సెక్యూరిటీ రంగంలో అతి పెద్ద డేటాలీక్‌గా భావిస్తున్న ఉదంతం తాజాగా వెలుగులోకి వ‌చ్చింది

  • By: Somu    latest    Jan 23, 2024 10:22 AM IST
ఆన్‌లైన్‌లో 2600 కోట్ల రికార్డులు లీక్‌..చ‌రిత్ర‌లో అతి పెద్ద డేటాలీక్

సైబ‌ర్ సెక్యూరిటీ (Cyber Security) రంగంలో అతి పెద్ద డేటాలీక్‌గా భావిస్తున్న ఉదంతం తాజాగా వెలుగులోకి వ‌చ్చింది. ఈ ఘ‌ట‌న‌లో కనీసం 2600 కోట్ల రికార్డులు లీక్ అయ్యాయ‌ని తెలుస్తోంది. ఏ మాత్రం సెక్యూరిటీ లేని.. ఓ థ‌ర్డ్ పార్టీ డేటాబేస్‌లో వీటిని కొనుగొన్న‌ట్లు ఫోర్బ్స్ (Forbes) క‌థ‌నం వెల్ల‌డించింది. ఈ క‌థ‌నానికి ఆ ప‌త్రిక మ‌ద‌ర్ ఆఫ్ ఆల్ బ్రీచెస్ అనే పేరును పెట్ట‌డం గ‌మ‌నార్హం. ఈ రికార్డుల్లో ట్విట‌ర్‌, డ్రాప్‌బాక్స్‌, లింక్డిన్ వినియోగ‌దారుల పూర్తి వివ‌రాలు ఉన్నాయ‌ని తెలుస్తోంది.


సెక్యూరిటీ డిస్క‌వ‌రీ, సైబ‌ర్ న్యూస్ అనే రెండు సంస్థ‌లు ఈ డేటా లీక్‌ను క‌నుగొన‌గా.. ఆ స‌మాచారం మొత్తం ప‌రిమాణం 12 టెరాబైట్లుగా తేలింద‌ని ఫోర్బ్స్ పేర్కొంది. ఎవ‌రో ఒక డేటా బ్రోక‌ర్‌… ఈ ప‌న చేసిన‌ట్లు సైబ‌ర్ నిపుణులు భావిస్తున్నారు. దుండ‌గులు ఇంత విస్తృత స‌మాచారాన్ని దొంగ‌లించ‌డం వెనుక భారీ మోసాల‌కు పాల్ప‌డే కుట్ర ఉంటుంది. వారు ఈ డేటాను సైబ‌ర్ మోసాల‌కు ఉప‌యోగించుకుంటారు.


అత్యాధునిక‌మైన పిషింగ్ టార్గెట్లు, బాధితుల ఎకౌంట్ల‌లోకి చొర‌బ‌డ‌టం వంటి ప‌నులు చేస్తారు అని సైబ‌ర్ భ‌ద్ర‌తా నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. ఇందులో చైనా ప్ర‌త్యేక యాప్‌లైన టెన్సెంట్‌, వియ్‌బోల‌తో పాటు అడోబ్‌, కాన్వా, టెలిగ్రాం వినియోగదారుల డేటా కూడా పెద్ద ఎత్తున ఉంద‌ని తెలుస్తోంది. మ‌రింత ఆందోళ‌న క‌లిగించేలా అమెరికా ప్ర‌భుత్వం, ర‌హ‌స్య ప‌త్రాల్లో పేర్కొన్న వ్య‌క్తుల స‌మాచారం కూడా లీకైన డేటాలో ఉన్న‌ట్లు వార్త‌లు వెలువ‌డుతున్నాయి.


అయితే ఈ స‌మాచారం అంతా ఒక‌సారే దొంగిలించింది కాద‌ని.. మొద‌టి నుంచీ ఉన్న లీకు స‌మాచారానికి కొత్త విష‌యాల‌ను చేరుస్తూ వెళుతున్నార‌ని మ‌రికొంత‌మంది నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఏదేమైన ఇంత పెద్ద మొత్తంలో స‌మాచారాన్ని ఒకే చోట గుదిగుచ్చి ఉండ‌టం ప్ర‌మాద‌క‌ర‌మ‌ని హెచ్చ‌రించారు. 2019లో బ‌య‌ట‌ప‌డిన 100 కోట్ల రికార్డుల లీకు ఘ‌ట‌నే ఇప్ప‌టి వ‌ర‌కు రికార్డుగా ఉండ‌గా.. దానిని తాజా ఘ‌ట‌న అధిక‌మించింది.