మళ్లీ సీఎంగా కేసీఆర్ వస్తారు: అసదుద్ధీన్ ఒవైసీ
రాష్ట్రంలో సీఎంగా మళ్లీ కేసీఆర్ అవుతారని, బీఆరెస్ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని ఎంఐఎం చీఫ్ అసదుద్ధిన్ ఒవైసీ అన్నారు. బుధవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో హెచ్‌యుడబ్ల్యూజే మీట్ ది ప్రెస్‌లో ఒవైసీ మాట్లాడారు

- ఆరెస్‌ఎస్ చేతిలో గాంధీభవన్ రిమోట్
విధాత : రాష్ట్రంలో సీఎంగా మళ్లీ కేసీఆర్ అవుతారని, బీఆరెస్ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని ఎంఐఎం చీఫ్ అసదుద్ధిన్ ఒవైసీ అన్నారు. బుధవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో హెచ్‌యుడబ్ల్యూజే మీట్ ది ప్రెస్‌లో ఒవైసీ మాట్లాడారు. గత ఎన్నికల్లో కంటే ఇప్పుడు జరిగే ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థులు అధిక మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో ఎటువంటి కర్ఫ్యూలు, మతకలహాలు జరగలేదని ప్రశాంత పరిపాలన కొనసాగుతుందన్నారు.
పదేళ్ల నుంచి అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తించుకోవాలని తెలిపారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని అందరూ చూస్తున్నారని కేసీఆర్ చేసిన అభివృద్ధి ఆయనను గెలిపిస్తుందన్నారు. దేశంలో బీజేపీ వరుస విజయాలకు తానేందుకు బాధ్యుడినవుతానని ప్రశ్నించారు. దీనిపై సోషల్ మీడియాలో కాంగ్రెస్ నాపై దుష్ప్రచారం చేస్తుందన్నారు. బీజేపీతో మా పోరాటం కొనసాగుతుందన్నారు.
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జీవితం ఆర్‌ఎస్‌ఎస్‌తోనే ప్రారంభమైందన్నారు. గాంధీభవన్ రీమోట్ కంట్రోల్ ఆరెస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేతిలో ఉందన్నారు. గతంలో కూడా తాము వైఎస్ రాజశేఖర్ రెడ్డితో మాత్రమే ఉన్నామని, కాంగ్రెస్ పార్టీతో లేమన్నారు. ఆరెస్‌ఎస్ నిజామాబాద్‌లో బలపడవద్దని ఎంఐఎం అక్కడ పోటీ చేయడం లేదన్నారు. అజారుద్దీన్ మంచి క్రికెటర్ అని కాని విఫల రాజకీయ నాయకుడు అన్నారు.
గతంలో హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌గా అజారుద్ధిన్‌ను చేసిందే కేటీఆర్ అన్నారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గోపీనాథ్ ఏమాత్రం నియోజకవర్గం కోసం పనిచేయలేదన్నారు. గోపీనాథ్ ప్రజలకు కనపడకుండా పోయారని, అందుకే జూబ్లీహిల్స్ లో ఎంఐఎం బలమైన అభ్యర్థిని నిలబెట్టిందన్నారు. ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థులు ఏడు చోట్ల అధిక మెజార్టీతో గెలుస్తారని ఒవైసీ ధీమా వ్యక్తం చేశారు.